ఎవరినైనా విమర్శించాలన్నా, భజన చేయాలన్నా కూడా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ తర్వాతే ఎవరైనా? కమెడియన్ బ్రహ్మానందం వలననే తెలుగు సినిమా ఇండస్ర్టీ మొత్తం నాశనం అయిపోతోంది అని రాసేయగలడు. అలాగే పురాణ కాలం నుంచి నేటి వరకూ కూడా జగన్‌ని మించిన రాక్షసుడు ఇంతవరకూ పుట్టలేదని కూడా నమ్మించగలడు. చంద్రబాబు నాయుడి దగ్గరున్న డ్యాష్ బోర్డ్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలన్నీ ఆనందమయం అయిపోబోతున్నాయని, ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళిపోబోతోందని కూడా పేజీలకు పేజీలు ప్రచురించేయగలడు. అలాగే సోనియాగాంధీ-జగన్, చంద్రబాబు-మోడీ, కెసీఆర్-చంద్రబాబుల మధ్య ఒన్ టు ఒన్ మీటింగ్స్ జరిగినప్పుడు కూడా వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? ఎలా విష్ చేసుకున్నారు? ఎవరు ముందు షేక్ హ్యాండ్ ఇచ్చారు? గుడ్ మార్నింగ్ అనుకున్నారా? నమస్కారం అని తెలుగులో విష్ చేసుకున్నారా? అనే విషయాలను కూడా చాలా క్షుణ్ణంగా ప్రచురించేయగలరు ఆంధ్రజ్యోతి వారు. అట్టే మాట్లాడితే విజయమ్మ-జగన్, కెసీఆర్-కెటీఆర్లు వాళ్ళ సొంత ఇంట్లో మాట్లాడుకునే విషయాలు కూడా రాధాకృష్ణకు తెలిసిపోతూ ఉంటాయి.
ఈ రోజు కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో అలాంటి వార్త ఒకటి వచ్చింది. ఆ వార్త ఏంటంటే……..నోట్ల రద్దు, విత్ డ్రాలపై పరిమితుల సెగ కేంద్రమంత్రులకు కూడా తగుల్తోందట. ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీకి కూడా ఆ సెగ తగిలిందట. అదెలా అంటే నోట్ల రద్దు నిర్ణయం వెనుక ఉన్న సహేతుకత గురించి జూనియర్స్‌కి వివరించమని చెప్పి సీనియర్ మంత్రులను ఆదేశించిందట బిజెపి పార్టీ. ఒక్కో మంత్రి 50 మందికి ఆతిథ్యం ఇచ్చి వారికి పూర్తి వివరాలు వెల్లడించమని బిజెపి పార్టీ చెప్పిందట. పార్టీ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన సీనియర్ మంత్రి అరుణ్ జైట్లీ…. వెంటనే తన దగ్గరున్న ఫోన్ చేతిలోకి తీసుకుని …ఆయన భార్యకు ఫోన్ చేసి విషయం చెప్పారట. అంతా శ్రద్ధగా విన్న ఆయన సతీమణి ….‘మన ఇద్దరం బ్యాంకు ఖాతాల నుంచి వారానికి చెరో 24 వేలు మాత్రమే తీయగలుగుతాం. ఆ సొమ్మ 50 మందికి ఆతిథ్యమివ్వడానికి సరిపోదు’ అని చల్లగా చెప్పారట.
హవ్వ…అసలు ఇలాంటి చిలిపి, కామెడీ, కిచిడీ వార్తలు రాయడంలో ఆంధ్రజ్యోతివారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారేమో తెలియదు. బిజెపి వాళ్ళు 50 మందికి ఆతిథ్యం ఇవ్వమని నంబర్ చెప్పడం ఏంటో? వెంటనే అరుణ్‌గారు ఆయన భార్యకు ఫోన్ చేసిన విషయం ఆంధ్రజ్యోతివారికి ఎలా తెలిసిందో? తెలిసెనుపో….అరుణ్ జైట్లీ భార్య మాట్లాడిన మాటలు కూడా ఎలా తెలిసిపోయేను? చంద్రబాబుకు జిగిరి దోస్త్ అయిన అరుణ్ జైట్లీ దగ్గర బ్లాక్ మనీ లేదు అని చెప్పడానికి రాశారో? లేక సామాన్యులు తప్ప బడాబాబులెవ్వరూ ఇబ్బందులు పడడం లేదు అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పడానికి ఈ వార్తను వండి వార్చారో తెలియదు కానీ మరీ కామెడీగా ఉందప్పా. సినేమా సీన్లా ఉంది. ఈ వార్త రాసినవాళ్ళెవరో కానీ ఆ రంగంలో ట్రై చేస్తే ఇంకా బెటర్ భవిష్యత్తు ఉంటుంది. ఏమంటారు?