ఇండియన్ మీడియాకు ఉన్నన్ని తెలివితేటలు లేక అమెరికన్ అండ్ ఇంటర్నేషనల్ మీడియావాళ్ళు డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయారు. కానీ మన మీడియా, అందులోనూ తెలుగు మీడియావాళ్ళ పవర్ అంతా ఇంతా కాదు ఫ్యాక్షనిస్టులను దేవుళ్ళను చేసి పడేయగలరు. గౌతమ బుద్ధుడ్ని ఫ్యాక్షనిస్టుని చేసేయగలరు. అందుకే మన నాయకులందరూ కూడా మీడియాలో మన గురించి ఎలాంటి వార్తలు వస్తున్నాయా అని ప్రతిక్షణం అలర్ట్‌గా ఉంటారు. ఎలాంటి వార్తలు రావాలని వాళ్ళు అనుకుంటారో, అలాంటి వార్తలు వచ్చేలాగా డబ్బులు పెట్టి మీడియాను కొనేస్తూ ఉంటారు అండ్ మీడియాలో గొప్పగా కనిపించే అవకాశం ఉన్న పనులు చేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోరు. ప్రధాని నరేంద్రమోడీ కూడా తొంభై ఏళ్ళ పైబడిన వయసున్న తల్లిని బ్యాంకుకు పంపిస్తాడు. అందులో ఏం గొప్ప ఉందో, ఎందుకు ఆ పని గొప్పది అవుతుందో ఎవ్వరికీ తెలియదు కానీ మోడీ భక్తులు, స్పాన్సర్డ్ మీడియా అంతా కూడా అద్భుతః అని వార్తలు వండేస్తుంది.
ప్రధానమంత్రి అంతటి వాడు ఆ ట్రిక్ వాడేయగా లేనిది మన ఫిల్మ్ స్టార్ కం పొలిటికల్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉంటాడు. ఆయనగారు కూడా జస్ట్ ఓ నాలుగు వేల కోసం బ్యాంక్‌కు వచ్చాడు. క్యూలో నిలబడి మరీ నోట్లు తీసుకెళ్ళాడని మీడియా అంతా కూడా బాగానే భజన చేసింది. అసలు పవన్ కళ్యాణ్‌కి నాలుగు వేల కోసం బ్యాంక్‌కు రావాల్సిన అవసరం ఏంటి? ఆయన, ఆయన బౌన్సర్స్ అందరూ కూడా సిటీకి దూరంగా ఉన్న ఫాం హౌస్ నుంచి వెహికల్స్‌లో బ్యాంక్ వరకూ వచ్చి, మళ్ళీ తిరిగి ఫాం హౌస్‌కి వెళితే అయ్యే ఖర్చుకు అన్నా ఆ నాలుగు వేలు సరిపోతాయా? ఒక్కో సినిమాకు 20 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే పవర్ స్టార్‌కి కేవలం ఓ నాలుగు వేల రూపాయలు ఏ ఖర్చుకు సరిపోతాయి? ఆ నాలుగు వేల రూపాయలు పవన్‌కి ఒక రోజు ఖర్చుకు కూడా సరిపోవు అన్నది వాస్తవం. మరి ఆ తర్వాత రోజు మళ్ళీ బ్యాంక్‌కు ఎందుకు రాలేదు? ఇక నుంచి డబ్బులు అవసరమైనప్పుడల్లా డిసెంబర్ చివరి వరకూ కూడా పవన్ కళ్యాణ్ తరచుగా బ్యాంక్‌కి వస్తూ ఉంటాడా? ఒక వేళ ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడానికి వచ్చాడనుకుందామన్నా మిగతా పొలిటీషియన్స్లా డబ్బుల కోసం ప్రజలు ఎదుర్కుంటున్న కష్టాల గురించి ఏమీ మాట్లాడలేదే? కనీస ఆలోచన ఉన్న ఎవరికైనా పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ స్టంట్ గురించి క్లియర్‌గా అర్థమైపోతుంది. నా దగ్గర బ్లాక్ మనీ లేదు అని నిరూపించుకోవడానికి బ్యాంక్‌కి వచ్చాడా? అయినా నా దగ్గర బ్లాక్ మనీ లేదు అని ప్రపంచానికి నిరూపించాలన్న తాపత్రయం ఎందుకు?
అయ్యా పవన్ కళ్యాణ్‌గారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచీ తొంభై తొమ్మిది శాతం మంది రాజకీయ నాయకులు ఇలాంటి చీప్ ట్రిక్స్‌తోనే, అబద్ధపు మాటలతోనే, ప్రచార పటాటోపంతోనే ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు మహానుభావా? దయచేసి మీరు కూడా అదే రాజకీయ చిత్రాన్ని మరోసారి అదే ప్రజలకు చూపించే ప్రయత్నాలు చెయ్యొద్దని మనవి.