ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యద్భుతంగా నిర్మిస్తూ ఉన్నాడు, వేలాది పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గరకూ వస్తూ ఉన్నాయి, చంద్రబాబు బెదిరింపులకు భయపడి పోయిన నరేంద్రమోడీ ప్రత్యేక హోదా ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు, సింగపూర్, స్విట్జర్లాండ్, అమెరికా……ఇంకా అభివృద్ధిలో దూసుకెళ్తున్న అనేక దేశాలకంటే అత్యద్భుతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం ఖాయం…….ఇవీ రెండున్నరేళ్ళుగా టిడిపి అనుకూల మీడియా వండి వార్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వడ్డిస్తూ వచ్చిన వార్తల కథనాలు….సారీ కథలు.
అయితే అవేవీ జరగలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉచిత హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారు. నరేంద్రమోడీ కూడా చంద్రబాబును పట్టించుకోవడం మానేశాడు అన్నది వాస్తవం. ప్రత్యేక హోదాకు మంగళం పాడేశారు. విశాఖకు రైల్వే జోన్ అనే అంశాన్ని లూప్ లైన్లోకి నెట్టేశారు. ఇక పోలవరం మాయలు అన్నీ ఇన్నీ కావు. చంద్రబాబు ఎన్ని దేశాలు తిరిగినా, వైజాగ్ సమ్మిట్ లాంటివి ఎన్ని ఏర్పాటు చేసినా వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులు కనీస స్థాయిలో కూడా లేవు. గడిచిన రెండున్నరేళ్ళ చరిత్రను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని చూస్తూ ఉంటే రాబోవు రెండున్నరేళ్ళలో కూడా ఏవైనా అద్భుతాలు జరుగుతాయన్న ఆశలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేకుండాపోయాయి. అందుకే వాళ్ళలో అసంతృప్తి పెల్లుబుకుతోంది.
ఆ మొత్తం ఫెయిల్యూర్ పాపాన్ని ఎవరి ఖాతాలో వేయాలా? అన్న ఆత్రంలో చంద్రబాబు, ఆయన అనుకూల మీడియావారు ఉన్నట్టుగా ఉన్నారు. ఉద్యోగులందరూ అవినీతిపరులే, లంచగొండులే అన్న తరహా వార్తలను వినిపిస్తున్నారు. చంద్రబాబు అహర్నిశలూ కష్టపడుతూ ఉంటే ఉద్యోగులు మాత్రం కనీస స్థాయిలో కూడా కష్టపడడం లేదు. పైగా లంచాల కోసం పీడిస్తూ ఆంధ్రప్రదేశ్‌ని అవినీతి రాష్ట్రంగా చేస్తున్నారు అని చాలా కథనాలనే వండుతున్నారు. ఉద్యోగులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా అవినీతిపరులే అన్న కథనాలు తాజాగా దర్శనమిస్తున్నాయి. దందాలు చేస్తూ, ఉద్యోగుల దగ్గర పర్సంటేజీలు తీసుకుంటూ, ప్రతి చిన్న పనికీ లంచాలు బొక్కుతూ చంద్రబాబుకు చెడ్డపేరు తీసుకొస్తున్నారట. ఉద్యోగులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అవినీతిపరులు, అసమర్ధులు కాబట్టే చంద్రబాబు కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతోందట. అందుకే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో సగం మందికి సీట్లు ఇవ్వకుండా ఉంటే చంద్రబాబు మరోసారి గెలవడం ఖాయం అన్నట్టుగా వార్తలు రాసేస్తున్నారు. అసమర్థులు, అవినీతిపరులు అయిన టీం మెంబర్స్‌ని ఏమీ అనలేని, సమర్థులను ఎంపిక చేసుకోవడం చేతకాని టీం లీడర్ని ప్రజలు ఎలా క్షమిస్తారని అనుకుంటున్నారో తెలియదు మరి.
దేశంలో ఉన్న ….ఆ మాటకొస్తే ప్రపంచంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడికి కూడా చంద్రబాబుకు ఉన్నంత రేంజ్ భక్త జన మీడియా ఉండదేమో. సూది మందంపాటి సక్సెస్ సాధించినా చంద్రబాబు వీరుడు, సూరుడు, పదిమంది బాహుబలులతో సమానం అని భజన చేయడం, రాబోయే ఫెయిల్యూర్ని ముందుగానే పసిగట్టి ఆ పాపభారాన్ని వేరే వాళ్ళమీదకు తోసేయడం విషయంలో చంద్రన్న అనుకూల మీడియాది అందెవేసిన చేయి. అట్టే మాట్టాడితే….ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉచితాలకు అలవాటుపడ్డారు, అవినీతిపరులు, క్రమశిక్షణ లేదు, టెక్నాలజీని వాడుకునే స్థాయి తెలివితేటలు లేవు…..అందుకే ప్రపంచదేశాల అధినేతలూ, ఆయా దేశాల్లో ఉన్న భారీ పరిశ్రమల యజమానులందరికీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్థ్రంన్ని అభివృద్ధి చేయాలని మహా ఇదిగా ఉన్నా కూడా….. ఆంధ్రప్రదేశ్ ప్రజల అలవాట్లు, ప్రవర్తన నచ్చక వాళ్ళెవరూ కూడా అమరావతికి రావడం లేదని కూడా రాసేయగల ఘనాపాఠీలు ఈ చంద్రన్న మీడియా భక్తులు.