మన రాజకీయ నాయకులకు విషయ పరిజ్ఙానం చాలా తక్కువ. నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా ఉండదు. అందుకే జీవితాంతం ఒకే రకమైన ప్రసంగాలతో జనాలను విసుగెత్తిస్తూ ఉంటారు. అన్ని పార్టీలలోనూ ఉండే తొంభై శాతం పరాన్న జీవులు, జీ హుజూర్ బ్యాచ్‌ని పక్కన పెడితే ఎప్పుడూ మీడియాలో కనిపించేవాళ్ళతో పాటు కొంతమంది అగ్రశ్రేణి నాయకులు కూడా అసలు విషయం గురించి చెప్పడం కంటే కూడా వాదోపవాదాలు, వ్యక్తిగత దూషణలతోనే కాలం వెల్లిబుచ్చుతూ ఉంటారు.
తాను మాత్రం అలాంటి నాయకుడిని కాదని అనంతపురం సభతో నిరూపించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన అభిప్రాయాలతో విభేదించేవాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. కానీ ప్రజల ముందుకు వచ్చే ముందు పవన్ చేసిన అధ్యయనాన్ని మాత్రం అభినందించాల్సిందే. సాదా సీదా మార్కుల స్టూడెంట్‌ని అని తన గురించి తానే చెప్పుకున్న పవన్….నిపుణులు, అనుభవజ్ఙులతో కూర్చుని అవగాహన పెంచుకున్నానని చెప్పడం అభినందనీయం. నిజానికి నాయకులే కాదు, గొప్ప గొప్ప చదువులు చదువుకుంటున్న నేటి యువతరం కూడా ప్రభుత్వ నిర్ణయాలు, పాలకుల విధానాలకు సంబంధించిన విషయాలను అధ్యయనం చేస్తే సమాజాభివృద్ధికి అది చాలా తోడ్పడుతుంది. పోలవరం ప్రాజెక్ట్‌కి కేవలం ఎనిమిది వేల కోట్లు ఇచ్చి మమ అనిపించే ప్రయత్నాల్లో కేంద్రం ఉందని పవన్ చెప్పాడు. అలాగే ప్యాకేజ్ గురించి కూడా పవన్ కళ్యాణ్ బాగానే అధ్యయనం చేశాడని తెలుస్తోంది. ఆలికి అన్నం పెడుతూ ఊరికి ఉపకారం చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారన్న మాటలు కూడా చాలా బాగున్నాయి. రాజకీయాలను, ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేస్తున్న పవన్ తీరును మాత్రం పార్టీలకతీతంగా అందరూ అభినందించాల్సిందే.
అలాగే అదే అలవాటును వైఎస్ జగన్వారు కూడా అలవర్చుకుంటే ఆయనకే మంచిది. ఇదే ప్యాకేజ్ గురించి, పోలవరం గురించి వైఎస్ జగన్ చాలా సార్లు మాట్లాడారు. కానీ ఆయన మాటలన్నీ పరమ రొటీన్ అయిపోతున్నాయి. ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపెయ్యాలి, సిగ్గులేని ప్రభుత్వం, చంద్రబాబు రాజీనామా చేయాలి లాంటి మాటలతో జనాలకు బోర్ కొట్టించేస్తుంటాడు జగన్. ఆ బంగాళాఖాతంలో కలపాలన్న డైలాగ్ అయితే చిరాకు తెప్పించేలా కూడా తయారైంది. అసెంబ్లీలో కూడా ఏదైనా ఒక సబ్జెక్ట్ పైన మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఆ అవకాశాన్ని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ఇస్తున్నాడు జగన్. చంద్రబాబును తిడుతూ మాట్లాడే ఛాన్స్‌ని మాత్రం తను తీసుకుంటున్నాడు. అలాగే ఇప్పుడు నోట్ల రద్దు గురించి తెలుగు వాళ్ళందరూ చర్చించుకుంటున్నారు. అలాంటి ఓ సంచలన విషయంపై స్పందించే తీరిక ఇప్పటి వరకూ జగన్‌కు లేకుండా పోయింది. ఇలాంటి విషయాల్లోనే జగన్‌కి మైనస్ మార్కులు పడిపోతున్నాయి. అదేమంటే నాకు ఇంగ్లీష్ వచ్చు..చంద్రబాబుకు రాదు….అందుకని నేనే మేధావిని అనేలా మాట్లాడుతూ ఉంటాడు. కానీ కొత్త పార్టీ పెట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ చూసుకుంటే ఎన్ని విషయాలను అధ్యయనం చేశాడు? ఎంత మేరకు తన విషయ పరిజ్ఙానాన్ని పెంచుకున్నాడు లాంటి ప్రశ్నలకు తనకుతానే సమాధానం చెప్పుకోవాలి జగన్. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటుంది వ్యవహారం.
ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనినీ ‘ఖండిస్తున్నా’ అనే సింగిల్ డైలాగ్‌తో కొట్టిపారేయడం, వ్యక్తిగత దూషణల్లాంటివి ఆల్రెడీ దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్నవారికి సరిపోతాయేమో కానీ కొత్తగా వచ్చినవాళ్ళకు మాత్రం అలాంటివి మైనస్ అవుతాయి. చంద్రబాబు ప్రభుత్వంపైన ఉన్న వ్యతిరేకతే తనకు సిఎం కుర్సీ దక్కేలా చేస్తుంది అనేలాంటి భ్రమలు కూడా జగన్‌కి మంచిది కాదు. అందుకే వచ్చే రెండున్నర సంవత్సరాల్లో అయినా సరే తన భవిష్యత్ ప్రణాళిక ఏంటో ప్రజలకు చెప్పాలి. అంటే మళ్ళీ అవి ఉచితంగా ఇస్తా…ఇవి ఫ్రీ….చంద్రబాబుకంటే ఎక్కువ పెన్షన్లిస్తా లాంటి హామీలు కాకుండా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తనైతే ఏ విధంగా అభివృద్ధి చేయగలడో ప్రజలకు వివరించగలగాలి. బహిరంగ సభలతో పాటు, మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తన విధానాలు, ఆలోచనలు ఏంటో ప్రజలకు వివరించాలి. అలా చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయాలన్నింటినీ అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేసే అలవాటును శ్రీ జగన్వారు అలవాటు చేసుకోకపోతే మాత్రం……గెలిచిన వాడికి, నాకూ తేడా జస్ట్ ఐదు లక్షల ఓట్లే అనో లేకపోతే ఇంకాస్త ఎక్కువనో…ఇంకా చాలా సార్లు చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి.