రాజకీయాలంటే అలానే ఉంటాయి మరి. ఎవ్వరికైనా తప్పదు. ఇక సినిమా యాక్టర్ అలీ ఎంత? ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న తొంభై శాతం మంది కంటే అలీ సీనియర్ నటుడు. వందల సినిమాల్లో యాక్ట్ చేశాడు. అలీ మతం ఏంటి? అని ఎవ్వరూ పట్టించుకోలేదు. గ్రూపులతో సంబంధం లేకుండా అందరు హీరోలూ అలీని దగ్గరకు తీశారు. డైరెక్టర్స్ కూడా వరుసగా అవకాశాలు ఇచ్చారు. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులందరూ కూడా అలీని అభిమానించారు. సినిమా ప్రమోషన్స్ టైంలో కూడా…. కళాకారులకు మతం, ప్రాంతం, కులంలాంటి విబేధాలు ఉండవు, మేము అందరివారము, మాకు అందరూ కావాలి అని ఎన్నో సార్లు చెప్పాడు అలీ.
అయితే ఇప్పుడు మాత్రం కమెడియన్ అలీ కాస్తా 2019నాటికి ఎమ్మెల్యే అలీ అయిపోవాలని కలలు కంటున్నాడు. అలీ దృష్టిలో పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవడం అంటే ఏదో ఒక పార్టీలో జాయిన్ అయిపోయి, ఎక్కడో ఒక చోటు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయిపోవడమే. చిన్న స్థాయి సినిమా నటులందరికీ కూడా రాజకీయ ప్రవేశం అంటే అదే మరి. ఇక మరీ ఎక్కువ ఫాలోయింగ్ ఉండే స్టార్ల విషయంలో మాత్రం కొత్త పార్టీ పెట్టామా? ముఖ్యమంత్రి కుర్చీని టార్గెట్ చేశామా అన్నట్టుంటుంది వ్యవహారం. అలీకి సిఎం అంత సీన్ లేదు కదా. అందుకే ఎమ్మెల్యే కుర్సీని టార్గెట్ చేశాడు. అదేదో కష్టపడి ప్రజాభిమానం సంపాదించి పదవిని అధిష్టిస్తే ఎవ్వరూ తప్పు పట్టరు కానీ ఇంకా ఎంట్రీ కూడా ఇవ్వకముందే మతరాజకీయాలను స్టార్ట్ చేశాడు. 2019 ఎన్నికల్లో ముస్లిం కోటాలో ఎమ్మెల్యే సీటు కొట్టేయాలనుకుంటున్న అలీ …అందుకోసమని ఇప్పటి నుంచే స్కెచ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టున్నాడు. రాజకీయ నాయకులందరూ కూడా ముస్లిముల ఓట్లు దండుకుని… ఆ తర్వాత వాళ్ళ అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదట. అందుకే ముస్లిములకు కూడా ఎక్కువ సీట్లు ఇవ్వాలని, ముస్లిములు కూడా రాజకీయంగా ఎదగాలని చెప్పుకొచ్చాడు అలీ. అంతా కూడా డొంక తిరుగుడుగా మాట్లాడాడు కానీ అదేదో డైరెక్టుగా ముస్లిం కోటాలో నాకు ఎమ్మెల్యే సీటు ఇవ్వండి అని స్ట్రెయిట్‌గా అడిగేసి ఉంటే బాగుండేది. అమ్మో…అలా మాట్లాడితే తన స్వార్థం బయటపడిపోతుందికదా? అందుకే ముస్లింలకు రాజకీయ పదువులివ్వాలని అన్నాడన్నమాట అలీ. ఆ కోటాలో తనకో ఎమ్మెల్యే సీటు పడేస్తే ముస్లిములందరూ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అద్భుతమైన అభివృద్ధి సాధించినట్టేనన్నది అలీ అంతరంగం. అర్రే….ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కుల, మత, ప్రాంత నాయకులందరూ కూడా చేస్తోంది అదే కదా? అంటే మనవాడు రాజకీయం నేర్చేసుకున్నాడన్నమాట. బాగా డబ్బు, పాపులారిటీ ఉన్న ఒక్క ముస్లిం వ్యక్తిని ముందు పెట్టి వేలాది మంది వెనుకబడిన ముస్లింల ఓట్లను దండుకోవాలని ప్లాన్ చేస్తూ ఉండే ఏ రాజకీయ పార్టీవారు అలీకి టికెట్ ఇస్తారో చూడాలి మరి.
అయినా ఒక్క ఎమ్మెల్యే సీటు కోసమే మతాన్ని అడ్డుపెట్టుకునే రాజకీయ నాయకులు… విశాల దృక్పథంతో, స్వలాభాన్ని వదులుకుని సమాజానికి సేవ చేస్తారని నమ్మడం ఎలాగబ్బా? ఆల్రెడీ బోలెడుమందిని నమ్మేస్తున్నారు, నమ్మేశారు కదా…ఈసారికి నన్ను కూడా నమ్మండి అని అలీవారు లాజిక్ తీస్తారేమో?