క్రికెట్ మ్యాచ్, సినిమా టికెట్స్ కోసం గంటలు గంటలు క్యూలలో నిలబడతారు. దేశం కోసం ఓ రెండు మూడు గంటలు క్యూలో నిలబడలేరా? అని బిజెపి నేతలు, మోడీ అభిమానులు పంచ్ డైలాగులు పేలుస్తున్నారు. కానీ అలా క్యూలలో వెయిట్ చేస్తున్నవాళ్ళ ఇబ్బందుల గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదనే అనుకుందాం. మరి వైద్య ఖర్చుల కోసం కొత్త నోట్లను మార్చుకుందామంటే కుదరక ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదా? ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని మన చట్టాలు కూడా చెప్తూ ఉంటాయి. చేయని తప్పుకు చనిపోతున్న నిర్దోషుల మాటేంటి? మా అమ్మ కూడా నోట్ల కోసం స్వయంగా బ్యాంకుకు వెళ్తోంది, నన్ను చంపేస్తారేమో లాంటి సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ భక్తులకు బాగుంటాయేమో కానీ మామూలు జనాలకు, అవగాహన ఉన్నవాళ్ళకు కాదు. నోట్ల రద్దు నిర్ణయం గొప్పదా? కాదా? అనే విషయం కూడా మోడీనే చెప్పినట్టుగా డిసెంబర్ చివరలో రిజల్ట్స్ చూసి అప్పుడు మాట్లాడుకుందాం. కానీ సామాన్యుల కష్టాల గురించి కనీస మాత్రంగా కూడా మోడీ ప్రభుత్వం ఆలోచించలేకపోయింది అన్నమాట వాస్తవం. అందుకే గ్రామాల్లో ఉండే వృద్ధులు, రోగులు, పొట్టకూటి కోసం కూలీనాలీ చేసుకుని బ్రతికేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారులందరూ కూడా నానా కష్టాలూ పడుతున్నారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది కాబట్టి ఆ కష్టాలు భరించాలి అనే అనుకుందాం. కానీ ఆ నమ్మకాన్ని మోడీ ఎక్కడ ఇస్తున్నాడు?
అవినీతి పైన ఉక్కు పాదం మోపుతా, సామాన్యులు ప్రశాంతంగా నిద్రపోతున్నారు, నల్ల రాకాసురులకే నిద్దర్లు పట్టడం లేదు అని ఆయన పంచ్ డైలాగులు పేలుస్తున్నాడు కానీ వాస్తవ చిత్రం వేరుగా ఉంది. మోడీ చెప్పిన నల్ల రాకాసురుల లిస్టులో గాలివారు ఉన్నారా? లేదా? సుష్మా స్వరాజ్‌కి దత్త పుత్రుడి లాంటి గాలివారు బిజెపికి నల్ల రాకాసురుడిలా కనిపించడం లేదేమో కానీ ప్రజలకు మాత్రం టాప్ మోస్ట్ నల్ల రాకాసురుడిలాగే కనిపిస్తున్నాడు. నోట్ల రద్దుతో సామాన్యులేమో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న వార్తలు వినిపిస్తూ ఉంటే….మరోవైపు ఈ నల్ల రాకాసురుడివారి ఇంట పెళ్ళి వైభోగం మాత్రం కళ్ళు భైర్లు కమ్మేలా చేస్తోంది. పెళ్ళి కూతురి చీర 17 కోట్లట. నగలు 90 కోట్లట….ఇక మిగతా వివరాలు కూడా తెలుసుకుంటే గుండె ఆగిపోవడం ఖాయం. బిజెపి నాయకులు, అది కూడా ముఖ్యమంత్రి స్థాయి నాయకులు ఈ పెళ్ళికి హాజరవుతున్నారు. మోడీ ప్రధాని అయి రెండేళ్ళ పైనే అవుతోంది. ఓ నల్ల రాకాసురుడేమో మోడీవారి నిఘా కళ్ళు తప్పించుకుని లండన్ చెక్కేశాడు. సోషల్ మీడియాలో స్టేట్మెంట్స్ ఇస్తూ……‘వెంట్రుక కూడా పీకలేరు….’ అనేలా ప్రవర్తిస్తున్నాడు. చెప్పుకోవడానికి కఠినంగా ఉన్నా వాస్తవం అదే. మోడీవారేమో నల్లరాకాసురుల గుండెల్లో నిద్రపోతా…వాళ్ళకు నిద్రలేకుండా చేస్తా అని అంటూ ఉన్నాడు. ఇక్కడ గాలివారేమో తన రాజవైభోగం ఏంటో సామాన్యులకు దిమ్మ తిరిగే రేంజ్లో ప్రదర్శిస్తున్నాడు. జయాజీ నిర్దోషిగా బయటికి వచ్చింది కూడా మోడీ హయాంలోనే. ఈ రెండేళ్ళలో ఒక్క బడా నల్ల రాకాసురుడ్ని అయినా శిక్షించి ఉండి ఉంటే మోడీ నోట్ల రద్దు నిర్ణయంతో కూడా అలాంటి అద్భుతం ఏదో జరిగిపోతుందని అందరూ నమ్మేవారు. రాబోయే రెండేళ్ళలో మిగతా నల్ల రాకాసురులను కూడా మోడీ శిక్షిస్తారు అని ఆశగా ఎదురుచూసేవాళ్ళు. నేను ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాను అని మోడీ చెప్తున్నాడు. నోట్ల రద్దు నిర్ణయానికి ధైర్యం అవసరం లేదు. విదేశాల్లో నల్ల ధనం దాచుకున్న రాకాసురులనో, సహజ వనరులు, ప్రజల ఆస్థులను దర్జాగా దోచుకుని…ఆ నల్లధనంతో వాళ్ళ రాజవైభోగాన్ని తిరిగి ఆ ప్రజలకే ప్రదర్శిస్తూ…వాళ్ళ గుండెలు రగిలిపోయేలా చేస్తున్న ఒక్కడు…ఒక్కడంటే ఒక్క నల్ల రాకాసురుడిని శిక్షించి, వాడి ఆస్తులను స్వాధీనం చేసుకుని ఖజానాకు కలిపేయమనండి. అప్పుడు దేశ అభివృద్ధి కోసం మోడీ తీసుకునే చర్యలను అందరూ హర్షిస్తారు. కష్టాలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కళ్ళముందే నల్ల రాకాసురులందరూ, అవినీతి ఉద్యోగులందరూ, అక్రమంగా వ్యాపారాలు చేస్తూ ప్రజలను దోచుకు తింటున్న నంబర్ ఒన్ బిజినెస్ పీపుల్ అందరూ దర్జాగా పాలకులతోనే కలిసి తిరుగుతూ, అక్రమాలు చేస్తూ ఉంటే కూలీ నాలీ చేసుకు బ్రతికే సామాన్యులు, మధ్యతరగతి మానవులు త్యాగాలకు సిద్ధపడాలని అడగడం పాపం మోడీజీ.