సోమవారం రాత్రి 11.30 ని.లకు జయ మరణించారన్న విషయాన్ని 12గంటల 30 నిమిషాలకు అపోలో ఆసుపత్రి అధికారికంగా ప్రకటించింది. అయితే అంతకు ముందు ఆసుపత్రిలో హైడ్రామా నడిచినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సోమవారం రాత్రి ఆరుగంటల నుంచే.. జయమరణించారంటూ ఓ వార్త తమిళ టీవీ ఛానళ్లలో ప్రసారమైంది. స్వయంగా జయ టీవీలోనే.. ‘జయ ఇక లేరు’ అనే ఫ్లాష్ న్యూస్ వచ్చింది. అయితే ఆ తరవాత అపోలో బృందం మరో ప్రకటన చేసింది. ‘జయ మరణించారన్న వార్తల్లో నిజం లేదు. ఆమె చికిత్సకు స్పందిస్తున్నార’ని తేల్చి చెప్పింది. దాంతో న్యూస్ ఛానళ్లు ఖంగుతిన్నాయి. అయితే.. నిజానికి ఆ సమయానికే జయ మరణించి ఉంటారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. డాక్టర్లు ఆఖరి ప్రయత్నంగా ఎక్మో అనే ఆధునిక పరికరాణి జయ గుండెకు అమర్చారు. దాన్ని కనీసం 12 గంటల పాటు పరీక్షించాల్సి ఉంటుంది. ఈ మధ్యలో.. జయ కను రెప్పలు కొట్టుకొంటున్నట్టుగా అనిపించడంతో జయ ఇంకా బతికే ఉన్నారని అపోలో వైద్యులు భావించారట. అందుకే ‘జయ చికిత్సకు స్పందిస్తున్నారు’ అనే ప్రకటన ఇవ్వాల్సివచ్చింది.
11.30 వరకూ జయని నిశితంగా పరిశీలించాక.. ఆమె మరణించారని డాక్టర్ల బృందం పూర్తిగా నిర్దారించుకొన్న తరవాతే… జయ మృతిపై అధికారిక సమాచారం అందించారు. ఈలోగా.. పన్నీర్ సెల్వంకి అధికారాలు బదలాయించేంత సమయం దక్కింది. సరిగ్గా ఇటు పన్నీర్ సెల్వంకు బాధ్యతలు అప్పగించడం, అటు జయ మరణాన్ని ధృవీకరించడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. జయ స్థానంలో మరొకరు పీఠం ఎక్కేంత వరకూ జయ మరణాన్ని దాచి ఉంచారన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం మొత్తాన్ని చాకచక్యంగా నడిపించిన ఘనత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకే దక్కుతుంది. ఢిల్లీ నుంచి చెన్నై ఆఘమేఘాలమీద వచ్చిన వెంకయ్య.. అక్కడి పరిస్థితుల్ని పూర్తిగా అదుపులోకి వచ్చేలా తన చాకచక్యం చూపించారు.