మనిషి జీవితంలో మాటకు చాలా విలువ ఉంటుంది. అందుకే ఆచితూచి మాట్లాడమంటారు. కానీ మన నాయకులకు మాత్రం అవేవీ వర్తించవు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వచ్చేలా చేసింది నేను అని అనుకూల మీడియాలో అద్భుతంగా ప్రచారం చేయించుకున్నాడు వెంకయ్య. నరేంద్రమోడీ, చంద్రబాబులు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకాన్ని ఓటర్లకు కలిగించారు. హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో, ఎన్ని వేల పరిశ్రమలు వస్తాయో, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయో ఓటర్లందరికీ అర్థమయ్యేలా చేశారు. అధికారంలోకి వచ్చారు.
ఇక ఆ తర్వాత నుంచి రెండేళ్ళపాటు రకరకాల ఫీలర్లు వదిలారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని లాభాలు ఉంటాయో చెప్పడానికి, అధికారంలోకి రావడానికి ఏ మీడియాను అయితే ఉపయోగించుకున్నారో…అదే మీడియాలో పూర్తి వ్యతిరేక వార్తలు రాయించారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదని చెప్పుకొచ్చేశారు. ప్రత్యేక హోదాతో ఒక్క పరిశ్రమ కూడా రాదు, ఒక్క ఉద్యోగమూ రాదని మాట్లాడేశారు. ఇప్పుడు కూడా వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్‌లు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన ప్రతిసారీ…ప్రత్యేక హోదా రాదు అని చెప్పడానికి టిడిపి, బిజెపి నాయకులు నానా తంటాలూ పడుతున్నారు. ప్రత్యేక హోదా రాదు అంటే అసలు వెంకయ్య, చంద్రబాబుల ఉద్ధేశ్యం ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. వీళ్ళిద్దరూ అధికారంలో ఉన్నంతవరకే హోదా రాదనా? లేక ఎవ్వరు అధికారంలో ఉన్నా రాదనా? అయినా వేరే వాళ్ళు అధికారంలోకి వస్తే హోదా రాదా? వస్తుందా? అన్న విషయం వీళ్ళెలా చెప్పగలరు. ప్రత్యేక హోదా రాదు అనేకంటే కూడా మేం అధికారంలో ఉండగా ప్రత్యేక హోదా ఇవ్వం అని చెప్తే కరెక్ట్‌గా ఉంటుంది కదా. అయినా ప్రత్యేక హోదా ఒక బ్రహ్మాండం, అద్భుతం..అదొక్కటి చాలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళిపోవడానికి అని మాటలు చెప్పారు. ఆ హోదా రావాలంటే మేమే అధికారంలోకి రావాలన్నారు. ఇప్పుడు హోదా వేస్ట్ అంటున్నారు. ఆ వేస్ట్ కూడా రాదంటున్నారు. ఇవన్నీ చూస్తున్న పరిశీలకులు మాత్రం ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు, వెంకయ్యలు ఎంత మౌనంగా ఉంటే వాళ్ళిద్దరి రాజకీయ భవిష్యత్తుకు అంతమంచిదని సలహా ఇస్తున్నారు. మాటలతో మాయ చేయడం ఎల్లవేళలా సాధ్యం కాదని వాళ్ళు చెప్తున్నారు.