పెద్ద నోట్ల రద్దుతో జనం చాలా మంది డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు మాత్రం ఇది కాసుల వర్షం కురిపిస్తోంది. పాత 500, 1000 రూపాయల నోట్లతో ఆస్తి పన్ను, నల్లా బిల్లు ఇతర చెల్లింపులు చేయవచ్చనే వెసులు బాటును చాలా మంది ఉపయోగించుకున్నారు. దీంతో శుక్రవారం ఒక్కరోజే జీహెచ్ ఎంసీకు దాదాపు 50 కోట్ల రూపాయల పన్నులు వసూలయ్యాయి.
ఒక్కరోజులో నగరంలో ఈ స్థాయిలో వసూళ్లు జరగడం ఓ రికార్డు. రద్దయిన నోట్లను జేబులో పెట్టుకుని ఉపయోగం లేదు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసినా వారానికి 20 వేలక మించి డ్రా చేసుకునే అవకాశం లేదు. దీంతో పన్ను బకాయిలను చెల్లించడానికి ఈ నోట్లను ఉపయోగించారు చాలా మంది. కొంత మంది చాలా ఏళ్లుగా ఆస్తిపన్ను కట్టడం లేదు. లక్ష రూపాయలకు పైగా బకాయి పడ్డ వారూ చాలా మంది ఉన్నారు. వారంతా శుక్రవారం చెల్లించేశారు.
ఇదే అదనుగా వీలైనంత మేరకు పన్నులు రాబట్టడానికి అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటలకు కూడా ఈ కౌంటర్లలో ప్రజలు పన్నులు కట్టడం కనిపించింది.
జల మండలికి నల్లా బిల్లు బకాయిలు కూడా బాగానే వసూలయ్యాయి. ఒక్కరోజే సుమారు 18 కోట్లు వసూలైనట్టు అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో ఈ గడువును మరో మూడు రోజులు పొడిగించారు. ఆదివారం వరకూ పాతనోట్లతో పన్నులు చెల్లించే అవకాశం ఉందని ప్రకటించారు. రెండో శనివారం, ఆదివారం కూడా సెలవులు రద్దు చేసి పన్నుల వసూలుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఈ మూడు రోజుల్లో ఇంకా భారీగానే వసూళ్లు జరుగుతాయిన అంచనా వేస్తున్నారు.