దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో కూడా తెలుగు నాట ఉన్నన్ని మీడియా సంస్థలు ఉండవేమో. భారీ సంఖ్యలో ఉన్న ఈ మీడియా సంస్థల వళ్ళ జనాలకు జరుగుతున్న మంచి ఎంత అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే అందరూ కూడా అధికారంలో ఉన్నవాళ్ళకు బంధువులుగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఓ కొత్త సినిమా చూసిన అనుభూతిని ప్రేక్షకులకు లేకుండా చేయడంలో మాత్రం మన మీడియావాళ్ళు గ్రాండ్‌గా సక్సెస్ అవుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికీ కూడా న్యూస్….అది కూడా రీడర్స్‌ని అట్రాక్ట్ చేసే న్యూస్ చాలా ఎక్కువగానే అవసరమవుతోంది. టాప్ పొజిషన్లో మీడియా సంస్థలది కూడా అదే సమస్య. అందుకే ఇంతకు ముందు వరకూ కేవలం రివ్యూ రాయడం వరకే పరిమితమైన మీడియావాళ్ళు ఇప్పుడు ఏకంగా ఆయా సినిమాల్లో ఉన్న హైలైట్ సీన్స్ అన్నింటినీ ముందుగానే రివీల్ చేసేస్తున్నారు. అది కూడా ఆ సినిమాకు వర్క్ చేసిన రైటర్స్ రాసినట్టుగానే షాట్ టు షాట్ రాసేస్తున్నారు. బాగా ఉన్న డైలాగ్స్ అన్నీ కూడా చెప్పేస్తున్నారు.
ఖైదీ నెంబర్ 150 సినిమా విషయంలో అదే జరిగింది. ఆ కథ అంటే రీమేక్ కాబట్టి చాలా మందికి తెలిసి ఉండే అవకాశం ఉంది. మోరోవర్ కమర్షియల్ సినిమాలో మరీ ఊహించలేనంత కంటెంట్ కూడా ఏమీ ఉండదు. కానీ క్రిష్ ఎంతో కష్టపడి సృజనాత్మకంగా తెరకెక్కించిన గౌతమీ పుత్ర శాతకర్ణి విషయంలో మాత్రం మీడియావాళ్ళ అత్యుత్సాహం ఆ సినిమాకు నష్టం చేసేలా ఉంది. రేపటి నుంచి ఆ సినిమాను మొదటి సారి చూడడానికి వెళ్ళిన ప్రేక్షకులందరూ కూడా పూర్తిగా కొత్త సినిమాను చూశామన్న అనుభూతిని చాలా వరకూ కోల్పోతారు. శాతకర్ణి సినిమా కథ మొత్తం చాలా మంది రివ్యూ రైటర్స్ రాసేశారు. నిజానికి రివ్యూలో ఎప్పుడూ కూడా కథ రాయకూడదు అన్నది బేసిక్ రూల్. కానీ రీడర్స్ అట్రాక్ట్ చేయడమే టార్గెట్…..జర్నలిజం విలువలు అవసరం లేదు అనుకున్నవాళ్ళందరూ కూడా శాతకర్ణి కథను పూర్తిగా చెప్పేశారు. చాలా మంది ఆ రివ్యూలతో కూడా సరిపెట్టలేదు. శాతకర్ణి సినిమాలో హైలైట్ సీన్స్…..ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేని సీన్స్ ఏమేమి ఉన్నాయి……హైలైట్ డైలాగ్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి? అవి సినిమాలో ఎప్పుడు వస్తాయి? సినిమా ప్రారంభం ఏంటి? ఇంటర్వెల్ ఏంటి? క్లైమాక్స్ ఏంటి? అనే విషయాలన్నీ రాసిపడేశారు. అఫ్కోర్స్….అందరూ కూడా ఆయా సీన్స్ అదిరిపోయాయి అనే రాశారు కానీ ఆ ప్రశంశల వళ్ళ సినిమాకు జరిగే లాభం కంటే కూడా సినిమా మొత్తం చెప్పేయడం వళ్ళ ‘శాతకర్ణి’కి జరిగే నష్టమే ఎక్కువ. ఇక నిన్న రిలీజ్ అయిన ఖైదీ సినిమా పాటలన్నీ కూడా ఫేస్బుక్లో దర్శనమిస్తూ ఉండడం గమనార్హం. ఓవరాల్‌గా చూస్తే ఖైదీ, శాతకర్ణి సినిమాలు రెండింటికీ కూడా భారీ హైప్ తీసుకురావడంలోనూ…..ఫుల్ పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడంలోనూ మీడియావాళ్ళు బాగానే హెల్ప్ అయ్యారు కానీ రెండు సినిమాలలో ఉన్న విషయం మొత్తం చెప్పేసి ఇక నుంచీ ఆ సినిమాలకు వెళ్ళే ప్రేక్షకుల అనుభూతిని చాలా వరకూ చంపేశారు.
కోట్లాది రూపాయల ఖర్చుతో….వందలాది మంది కృషితో తయాయిన ఒక సినిమాను వంద రూపాయలపైనే ఖర్చు పెట్టి మరీ పూర్తిగా ఆస్వాదించాలనుకుంటాడు ప్రేక్షకుడు. కానీ ఈ మీడియా వాళ్ళ పుణ్యమాని అటు సినిమాలు తీసేవాళ్ళు……ఇటు సినిమాలు చూసేవాళ్ళు కూడా నష్టపోతున్నారు. రామ్ గోపాల్ వర్మలాగా….మేం రాస్తే మాత్రం ఎవరు చదవమన్నారు? అని రెటమతంగా సమర్థించుకోవచ్చేమో గానీ……కథ, కథనం, సీన్స్‌ని ముందుగానే రివీల్ చేయకూడదన్న కామన్సెన్స్ని మీడియా వాళ్ళు ఫాలో అయితే బాగుంటుందేమో. పొద్దున్న లేస్తే అందరికీ సుద్దులు చెప్పేవాళ్ళు… కాస్త బుద్ధిగా ఉండకపోతే ఎలా?