రాజకీయ నాయకుల తీరు అంతే. తమ చేతకానితనాన్ని అందంగా కప్పిపుచ్చుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతూ నయవంచనకు పాల్పడుతూ ఉంటారు. అవసరమైతే పార్టీలో ఉన్న నలుగురు నాయకుల చేత నాలుగు రకాలుగా మాట్లాడించి జనాలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాలను కూడా చేస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాల గురించి అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ప్రత్యేక హోదాలాంటి ‘ప్రాణాధారమైన’ విషయాలపైన కూడా ఇలాంటి రాజకీయ డ్రామాలకు తెరలేపడం మాత్రం దారుణం. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం, ప్రత్యేక హోదాతో ప్రయోజనాలే ఉంటాయి కానీ నష్టాలైతే ఉండవు…. ఈ విషయాన్ని ప్రత్యేక హోదా వద్దు అనేవాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అయినప్పటికీ రాజకీయ నాయకులు మాత్రం రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న టిడిపి, బిజెపిలే ఇలాంటి వంచన రాజకీయాలకు తెరలేపడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆవేధనకు గురిచేస్తోంది.
ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్‌లాంటి వాళ్ళు గొంతెత్తే ప్రయత్నం చేయగానే అధికార పార్టీ నేతలు ఆరున్నొక్క రాగాలు తీస్తున్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదు అని టిడిపి సీనియర్ నేత సాయిప్రతాప్ అన్నారు. ఇక మిగతావాళ్ళేమో వైఎస్. జగన్మోహన్రెడ్డికి చిత్తశుద్ధి లేదని, రాని ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని చెప్తూ, ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని చిత్తం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నారు. ‘రాని ప్తత్యేక హోదా కోసం…’ అనే మాటలకు అర్థమేంటో ఈ టిడిపి నేతలు సమాధానం చెప్పాలి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్చుకున్నా ప్రత్యేక హోదా రాదనా వీళ్ళ ఉద్ధేశ్యం. అదే నిజమైతే ఓట్లు అడుక్కోవడానికి ప్రజల ముందుకు వచ్చినప్పుడు పదేళ్ళు తీసుకొస్తాం, పదిహేనేళ్ళు ప్రత్యేక హోదాని తీసుకుని వస్తాం అని కహానీలు ఎందుకు చెప్పారు? అంటే…. ‘రాని ప్రత్యేక హోదా…’ వస్తుందని, తీసుకొస్తామని మాయ మాటలు చెప్పి జనాల చేత ఓట్లు వేయించుకున్నారా? ప్రత్యేేక హోదా ఇవ్వని బిజెపిని విమర్శించండి, టిడిపిని కాదు అని కొంతమంది టిడిపి నాయకులు కామెడీగా మాట్లాడేస్తున్నారు కానీ ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడినా సహించలేని స్థితిలో ఎవరు ఉన్నారు? ప్రత్యేక హోదా గురించి మాట్లాడే వాళ్ళ వాయిస్ జనాల్లోకి వెళ్ళకుండా చేస్తోంది ఎవరు? ప్రత్యకే హోదా కంటే కేవలం మాటలకే పరిమితమైన ప్యాకేజ్ అద్భుతః అని ప్రతిరోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తోంది ఎవరు? ప్రత్యేక హోదా ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఎన్ని చేయాలో అన్నీ చేస్తూ ఉన్న టిడిపికి ప్రత్యేక హోదా రాకుండా పోయిన పాపంలో భాగం ఉండదా?
ఇవన్నీ పక్కన పెట్టినా ‘రాని ప్రత్యేక హోదా కోసం….’ అనే మాటలు మాత్రం పూర్తిగా బాధ్యతారాహిత్యం. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం అని ప్యాకేజీ బూచీ చూపించి ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం ఇంకా దారుణం. టిడిపి నాయకులు మరియు ఆ పార్టీ మీడియా కూడా ఇదే పాచి పాటను కంటిన్యూ చేస్తూ ఉంటే మాత్రం హోదా ఎఫెక్ట్ కాస్తా బిజెపి కంటే ఎక్కువగా టిడిపిపైనే పడుతుంది. వైఎస్ జగన్, పవన్‌లకు ఉన్న చిత్తశుద్ధి గురించి పక్కన పెడితే ….అధికారంలో ఉన్న టిడిపి నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా మాత్రం ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటాలను నీరుగార్చే ప్రయత్నాలు చేయకుండా ఉంటే వాళ్ళకే మంచిది. లేకపోతే హోదా రాకపోవడానికి కారణం టిడిపినే అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించే ప్రమాదం ఉంది.