సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఓ సిసలైన మల్టీస్టారర్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాడు దిల్ రాజు. అంతే కాదు మొదటి సినిమా దిల్ నుంచి కూడా దిల్ రాజు పంథా కాస్త ప్రత్యేకంగానే ఉంటుంది. ఆర్య, బొమ్మరిల్లు, భద్ర లాంటి సినిమాలతో ఓ ప్రొడ్యూసర్‌గా సూపర్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు దిల్ రాజు. అయితే ఆ తర్వాత అదే జోష్ని కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఫ్లాప్స్, హిట్స్‌తో సంబంధం లేకుండా ఇప్పటి వరకూ 24 సినిమాలను ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు, ఇప్పుడు ‘శతమానం భవతి’ సినిమాతో సిల్వర్ జూబ్లీ కొట్టబోతున్నాడు. అందుకే ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ని చాలా ప్రత్యేకంగా, భారీగా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు.
ఇప్పటి వరకూ శ్రీ వెంకటేశ్వర బేనర్ సినిమాలలో హీరోలుగా యాక్ట్ చేసిన అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలన్న ప్రయత్నాల్లో ఉన్నాడు. అందులో భాగంగా అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్‌లను ఒకే వేదికపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వేరే ఏ నిర్మాతకైనా ఇది కాస్త అసాధ్యమైన విషయమే. అయితే నైజాంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దిల్ రాజుకు ఉన్న థియేటర్స్, అలాగే మెగా హీరోలతోపాటు ఎన్టీఆర్, ప్రభాస్‌లతో కూడా ఉన్న సన్నిహిత సంబంధాలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ఈ దిల్లున్న ప్రొడ్యూసర్‌కి సాధ్యమయ్యేలానే కనిపిస్తోంది. అదే జరిగితే ఆయా హీరోల అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఓ సూపర్ ఈవినింగ్ని సూపర్‌గా ఎంజాయ్ చెయ్యొచ్చు.