అనుకున్న పని అనుకున్నట్టు జరిగితే అది పాలకుల గొప్పతనం. ఒకవేళ జరగకపోతే… అది అధికారుల వైఫల్యం! దాదాపు ఇదే ఫార్ములాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్లై చేసుకుంటూ పోతారన్న ఓ విమర్శ ఉంది. ప్రభుత్వం సాధించిన విజయాలను తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి, వైఫల్యాలు అధికారుల ఖాతాలోకి మళ్లించిన సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయిలెండి. ఒక్క ఉదాహరణ కావాలంటారా… గోదావరి పుష్కరాలు! సరే, సేమ్ టు సేమ్ అదే ఫార్ములాను మరోసారి ప్రయోగించి కేంద్రంలోని మోడీ సర్కారును భలే ఇంప్రెస్ చేస్తున్నారని చెప్పాలి.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులు అవస్థలు పడుతున్నారు. అయితే, ఆ నిర్ణయం ఆలోచన తనదే అని చెప్పుకునే ప్రయత్నం మొదట చేసినా, ప్రజల అసహనం తెలుసుకుని చంద్రబాబు ఆ విషయంలో కాస్త తగ్గారు. కానీ, ప్రజలు కష్టాలు యథాతథం. మోడీ నిర్ణయాన్ని భాజపా అనుకూల రాష్ట్రాలన్నీ స్వాగతించాయి. కానీ, ప్రజలు నోట్ల కష్టాలు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు మోడీ సర్కారుపై విమర్శలూ చేస్తున్నాయి. ఇంత భారీ నిర్ణయం తీసుకునేటప్పుడు తదనంతర పరిణామాలపై మోడీ అంచనా వేయలేకపోయారనీ, కొత్త నోట్ల ముద్రణ, సరఫరాలపై ప్రాథమిక అవగాహన కూడా లేకుండా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం అని చాలామంది మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా విమర్శించాలి కదా! లేదంటే, ఏపీ ప్రజలు ఊరుకోరు కదా! కాబట్టి, ఆయన కూడా పెద్ద నోట్ల రద్దు వల్ల సమస్యలకు కారణమైన వారిపై విమర్శలు గుప్పించారు.
పెద్ద నోట్ల రద్దు తరువాత తలెత్తిన పరిస్థితిని రిజర్వ్ బ్యాంక్ నియంత్రించలేకపోయిందని చంద్రబాబు మండిపడ్డారు! ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంక్ పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఇప్పటికి కూడా బ్యాంకుల మధ్య సరైన సమన్వయం లేదనీ, సమీక్షకు వచ్చే బ్యాంకర్ల వద్ద కూడా సమాచారం ఉండటం లేదని అన్నారు. బ్యాంకులు సరిగ్గా సహకరించకపోవడంతోనే ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని నిస్సహాయతలో పడిపోయిందని చంద్రబాబు వివరించారు.
నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయో చంద్రబాబు గుర్తించారు! అంతా రిజర్వ్ బ్యాంకే చేస్తోందట! అంటే, ప్రస్తుత ప్రజల అవస్థలకు ప్రధాని నరేంద్ర మోడీకీ ఎలాంటి సంబంధం లేదన్నమాట. ఇందులో కేంద్రం తప్పు అస్సలు లేదన్నమాట. అంటే, ఫెయిల్యూర్ భాజపాది కాదన్నమాట… బ్యాంకులదే అన్నమాట! వారేవ్వా… ఏం చెప్పారండీ బాబూ! నల్లధనంపై పోరాటంలో విజయం సాధిస్తే అది మోడీ గొప్పతనం! ఒకవేళ తేడా వస్తే… అది రిజర్వ్ బ్యాంక్ ఫెయిల్యూర్! ఇది చాలు.. టీడీపీ, భాజపాల మధ్య చంద్రబాబు మరింత ఫెవికాల్ పోశారు!