ఇదేదో అధికార తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో చేపడుతున్న కొత్త కార్యక్రమం కాదు! రాయలసీమలో ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకమూ కాదు! తెలంగాణ నుంచి స్ఫూర్తి పొందిన ప్రాజెక్ట్ నిద్ర లాంటిదీ కాదు. ఆ ఎమ్మెల్యే చేస్తున్నది అచ్చంగా నీటి కాపలా అని చెప్పాలి. రాయలసీమకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఈ మధ్య నీటి కాపలాకు దిగారు. రాత్రి వేళల్లో కాలువ గట్ల వెంట చేతిలో కర్రపట్టుకుని కాపలా కాస్తున్నారు. ఎమ్మెల్యే ఇలాంటి పని చేస్తుంటే.. ఆయనకు రక్షణగా ఉండేదుకు పోలీసులు, ఇతర అధికారులకు కూడా నైట్ డ్యూటీలు తప్పడం లేదు! గడచిన వారం రోజులుగా కాలువల దగ్గర పహారా కాస్తున్నారు.
అనంతపురం జిల్లాలో నీటి కష్టాలు అందరికీ తెలిసినవే. అయితే, ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో జిల్లాలో జలజగడాలు ఎక్కువయ్యాయి. చిత్రం ఏంటంటే… అధికార పార్టీకి చెందిన నేతల మధ్యనే నీటి పోరాటాలు జరుగుతూ ఉండటం! ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ ఉండటం, కింది ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకపోవడంతో కాల్వల నుంచి వస్తున్న నీటిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుంగభద్ర నుంచి ఈ ఏడాది నీరు రావడం లేదు. కారణం వర్షాభావ పరిస్థితులు. దీంతో హంద్రీనీవా నుంచి కాలువల ద్వారా వచ్చే నీటిని అందరూ సర్దుకోవాల్సిన పరిస్థితి. అయితే, దాదాపు 20 టీఎమ్సీల నీరు విడుదల అయింది. మంత్రి పరిటాల సునీత, పయ్యావుల కేశవ్‌లు ముందుగా తమ ప్రాంతాల్లో ఉన్న చెరువులను నింపేసుకున్నారట. ఓరకంగా వారి స్వార్థం వారు చూసుకున్నారు అనాలి. మొత్తం నీటిని వారే వాడేస్తే కింది ప్రాంతాల పరిస్థితి ఏంటనేది వారికి పట్టలేదని అనుకోవాలి. దాంతో చివరిగా ఉన్న ధర్మవరం కాలువ వరకూ నీరు రావడం లేదట.
దీంతో ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆందోళన బాట పట్టారు! అధికారులకు పరిస్థితిని వివరించారు. ఫలితం లేకపోవడంతో దీక్షకు దిగాల్సి వస్తుందని సొంత పార్టీకే హెచ్చరికలు జారీ చేసేరికి.. వెంటనే చంద్రబాబు స్పందించి, నీటిని విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. నీరైతే విడుదలైందిగానీ, చివరి ఆయకట్టువరకూ అది కాల్వల ద్వారా వెళ్లడమే అసలు సమస్య. మధ్యలో నీటి చౌర్యం ఎక్కువైపోతోంది. అధికార పార్టీకి చెందినవారే ఇలాంటి పనులకు ఊతమిస్తున్నారట.
కాబట్టి, వస్తున్న నీటిని తమ వరకూ తీసుకొచ్చేందుకు కాల్వల దగ్గర గస్తీ కాసేందుకు దిగారు ఎమ్మెల్యే సూర్యనారాయణ. ఆయతోపాటు పోలీసులు, అధికారులు కూడా రాత్రిపూట కాలువ వెంబడే ఉంటున్నారు. మొత్తానికి నీటిని తెచ్చుకోవడం కోసం ఇలా గస్తీ కాయాల్సిన పరిస్థితి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకి వచ్చింది. అంటే, అనంతపురంలో తెలుగుదేశం నాయకుల మధ్య సమన్వయం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.