రవితేజ మూడ్ సినిమాల నుంచి ఎప్పుడో తప్పుకొంది. మంచి కథ వస్తే చేద్దాం – లేదంటే ఖాళీగా కూర్చున్నా ఫర్వాలేదు.. అనుకొంటున్నాడు. అందుకే బెంగాల్ టైగర్ తరవాత రవితేజ సినిమా ఏదీ ఇంత వరకూ పట్టాలెక్కలేదు. ఈమధ్య చాలామంది కథలు విన్నాడు. కొన్ని కథలు స్క్రిప్టులుగా మారాయి. కొన్ని స్క్రిప్టులు ఫైనల్ కూడా అయ్యాయి. నేడో.. రేపో షూటింగ్ అనగా.. ఆ ప్రాజెక్టులు ఆగిపోయేవి. ఈలోగా దర్శకుడు బాబి రంగ ప్రవేశం చేశాడు. పవర్ సినిమాతో రవితేజనే బాబికి లైఫ్ ఇచ్చాడు. వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజకు ఆ సినిమా బాగా హెల్ప్ అయ్యింది. అందుకే బాబికి రెండోసారి పిలిచి అవకాశం ఇచ్చాడని చెప్పుకొన్నారు. ఈ ప్రాజెక్టు మొత్తాన్ని కోన వెంకట్ సెట్ చేసి పెట్టాడు. కథ, స్క్రిప్టు అన్నీ ఓకే అనుకొన్నాక ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయిందని తెలుస్తోంది.
దీనికి కారణం పారితోషికం విషయంలో రవితేజ అవలంభిస్తున్న వైఖరే అని తేలింది. ఈ సినిమా కోసం రవితేజ ఏకంగా రూ.9 కోట్ల పారితోషికం డిమాండ్ చేశాడట. దాంతో నిర్మాత అవాక్కయ్యాడని టాక్. రవితేజ పారితోషికం అటుంచితే.. టెక్నీషియన్లు, హీరోయన్, ఇతర నటీనటులుగా ఎవరెరరిని ఎంచుకోవాలన్న విషయంలో రవితేజనే డెసిషన్స్ తీసుకొంటున్నాడని, రవితేజ చెప్పినవాళ్లని తీసుకొంటే.. పారితోషికం తడిసి మోపెడవుతోందని అందుకే నిర్మాత ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యాడని చెప్పుకొంటున్నారు. రవితేజ పారితోషికం తగ్గించుకొంటేనో, లేదంటే మిగిలిన విషయాల్లో జోక్యం తగ్గించుకొంటేనో.. ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లేదే. సర్దార్ ఫ్లాప్‌తో బాగా డౌన్ అయిన బాబీ.. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొన్నాడు. పాపం.. అతని పరిస్థితేంటో?