కేంద్ర ఆర్థికమంత్రి ఈసారి ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌పై సామాన్యులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే, గత ఏడాది చివరిలో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో అన్ని రంగాలూ కుదేలయ్యాయి. పరిశ్రమలు భారీ నష్టాలను చవిచూశాయి. ఇప్పటికీ బ్యాంకుల్లో నగదు అందుబాటుపై రకరకాల ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోడీ సర్కారు ప్రవేశపెడుతున్న బడ్జెట్లో ఎన్నో ఉద్దీపనాలు ఉంటాయని అనుకున్నారు. కానీ, ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిపెట్టుకుని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా ఉంది. రూ. 3 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్నులో ఓ 5 శాతం తగ్గింపు వచ్చారు. దాంతోపాటు రూ. 3 లక్షలకు మించి జరిగే క్యాష్ డీలింగ్స్‌పై ఆంక్షలు పెట్టారు. గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. అయితే, పరిశ్రమల వర్గాలకు ఆశించిన ఉద్దీపనాలు లేవు. ట్యాక్స్ విధానంలో కూడా భారీ మార్పులేవీ లేవు. డిజిటల్ ఎకానమీ ప్రోత్సాహం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
మొత్తంగా అర్థం అవుతున్నది ఏంటంటే… డీమానటైజేషన్ ప్రభావం ఈ సంవత్సరమంతా దేశ ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని కేంద్రం బడ్జెట్ ద్వారా పరోక్షంగా స్పష్టం చేసింది. నోట్ల రద్దు నిర్ణయం తరువాత దేశం కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని భాజపా సర్కారు చెప్పకనే చెప్పినట్టయింది. అందుకే, ఈ బడ్జెట్లో కీలకమైన నిర్ణయాలు ఏవీ లేకుండా పోయాయి. ఇక, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే… ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి, భారీ ఎత్తున కేటాయింపులు ఉంటాయనుకున్నారు. కేంద్రానికి ఏపీ స్పెషల్ స్టేట్ అని కేంద్రమంత్రులు ఊదరగొడుతూ వచ్చారు కాబట్టి… బడ్జెట్లో ఏపీకి ఏదో ఉంటుందని ఆశించారు. కానీ, ఏపీకి మొండి చెయ్యి చూపించారు.
బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు అదనపు నిధుల కేటాయింపు ఉంటుందనుకున్నారు. కానీ, ఆ ప్రస్థావనే లేదు. నాబార్డుకు నిధులు పెంచినట్టు చెప్పారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును నాబార్డు రుణసాయం చేస్తోంది కాబట్టి… పరోక్షంగా ఇది పోలవరం ప్రాజెక్టుకు ఉద్దీపనమే అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఇక, ఏపీ తమకు ఎప్పుడూ ప్రత్యేకమైన రాష్ట్రమే… గుజరాత్ స్థాయిలో అభివృద్ధి చేసేవరకూ ప్రధాని నిద్రపోరూ అంటూ ఎంపీలు ఊదరగొట్టినా.. చివరికి బడ్జెట్లో ఏమీ లేదు! అమరావతిలో రాజధానికి భూములిచ్చినవారికి ట్యాక్స్ మిహాయింపు, క్యాపిటల్ గెయిన్స్ తప్పించి.. ఇతర అంశాల్లో ఎక్కడా ఏపీకి ప్రాధాన్యత దక్కలేదు.
ఈసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్ తో కలిసి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం విశాఖకు రైల్వే జోన్ పక్కాగా వస్తుందని అనుకున్నారు. కేంద్ర రైల్వే మంత్రి ఏపీ నుంచే రాజ్యసభకు ఎన్నికయ్యారు! కాబట్టి, రైల్వే జోన్ విషయమై ఈ బడ్జెట్లో ఏదో ప్రకటన ఉంటుందని ఆశించాం. కానీ… ఆ విషయంలోనూ ఏపీకి మొండి చెయ్యే చూపించారు. ఐ.ఆర్.సి.టి.సి.లో టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి సర్వీస్ టాక్స్ మినహా, అక్కడా కీలక నిర్ణయాలేవీ లేవు. ఆంధ్రాకి చాలా విద్యా సంస్థల్ని ఇచ్చిందని ఎప్పట్నుంచో కేంద్రం చెబుతూ వస్తోంది. కానీ, ఈ బడ్జెట్లో వాటికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపులు జరగలేదు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ఇదే జరిగింది. నాబార్డు నుంచి దశలవారీగా ప్రాజెక్టులకు ఫలానా మొత్తంలో నిధులు ఇస్తామనే క్లారిటీ కూడా కేంద్ర బడ్జెట్లో లేదు!
మొత్తంగా.. కేంద్రం ఏపీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేస్తోందని మన నాయకులు చెప్పుకోవడమే తప్ప, బడ్జెట్లో అదేదీ కనిపించలేదు. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే… ఈ బడ్జెట్ అదరహో అంటూ చంద్రబాబు ప్రశంసించడం. డిజిటల్ ఎకానమీ అభివృద్ధి కోసం తాను చేసిన సూచనలనే కేంద్రం బడ్జెట్లో పాటించిందని చెప్పుకుంటూ మురిసిపోవడం!