ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ముగించుకుని వచ్చేశారు. ఎప్పటిలానే వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, పర్యటన విశేషాలు చెప్పారు. ఆంధ్రాకు రాబోతున్న పరిశ్రమల గురించి, ఆంధ్రా గురించి అక్కడివారు ఏమనుకుంటున్నారు అనేది చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని మరీ విడ్డూరంగా అనిపిస్తున్నాయి. భారతదేశం అంటే ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితి ఇతర దేశాల్లో వచ్చిందని చంద్రబాబు చెప్పారు! ఈ స్థాయి గుర్తింపు రావడం కోసం ఎంతో శ్రమించామనీ, రాష్ట్రాన్ని ఎన్నో దేశాల్లో ప్రమోట్ చేశామనీ, విదేశాల్లో ఇప్పుడు తనను అందరూ గుర్తుపట్టే పరిస్థితికి వచ్చిందని చంద్రబాబు నాయుడు వివరించారు. వ్యాపార వాణిజ్యాలకు అనువైన రాష్ట్రంగా ఆంధ్రా ఉందనే అభిప్రాయాన్ని కలిగించామని చెప్పారు. ఇంకా చాలా విషయంల్లో ఏపీ ముందజలో ఉందనే అభిప్రాయం ఇతర దేశాలకు కలిగిందన్నారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నుంచీ ఆహ్వానం అందిందీ, వెళ్లొచ్చారు, కొన్ని సంస్థల్ని ఇక్కడకు ఆహ్వానించగలిగారు! అంతవరకూ బాగానే ఉంది. కానీ, ప్రపంచంలో అందరూ తనను గుర్తుపట్టే పరిస్థితి వచ్చిందని చెప్పుకోవడమే… ఏదోలా వినిపిస్తోంది. అంటే, ఆయన విదేశాలకు ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబుగా వెళ్తున్నారా..? చంద్రబాబు ఆంధ్రా ముఖ్యమంత్రిగా వెళ్తున్నారా..? రెండిటికీ చాలా తేడా ఉంది. మొదటిది రాష్ట్రం కోసం ఆయన వెళ్తున్నట్టు. రెండోది ఆయనతో రాష్ట్రం వెళ్తున్నట్టు. రాష్ట్రాభివృద్ధి ముసుగులో తనను తాను ప్రమోట్ చేసుకుంటునట్టు అనిపిస్తోంది! ఆయన ప్రమోట్ చేస్తున్నది ఆంధ్రానా… ముఖ్యమంత్రినా..?
ఇండియా అంటే ఏపీ మాత్రమే అని ఎవరైనా ఎందుకనుకుంటారు చెప్పండీ! అనుకునే అవకాశం లేదని కాదు. కచ్చితంగా ఉంది. కానీ, ఎప్పుడూ… అంతర్జాతీయ స్థాయి అమరావతి నిర్మాణం పూర్తయ్యాక, రాష్ట్రం పొడవునా ఉన్న తీర ప్రాంతంలో పర్యాటక రంగం అద్భుతంగా అభివృద్ధి చెందాక, చంద్రబాబు చెబుతున్న పరిశ్రమల స్థాపన జరిగాక. కానీ, ఇవన్నీ ఇంకా త్రీడీ చిత్రాల్లోనూ, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల స్థాయిలోనే ఉన్నాయి కదా! ఇవన్నీ డాష్ బోర్డ్ మీదికి రావాలి కదా. ఇప్పుడు ఏం చూసుకుని ఇండియా అంటే ఆంధ్రా మాత్రమే అని ఇతర దేశాలు అనుకుంటున్నాయో చంద్రబాబే చెప్పాలి! మనల్ని మనం తక్కువ చేసి చెప్పుకోకూడదు. కానీ, మరీ ఎక్కువ చేసి చెప్పుకునే కంటే… కాస్త తగ్గి ఉంటే తప్పేముంది..?