చెప్పే నీతులకు…. చేతలకు, మాటలకు అస్సలు సంబంధం లేనివాడేరా…రాజకీయ నాయకుడంటే అని తెలుగు సినిమా హీరోల స్టైల్లో అందరూ చెప్పుకునే పరిస్థితులు దాపురించాయి. కుల రాజకీయాల గురించి నీతులు చెప్పని రాజకీయ నాయకుడు ఒక్కడు కూడా లేడు. మత రాజకీయాలను దునుమాడుతూ నీతి బోధ చేయకుండా ఉన్న రాజకీయ నాయకులు కూడా లేరు. కానీ ఈ నీతులన్నీ కేవలం వల్లె వేయడం వరకే. వాళ్ళ చేతల్లో, మాటల్లో మనకు కనిపించే చిత్రం మాత్రం ఈ నీతులకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది.
భయపడకుండా ఉండడం కోసం అని చెప్పి బైబిల్ని చేతపట్టి ఎన్నికల ప్రచారానికి వస్తుంది ఓ గౌరవ మహిళా నేత. మరి అదే మహిళా నేతగారు… పెళ్ళిళ్ళకు అటెండ్ అయినప్పుడు, బయట వేరే కార్యక్రమాలకు అటెండ్ అయినప్పుడు మాత్రం చేతిలో బైబిల్ ఉండదు ఎందుకనో మరి. అంటే ఓటర్ల దగ్గరకు వెళ్ళేటప్పుడు మాత్రమే ఆవిడగారు భయపడతారన్నమాట. ఇక కుల, మత రాజకీయాలంటే నాకు అసహ్యం…ఛీ…ఛీ…అని భారీ డైలాగులను సినిమాటిక్ ఆవేశంతో డైనమైట్లలా పేల్చిన ఓ స్టార్ పొలిటీషియన్గారు……అందరినీ హాశ్ఛర్యానికి గురిచేస్తూ నా భార్య క్రిష్టియన్ అని మతం కార్డ్ వాడేశాడు. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని విమర్శలు చేస్తేనేమో….అది నా పర్సనల్, కామెంట్ చేసే రైట్స్ ఎవ్వరికీ లేవు అంటాడు. అదే ఓట్ల అవసరం వచ్చేసరికి ఆ పర్సనల్ విషయాలను ట్రంప్ కార్డ్‌లా వాడేస్తాడు. ప్రస్తుతానికి ఒక భార్య మతం గురించి చెప్పేశాడు. ఇక మిగతా ఇద్దరు భార్యల కులం, మతం గురించి కూడా చెప్పేస్తే దాదాపు తొంభై శాతం ఓటర్లు కవర్ అయిపోతారు. ఇక నాయుడంటేనే నాయకుడు అని పేలిన ఆంద్రప్రదేశ్‌కి పెద్ద దిక్కులాంటి బిజెపి నాయుడి కులాభిమానం గురించి ప్రత్యేకంగా ఏం చెప్తాం? అలాగే ఏ కులం నాయకులను ఆ కులం వాళ్ళతోనే తిట్టించాలన్న కులం కాన్సెప్ట్‌ని రాజకీయ నాటకరంగంలోకి రంగప్రవేశం చేయించిన మన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పొలిటీషియన్గారు… కులగజ్జి గురించి కూడా ప్రపంచానికి పాఠాలు చెప్పెయ్యగల సమర్థులు అని రాజకీయ పరిశీలకులందరికీ తెలిసిన విషయమే. తన ‘సత్తా’ ఏంటో చూపిస్తా..? సమాజాన్ని మార్చేస్తా….అని ఆ మధ్య ఎంట్రీ ఇచ్చిన ఓ క్లాస్ పొలిటీషియన్…. తీరా ఎన్నికల్లో పోటీ చేయాల్సివచ్చేసరికి మాత్రం కుల సమీకరణాలను తన ఐఏఎస్ స్థాయి తెలివితేటలతో అధ్యయనం చేసి తన కులానికి బాగా పట్టున్న కూకట్ పల్లి నుంచి పోటీచేసి ‘తనేంటో’ ఆయనే నిరూపించుకున్నాడు.
