ఇకపై రాజకీయ పార్టీలు తీసుకునే విరాళాలపై లెక్కలు చూపాల్సి ఉంటుంది… తాజా కేంద్ర బడ్జెట్లో మోడీ సర్కారు ప్రతిపాదించింది. దేశంలో రాజకీయ పార్టీలు తీసుకునే విరాళాలు రూ. 20 వేలకు మించితే లెక్కలు తప్పనిసరి. అంతేకాదు.. నగదు రూపంలో రూ. 2 వేల లోపు మాత్రమే విరాళంగా స్వీకరించాలి. అంతకుమించితే.. చెక్కులూ డీడీల డిజిటల్ లావాదేవీల ద్వారా తీసుకోవాలి. రాజకీయ పార్టీలు కూడా ఇకపై ఆదాయ పన్ను చట్ట పరిధిలోకి వస్తాయి. పార్టీలూ ప్రతీయేటా ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. రాజకీయ వ్యవస్థలో మార్పుల్లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో వెల్లడించారు. రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులకూ, పార్టీ నిధులపై పాదర్శకతకూ దోహదపడే నిర్ణయమే ఇది. అయితే, ఈ నిర్ణయం ప్రభావం ప్రాంతీయ పార్టీలపై వేరేలా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దీర్ఘకాలంలో ప్రాంతీయ పార్టీల బలాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి వ్యూహాత్మక నిర్ణయం తీసుకుని ఉంటారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గత ఏడాది దేశంలోనే అత్యధికంగా విరాళాలు అందుకున్న పార్టీ భాజపా. ఆ తరువాత, స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే, తమకు అవసరమైన నిధులన్నీ వివిధ మార్గాల ద్వారా సమకూర్చుకున్న తరువాత.. ఇతర పార్టీలను దెబ్బతీసే ఉద్దేశంతోనే బడ్జెట్ లో ఇలాంటి నిర్ణయాన్ని వెలువరించారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇతర పార్టీలను ఆర్థికంగా దెబ్బ కొట్టాలన్నదే ఈ నిర్ణయం ముఖ్యోద్దేశం అని వారు ఆరోపిస్తున్నారు.
ఇక, ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే… చిన్నచిన్న మొత్తాలే ప్రాంతీయ పార్టీలకు నిధుల రూపంలో వస్తుంటాయి. రూ. 2 వేలుకు కాస్త అటుఇటుగా కిందిస్థాయిలో పార్టీలు కలెక్ట్ చేస్తాయి. ఆ వివరాలను కూడా బయట పెట్టాలని ఇప్పుడు అంటుంటే… విరాళాలు ఇచ్చేవారు తగ్గిపోతారన్న ఆందోళన వ్యక్తమౌతోంది. ఎందుకంటే, రాజకీయ విరాళాలను గోప్యంగా ఉంచాలని చాలామంది కోరుకుంటారు. అలాంటిది రూ. 2 వేలు దాటి ఇచ్చినవారి వివరాలన్నీ బయటపెడతారంటే… ఇచ్చేవారు తగ్గిపోతారేమో అనేది విశ్లేషకుల అభిప్రాయం. జాతీయ స్థాయి పార్టీలకు పెద్దమొత్తంలో కార్పొరేట్ల నుంచి విరాళాలు అందుతాయి. సెక్షన్ 80సీ ప్రకారం వారికి పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. సో.. జాతీయ పార్టీలపై ఈ నిర్ణయం ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. కానీ, ప్రాంతీయ పార్టీల నిధుల సమీకరణపై దీని ప్రభావం ఉంటుందనే అంటున్నారు.
కొసమెరుపు: ఓ లక్ష రూపాయలు పార్టీకి విరాళంగా ఇద్దామనుకునేవారు ఓ యాభైమంది పేర్లతో తలా రూ.2వేల చొప్పున డొనేషన్ రాసేస్తే..? కేంద్రం గొప్పగా చెబుతున్న నిర్ణయం సక్రమంగా అమలయ్యే పరిస్థితి ఉంటుందా..? ఏమో.. ఆశాజీవులంతా వేచి చూడటమే!!