గోతులు తీసుకుని మరీ ఆ గోతుల్లో పడిపోవడం, స్యయంగా శతృవులను తయారు చేసుకోవడం మన రాజకీయ నాయకులకు అలవాటే. టిడిపిలో చంద్రబాబుకంటే సీనియర్ అవ్వడం, అలాగే వాక్పటిమ, ప్రజాకర్షణ, రాజకీయ తెలివితేటల విషయంలో కూడా తనకంటే సమర్థుడు, లేకపోతే తనతో సమానుడు కెసీఆర్ అని ఆలోచించాడు కాబట్టే కెసీఆర్‌ని ప్రోత్సహించడానికి, మంత్రి పదవి ఇవ్వడానికి భయపడ్డాడు చంద్రబాబు. బిజెపి, కమ్యూనిస్టులతో పాటు ఇంకా ఒకటో రెండో పార్టీలను మినహాయిస్తే మన దేశంలో ఉన్న ఏ ఒక్క పార్టీలో కూడా నంబర్ 2 అంటూ ఎవరూ ఉండరు. పార్టీ అధినేత కుటుంబ సభ్యులకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది. మా పార్టీ అధినేతలు ఘటనాఘటన సమర్థులు, అతీంద్రియ శక్తులున్న వాళ్ళు అనే స్థాయిలో ఆయా పార్టీల్లో ఉండే భజన బృందం నాయకులు రోజూ చిడతలు వాయిస్తూ ఉంటారు. కానీ ఆయా పార్టీల అధినేతలకు మాత్రం సమర్థ నాయకులంటే చచ్చేటంత భయం. ఎక్కడ తన కుర్చీని లాగేసుకుంటాడో అని. ఎన్టీఆర్‌కి మొండి ధైర్యం చాలా ఎక్కువ కాబట్టే చంద్రబాబు స్కెచ్ ఫలించింది. మరి తాను ఎక్కొచ్చిన దారి గురించి పూర్తి అవగాహన ఉన్న చంద్రబాబు కెసీఆర్లాంటి మేకును ఎందుకు మంత్రిని చేస్తాడు? కానీ చంద్రబాబు కూడా ఊహించని రేంజ్లో కెసీఆర్ ఎదిగాడు. కొన్నేళ్ళపాటు చంద్రబాబుకు నిద్రలేని రాత్రులను మిగిల్చాడు.
చంద్రబాబుకి కెసీఆర్ ఇచ్చిన షాక్‌ని ఇప్పుడు కోదండరాం కెసీఆర్‌కి ఇవ్వబోతున్నాడా? కెసీఆర్ రాజకీయ తెలివితేటలను ఎదుర్కోబోతున్నాడా? కోదండరాంకి ఆ అవకాశం అయితే ఉంది. తెలంగాణా రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క రాజకీయ పార్టీకి, నాయకుడికి కూడా విశ్వసనీయత లేకుండా చేయడంలో కెసీఆర్ అద్భుతంగా సక్సెస్ అయ్యాడు. అందుకే ప్రతిపక్షాల మాటలకు ఓటర్ల దగ్గర విలువ లేకుండాపోయింది. ఆ ప్రభావం మొత్తం ఓట్ల శాతాన్ని డిసైడ్ చేస్తోంది. గులాబీ పార్టీకి పూల మీద నడకలా తయారైంది పరిస్థితి. ఆ పరిస్థితే ప్రతిపక్షాలకు మంట పుట్టిస్తోంది. అందుకే ప్రత్యామ్నాయం కోసం అవి ఎదురు చూస్తూ ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన వెంటనే సమైక్యవాదాన్ని వినిపించిన వాళ్ళు, తెలంగాణా కోసం పోరాడినవాళ్ళూ అనే తేడా లేకుండా బలమైన నాయకులు, తనకు భజన చేసేవాళ్ళందరికీ పదవుల పందేరం చేసిన కెసీఆర్ కోదండాన్ని ప్రోత్సహించడానికి మాత్రం సాహసించలేకపోయాడు. తెలంగాణా రాష్ట్ర సాధనలో కెసీఆర్‌తో సమానమైన భాగం కోదండరాంకి కూడా ఉందని చాలా మంది చెప్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా చివరి దశ ఉద్యమం మొత్తం కోదండరాం నాయకత్వంలో, జెఎసి ఆధ్వర్యంలో జరిగింది అన్న మాట వాస్తవం. తెలంగాణాలో అడుగుపెట్టాలనుకున్న అన్ని పార్టీలు, అందరు నాయకులూ తెలంగాణా రాష్ట్రా ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడేలా చేయడంలో కోదండరాం నేతృత్వంలోని జెఎసి విజయవంతమయ్యింది. ఆ క్రెడిట్ మొత్తం కోదండరామ్‌దే. అలాగే తెలంగాణా ప్రజల దృష్టిలో కెసీఆర్ తర్వాత కోదండరాం కూడా అదే స్థాయి హీరో. కెసీఆర్ అండ్ కో పైన మిగతా నాయకులందరూ చేసే విమర్శలను ఎప్పుడో పట్టించుకోవడం మానేసిన తెలంగాణా ప్రజలు కోదండాన్ని మాత్రం విశ్వసిస్తున్నారు. కెసీఆర్ కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు కూడా అందుకే కోదండరామ్ పైన విరుచుకుపడిపోతున్నారు.
ఈ విషయాలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలకు అర్థమైనట్టే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణా ఇచ్చింది మేమే, కానీ మాకు అధికారం దక్కలేదు, అన్యాయం జరిగింది, కెసీఆర్ మోసం చేశాడు…..అని వాపోతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోదండరాంని చేరదీసే ప్రయత్నాల్లో ఉన్నారు. సోనియాగాంధీకి కెసీఆర్ ఇచ్చిన ఝలక్ని కూడా సోనియా, రాహుల్‌లు ఎప్పటికీ మర్చిపోలేరు. అందుకే కోదండాన్ని ముందుకు నెట్టి 2019 ఎన్నికలను ఎదుర్కోవాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయట. తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో పదుల సంఖ్యలో ఉన్న వృద్ధ నాయకులు, ముఖ్యమంత్రి కుర్చీ పోటీదారులందరూ ఒకళ్ళనొకళ్ళు దెబ్బతీసుకునే ప్రయత్నాలను కొంచెం తగ్గించుకుని, అందరూ కలిసి కోదండరాంకి సపోర్ట్ చేస్తే మాత్రం కెసీఆర్‌కి కష్టకాలం మొదలైనట్టే. ఇప్పటి వరకూ తెలంగాణాలో కెసీఆర్‌కి ప్రత్యామ్నాయం అనే స్థాయి నాయకుడు ఒక్కడు కూడా లేడు. ఆ విధంగా చేయడంలో కెసీఆర్ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కోదండరాం ఎదురు నిలబడితే మాత్రం టఫ్ కాంపిటీషన్ అయితే కచ్చితంగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు వర్సెస్ కెసీఆర్ రాజకీయ చరిత్రలాగా తెలంగాణా రాష్ట్రంలో కెసీఆర్ వర్సెస్ కోదండరాం అన్న కొత్త అధ్యాయం మొదలవుతుందేమో చూడాలి మరి.