ఓ కుల సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ….సిఎం ఛాన్స్ అనేసరికి…రాత్రికి రాత్రే ఓ పొలిటికల్ పార్టీలోకి జంప్ అయిపోయి ఎమ్మెల్యే అయిపోయిన ఓ కుల నాయకుడి లీలలు ఇప్పుడు మామూలుగా లేవు. నయిూం చనిపోయిన మరుక్షణం నుంచే… అందరూ కూడా ఆ క్రిమినల్ని అసహ్యించుకుంటున్నారు. వాడితో సంబంధాలున్నాయి అని మీడియాలో వార్తలు వచ్చినా, ఎవరైనా ఆరోపణలు చేసినా….వెంటనే మీడియా ముందుకు వచ్చి….ఆ నయిూం ఓ రాక్షసుడు, వాడికీ నాకూ అస్సలు సంబంధం లేదని ఖండఖండాలు కండిస్తున్నారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల నాయకులందరూ కూడా నయిూంతో సంబంధాలున్నాయని ఎక్కడ వార్తలు వస్తాయో అని భయపడుతుంటే…….. ఆ కుల నాయకుడు ఒక్కడు మాత్రం నయిూంతో గురుశిష్యలు బంధం ఉంది అనే రేంజ్లో మాట్లాడేశారు. నయిూం తనను కలిసేవాడని చెప్పుకొచ్చాడు. తాను ముఖ్యమంత్రి అయితే చూడాలన్న ఆశ నయిూంకి ఉండేదని చెప్పాడు…..ఇంకా కూడా వాళ్ళిద్దరి అనుబంధం గురించి చాలా చాలా చెప్పేశాడు. ఇవే మాటలు వేరే ఏ రాజకీయ నాయకుడు చెప్పి ఉన్నా మీడియాతో పాటు, మిగతా పార్టీల నాయకులందరూ కూడా కేవలం విమర్శల వాక్బాణాలతో ఆ నాయకుడిని చంపేసి ఉండేవాళ్ళు. కానీ విచిత్రంగా ఈ నాయకుడిని మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడా విమర్శించే సాహసం చేయలేదు. దానికి కారణం కులం. ఆ నాయకుడికి ఉన్న ఒకే ఒక్క బలం కూడా అదే.
ఇక గత కొన్ని దశాబ్ధాలుగా భాగ్యనగర రాజకీయాలను శాసిస్తున్న ఓ మత నాయకుడు తలాక్ ఇష్యూపై రెచ్చిపోయి మాట్లాడేశారు. మా మతం గురించి ఎందుకు మాట్లాడతారు? అని అంటూ…. హిందువుల్లోనే విడాకులు ఎక్కువ అని తన ప్రసంగాన్ని ప్రారంభించి గణాంకాలతో సహా వివరిస్తూ హిందూ మత సాంప్రదాయాల గురించి చాలా చాలా మాట్లాడేశాడు. మా మతానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడొద్దు అని ఆవేశపడుతున్న ఈయనగారు వేరే మతం గురించి చిత్తం వచ్చినట్టుగా ఎలా మాట్లాడేశారో తెలియదు మరి. ఇంతకుముందు ఈయన తమ్ముడుగారు కూడా…ఎలా లేక్కలు వేసుకున్నాడో ఏమో తెలియదు కానీ ….ఆయన లెక్క ప్రకారం …ఆయన అడిగినన్ని గంటలు టైం ఇస్తే ఓ మతాన్ని లేకుండా చేసేస్తానని పేలాడు. ఇంత వరకూ ఆయనను శిక్షించినవాళ్ళే ఎవరూ లేరు. చాలా పెద్ద మాటలు మాట్లాడేసిన తమ్ముడినే ఎవ్వరూ ఏమీ చేయలేదు. ఇక అన్నయ్యను ప్రశ్నించే ధైర్యం ఎవరికి ఉంది?
సో…….భారతీయులందరూ నేర్చుకోవాల్సిన నీతి ఏంటయ్యా అంటే…….మతం సపోర్టో, కులం బలమో…మీ వెనకాల ఉండేలా చూసుకోండి. ఎన్ని తప్పులైనా చేసుకోండి. మిమ్మల్ని ఏ చట్టాలూ ఏమీ చేయలేవు.