ఆంధ్రజ్యోతి పత్రిక ఏ పార్టీకి అనుకూలం? ఈ ప్రశ్నకు సమాధానం తెలుగు వారందరికీ తెలుసు. చంద్రబాబు కుర్చీ టైం ఇంచుమించుగా సగభాగం అయిపోయన నేపథ్యంలో చంద్రన్న పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో అత్యద్భుతమైన జీవితాన్ని గడిపేస్తున్నారు, ఆ ఆనందంలోనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చేస్తే టిడిపికే గుంపగుత్తగా ఓట్లేయాలన్న కసితో ఉన్నారు అని ఆంధ్రప్రదేశ్ జనాలకు చెప్పడం అత్యవసరం అని చంద్రబాబే అనుకున్నాడో లేక భజన మీడియావాళ్ళే ఆ సలహా ఇచ్చారో తెలియదు కానీ ఓ సర్వే చేయించాలని మాత్రం ఫిక్స్ అయ్యారు. ఈనాడు ఉన్నా కూడా ఈసారికి మాత్రం ఆ అవకాశాన్ని ఆంధ్రజ్యోతికి ఇచ్చాడు చంద్రబాబు.
ప్లానింగ్ అంతా ఒకే కానీ ఆంధ్రజ్యోతివారి అత్యుత్సాహమే కాస్త కొంపముంచింది. టిడిపికి ఓట్ షేర్ పెరిగింది, సీట్లు కూడా పెరిగాయి అనడం వరకూ ఒకే. జగన్ పార్టీ సర్వనాశనం అని చెప్పడం కూడా అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. అంతవరకూ పరిమితమై ఉంటే బాగుండేది. లేకపోతే మిగతా పార్టీల విషయంలో అన్నా కాస్త లిబరల్గా ఉంటే కొంతమందైనా నమ్మేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్‌కి కేవలం నాలుగు శాతం ఓట్లే పడతాయి, జగన్ ఓట్ షేర్ కాంగ్రెస్‌వైపు టర్న్ అవుతోంది, బిజెపి-టిడిపిల ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రజల అసంతృప్తి, ఆగ్రహం మొత్తం కూడా బిజెపిపైనే ఉంది, ప్రజలందరూ కూడా చంద్రన్నను గుండెల్లో పెట్టుకున్నారు అనే స్థాయిలో సర్వే రిపోర్ట్స్ ఉండేసరికి టిడిపి నాయకులకు, కార్యకర్తలకు కూడా నమ్మశక్యంగా లేకుండా పోయింది. రుణమాఫీ, రాజధాని నిర్మాణం, పోలవరం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్….ఇలా అన్ని విషయాల్లోనూ ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ చంద్రబాబు సారథ్యంలోని టిడిపి పార్టీకి ఓట్లు, సీట్లు గణనీయంగా పెరుగుతాయని అదే ప్రజలను నమ్మించాలని ట్రై చేసిన రాధాకృష్ణ గట్స్‌కి మాత్రం హ్యాట్సాఫ్.
ఇక రేపో మాపో సాక్షిలోనో, లేక వేరే ఏదో ఒక ఛానల్లో జగనన్న సర్వే కూడా రావడం ఖాయమే కాబట్టి.. చంద్రన్న, రాధాకృష్ణలు చేసిన తప్పులు నుంచి మాత్రం వాళ్ళు కొంచెం నేర్చుకోవాలి. ప్రత్యేక హోదా కోసం జగనన్న చేసిన పోరాటం, ఓదార్పు యాత్రలు, తండ్రి లేని బిడ్డ అన్న సానుభూతి కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జగన్‌కే ఓటేయాలి అని కంకణం కట్టుకుని కూర్చున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కుప్పంలో చంద్రబాబు కూడా ఓడిపోవడం ఖాయం అనే రేంజ్లో కాకుండా కాస్త బేలన్స్డ్గా సర్వే రిపోర్ట్ ఉంటే బాగుంటుంది. ఎన్నికలు వస్తే జగనన్నే ముఖ్యమంత్రి, చంద్రబాబుకు ప్రతపక్ష హోదా అని రాసుకుంటే కనీసం జగన్ అభిమానులు అయినా నమ్ముతారు. కాసేపు ఆనందపడతారు. జగనన్న సర్వే రిపోర్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.