పెద్ద నోట్ల రద్దు వల్ల చిన్నవాళ్లే పెద్ద కష్టాలు పడుతున్నారు. సగటు వేతన జీవి వెతలు ఇంకా తీరడం లేదు. బ్యాంకు అకౌంట్లలో ఉన్న జీతం తీసుకోవడం కోసం రోజుల తరబడి బ్యాంకులు ముందు పడిగాపులు ఇంకా తప్పడం లేదు. ఏటీఎమ్లు పనిచేయడం లేదు! బ్యాంకుల్లో సొమ్ము ఉండటం లేదు. ఈ పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో.. మళ్లీ మామూలు స్థితికి ఎప్పుడొస్తుందో ఎవ్వరికీ తెలీదు! అయితే, ఈ క్రమంలో బ్యాంకు ఉద్యోగుల కష్టాలు కూడా ఎక్కువౌతున్నాయని చెప్పుకోవాలి. వారిలోనూ అసహనం నెమ్మదిగా పెరుగుతోంది.
రిజర్వ్ బ్యాంకు నుంచి ప్రతీరోజూ అరకొర సొమ్ము వస్తోంది. వచ్చిన కాసేపటికే క్యాష్ అవుట్! నో క్యాష్ అని బోర్డు పెట్టేస్తున్నారు! ఆ బోర్డు చూడగానే గంటల తరబడి క్యూ లైన్లో ఉన్న ప్రజలకు తీవ్ర అసంతృప్తి కలుగుతోంది. ఆ కోపాన్ని బ్యాంకు ఉద్యోగులపై చూపించేస్తున్నారు. దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ ఈ సన్నివేశాలూ డైలీ సీరియల్ ఎపిసోడ్లుగా మారిపోయాయి. అయితే, ఈ ఒత్తిడిని ఇంకెన్నాళ్లు తట్టుకోవాలంటూ బ్యాంకు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీరోజూ తిట్లూ శాపనార్థాలూ పాడాల్సి వస్తోందనీ, ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగితే విధులు నిర్వహించలేమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్యాష్ ఫ్లో విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టకపోతే తాము సమ్మెకు దిగడం తప్ప వేరే మార్గం లేదని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది!
అవసరాలకు సరిపడా సొమ్ము పంపడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుంతోందనీ, ఫలితంగా ప్రజల నుంచి తాము వ్యతిరేకతను ఎదుర్కొంటున్నామని బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటాచలం అంటున్నారు. ప్రజల ఆగ్రహానికి బ్యాంకు ఉద్యోగులు గురౌతున్నారనీ, ఆర్బీఐ తమకు సొమ్ము పంపించకపోతే తామేం చేస్తామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొన్ని రోజులు కొనసాగితే ఉద్యోగులు సమ్మెకు దిగుతారన్నారు. కొన్నాళ్లపాటు బ్యాంకులు మూసేస్తే… ఈ లోగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు వేగవంతం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒకవేళ అదే జరిగితే మరింత గందరగోళ పరిస్థితులు తప్పవు. ఇప్పటికే అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు కుదేలైపోయాయి. చిన్నవ్యాపారులు, రైతులు, సామాన్యులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ముందుచూపు లేకుండా తీసుకున్న గొప్ప నిర్ణయం వల్ల నల్లధనవంతులు ఎంతమంది బయటకి వచ్చారో తెలీదుగానీ, సామాన్యుడు మాత్రం బ్యాంకుల బయటే ఉంటున్నాడు! చీకట్లో గుడ్డిలో దీపాల్లా ఉన్న బ్యాంకులు కూడా చేతులు ఎత్తేస్తే… పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. మోడీ సర్కారు వైఖరి చూస్తుంటే పరిస్థితి అక్కడి వరకూ తీసుకొచ్చేలానే ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
