పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం భారీగా తగ్గుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు. నల్లధనానికి అడ్డుకట్ట వేయడం, దొంగనోట్లకు చెక్ పెట్టడం గురించి ఆయన మాట్లాడలేదు. గవర్నర్ తో భేటీ సమయంలోనూ ఖజానాకు వచ్చే ఆదాయం గురించే మాట్లాడారట.
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 40 శాతం తగ్గడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ. 997 కోట్లకు బదులు రూ. 585 కోట్లు రావడం ఆయనకు నిరాశ కలిగించింది. పెద్ద నోట్ల రద్దుతో రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలు భారీగా తగ్గాయి. ఫలితంగా ప్రభుత్వానికి పన్ను రూపంలో వచ్చే ఆదాయానికి గండిపడింది.
సంపన్న రాష్ట్రం తెలంగాణలో ప్రభుత్వం అనేక పథకాలను చేపట్టింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు భారీగా నిధులు కావాలి. ఈ విషయంలో కేంద్రం నుంచి కొంత సానుకూల స్పందన వచ్చింది. మిషన్ భగీరథకు రూ. 5000 కోట్ల సాయానికి నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫార్సు చేసింది.
కాళేశ్వరం భారీ ప్రాజెక్టుతో పాటు ఇంకా అనేక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు దండిగా నిధులు కావాలి. ఓ వైపు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు రుణమాఫీలు ప్రభుత్వానికి భారంగా మారాయి. ఆ బకాయిల చెల్లింపే తలకు మించిన భారంగా తయారైంది. పన్నుల రూపంలో ప్రతినెలా వచ్చే ఆదాయంపై అంచనాలతో ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది.
హటాత్తుగా రూ. 500, 1000 నోట్ల రద్దుతో హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా భూముల క్రయవిక్రయాలకు బ్రేక్ పడింది. రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయి. భూముల రిజిస్ట్రేషన్ల ఫీజుల ద్వారా రోజుకు 300 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. కానీ గత మూడు రోజులుగా ఇది రోజుకు 50 కోట్లు కూడా లేదని తెలుస్తోంది. కార్లు, ఇతర వాహనాల విక్రయంపైనా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. అదీ తగ్గింది.
పెద్ద నోట్ల రద్దుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్పందన పరస్పర విరుద్ధంగా ఉంది. లోటు బడ్జెట్ ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద నోట్ల రద్దును సమర్థించారు. అక్కడా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతుంది. అయినా, నల్లధనాన్ని అరికట్టేందుకు ఇది అవసరమని చెప్పారు.