తెలుగు ప్రజలందరూ కులాలను ద్వేషించేవాళ్ళే. కానీ కులం ప్రాధాన్యత మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది. అలాగే చెత్త రాజకీయాలను ఈసడించుకుంటూ ఉంటాం. కానీ మనమందరం కూడా చాలా విషయాల్లో ‘రాజకీయమే’ చేస్తూ ఉంటాం. అవినీతిని కూకటివేళ్ళతో సహా పెకిలించివేయాలని భారతీయులందరూ ముక్తకంఠంతో నినదిస్తూ ఉంటారు. కానీ మన దైనందిన జీవితంలో అవినీతికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కానీ ఇవన్నీ తప్పు అన్న అపరాధభావం మన అంతరాంతరాల్లో ఎక్కడో ఇంకా సజీవంగానే ఉంది. అందుకే అందరికీ తెలిసేలా చేయడానికి కాస్త సందేహిస్తాం. సినిమా హీరోల్లో కూడా చాలా మందికి కులాభిమానం ఎక్కువే ఉంది. కానీ ఎవరూ కూడా బహిరంగంగా ప్రదర్శించరు. మిగతా వర్గాల ప్రేక్షకులు దూరమవుతారన్న భయం అయితేనేమి, అలా చెయ్యడం తప్పు అన్న ఆలోచన కారణం అయితేనేమీ.. బయటికి మాత్రం వాళ్ళ వ్వవహారం హుందాగానే ఉంటుంది. కానీ ఏం చేసినా, ఏం మాట్లాడినా దబిడిదిబిడి వ్యవహారమే అన్నట్టుండే బాలకృష్ణ మాత్రం ఈ హద్దులను చెరిపేస్తున్నాడేమో అని అనిపిస్తోంది.
నారా లోకేష్‌కి ఎక్కడ పోటీ అవుతాడో అన్న ఉద్ధేశ్యంతో ఎన్టీఆర్‌ని టిడిపికి దూరం చేసినప్పటి నుంచీ టిడిపి జనాలకు, టిడిపిని అభిమానించే కులానికి బాలయ్య ఒక్కడే సూపర్ హీరో అని ప్రొజెక్ట్ చేయాలన్న ఉద్ధేశ్యంతో ఈ వ్యవహారానికి తెరలేపారు చంద్రబాబు. ఎన్టీఆర్‌ని పార్టీకి, కులానికి దూరం చేయడం, బాలకృష్ణను ఓన్ చేసుకునేలా చేయడంలో కొంతవరకూ సక్సెస్ అయ్యారు కూడా. కానీ రాను రాను ఈ వ్యవహారం మరీ ముదిరిపోతోంది. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం మంగమ్మగారి మనవడు, భైరవద్వీపం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడులాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ప్రాంతం, కులం, పార్టీలతో సంబంధం లేకుండా తెలుగు వాళ్ళందరినీ అలరించిన బాలకృష్ణ కొన్ని వర్గాలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. రాబోయే సంక్రాంతికి చిరంజీవి 150వ సినిమా, బాలకృష్ణ 100వ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండడంతో ఈ సారి మరీ ఓపెన్ అయిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అభిమానుల మధ్య గొడవలకు దారితీసే రేంజ్లో హంగామా చేయడానికి రెడీ అయిపోతున్నారు. టిడిపినే అధికారంలో ఉండడంతో థియేటర్స్‌ని బ్లాక్ చేయడం, ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి కూడా పూర్తిగా పార్టీ కలర్ ఇవ్వడం లాంటివి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య అభిమానులందరూ టిడిపి ఓటర్లుగా మారితే టిడిపికి లాభదాయకంగానే ఉంటుంది కానీ ఇలాంటి హడావిడి మరీ ఎక్కువ అయితే మాత్రం బాలకృష్ణ సినిమాలకు కొంతమంది ప్రేక్షకులు దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. బాలయ్య చేయబోయే రెగ్యులర్ సినిమాల విషయం ఎలా ఉన్నా కూడా తెలుగు ప్రేక్షకులందరికీ గౌతమీ పుత్రుడి కథను చెప్పాలని సిన్సియర్‌గా ప్రయత్నం చేస్తున్న సెన్సిబుల్ అండ్ గుడ్ డైరెక్టర్ క్రిష్ కోసమైనా, ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమా వరకూ అయినా ఈ పొలిటికల్, కులం టచ్ లేకుండా ఉంటే బాగుంటుంది. ఓ మంచి కథతో వస్తున్న ఈ సినిమాని తెలుగు వారందరూ కూడా సినిమాలానే చూసి ఆదరించే అవకాశం ఉంటుంది.