కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు… ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మంత్రిగా మారిపోతున్నట్టుగా చెప్పుకోవాలి! గడచిన కొన్ని నెలలుగా ఆంధ్రాకే పరిమితం అవుతున్నారు. ఈ రాష్ట్రంలోనే సభలు నిర్వహిస్తున్నారు. ప్యాకేజీ గొప్పతనం గురించి ప్రచారం చేస్తున్నారు. వీలు దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మెచ్చుకుంటూ ఉన్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించి, సచివాలయ నిర్మాణాల్ని పరిశీలించి వచ్చారు! ఈ క్రమంలో కాకినాడలో శుక్రవారం ఒక సభ నిర్వహించారు. ‘ఏపీ అభివృద్ధికి కేంద్ర సాయం, ప్యాకేజీపై అవగాహన’ అనే పేరుతో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభలో ఆయన మాట్లాడుతూ… ప్రత్యేక హోదా అర్హత గల రాష్ట్రాల గురించి ప్రజలకు వివరించారు.
దేశ సరిహద్దు ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలకీ, గిరిజన ప్రాంతాలు, అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకీ, అభివృద్ధికి నోచుకోని ఒడిశా, బీహార్ వంటి వాటికే స్పెషల్ స్టేటస్ ఇస్తారని చెప్పారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ ఏ కోవకీ చెందదనీ అందుకే ప్రత్యేక హోదా రాలేదని వెంకయ్య సుస్పష్టం చేశారు! అయితే, ఈ విషయం రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఆయనకి తెలీదా… తెలియకుండానే ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఆనాడు పార్లమెంటులో వెంకయ్య డిమాండ్ చేసి ఉంటారా..? రెండున్నరేళ్లపాటు అదిగో ఇదిగో ప్రత్యేక హోదా వచ్చేస్తుందని అని చెప్పినప్పుడు కూడా ఆయనకి ఈ విషయం గుర్తులేదా..? ఆంధ్రాకి హోదా అర్హతే లేనప్పుడు వస్తుందని ఎందుకు ఊరించారు..? ఇదే మాట అధికారంలోకి రాగానే అప్పుడే చెప్పినా.. ఈపాటికి ప్రజలు మరచిపోయేవారు కదా!
ఇక, భాజపాతో చంద్రబాబు దోస్తీ కొనసాగాల్సిన అవసరాన్ని కూడా మరోసారి కాకినాడ వేదికగా వెంకయ్య చెప్పారు. కేంద్రం నుంచి చంద్రబాబును బయటకి వచ్చేయమంటూ కొంతమంది డిమాండ్ చేయడం సరైంది కాదని కేంద్రమంత్రి అన్నారు. అలా బయటకి వచ్చేయడం వల్ల ప్రధాని నరేంద్ర మోడీకీ ఎలాంటి నష్టమూ ఉండదు, చంద్రబాబుకూ నష్టం ఉండదు. మధ్యలో నష్టపోయేది ప్రజలే అనే విషయాన్ని వెంకయ్య స్పష్టం చేశారు. అంటే, భాజపాతో తెలుగుదేశం దోస్తీ అనేది లోక కల్యాణం కోసం అన్నట్టుగా చెప్పార్లెండి! తరువాత, కేంద్రం ఆంధ్రాకి చేస్తున్న సాయం… చేయబోతున్న సాయం.. అంకెలూ లెక్కలూ వాటి గురించి వెంకయ్య ప్రసంగం షరామామూలే! బాటమ్ లైన్ ఏంటంటే… కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఈ మధ్య ఆంధ్రాపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తున్నట్టున్నారు! ఆయన ఏపీ వ్యవహారాల మంత్రి అయిపోయారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీ ప్రచారం బాగా ఎక్కువైపోయిందంటూ సెటైర్లు పడుతున్నాయి. ఇంకా.. ఇలాంటి సభలు అవసరమా..?