నారా లోకేష్ సాధించాడు. గత కొంతకాలం మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమే అయితే చంద్రబాబుపైన లోకేష్ విజయం సాధించాడు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే లోకేష్‌కి ఎమ్మెల్సీ ఇవ్వడం, ఆ తర్వాత మంత్రిని చేయడంలాంటి విషయాలు చంద్రబాబుకు సుతరామూ ఇష్టం లేదని ప్రచారం లేపారు. ఆ ప్రచారం నిజం అయితే మాత్రం లోకేష్ విజయం సాధించినట్టే లెక్క. కానీ కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల గురించి, వైఎస్ జగన్ వారసత్వం గురించి ఎన్నో సార్లు ఘాటు విమర్శలు చేసిన చంద్రబాబు….ఇప్పుడు తాను చేసిన విమర్శలన్నీ బూమరాంగ్ అయి ఎక్కడ తన మెడకు చుట్టుకుంటాయో అని చెప్పి ఈ పొలిటికల్ డ్రామాను నడిపించి ఉంటే మాత్రం చంద్రబాబు, లోకేష్‌లు ఇద్దరూ గెలిచినట్టే లెక్క. అయితే ఇక్కడ లోకేష్ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు కూడా కొన్ని ఉన్నాయి.
2014 ఎన్నికల సమయంలో చాలా హంగామా చేశాడు లోకేష్. టిడిపిలో ఉన్న నాయకుల వారసులందరికీ ప్రతినిధిగా…ఆ యువనాయకులతో చాలా సమావేశాలు ఏర్పాటు చేశాడు. ఆ సమావేశాలన్నింటిలోనూ లోకేష్ చెప్పిన మాట ఒకటి ఉంది. పదేళ్ళుగా ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో ఈ సారికి మాత్రం మనం ఎవ్వరమూ కూడా టిక్కెట్స్ అడగొద్దని, 2019లో మాత్రం అందరం పోటీ చేద్దామని చెప్పాడు లోకేష్. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిన పరిస్థితులు ఉండబట్టే తాను కూడా పోటీ చేయడం లేదని, కేవలం పార్టీ గెలుపు కోసమే కృషి చేయాలని నిర్ణయించుకున్నానని, మీరందరూ కూడా అలానే చేయాలని పార్టీ వారసత్వ యువనాయకులకు మార్గదర్శనం చేశాడు లోకేష్. లోకేష్ కోరుకున్నట్టుగానే పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే తన రాజకీయ తెలివితేటలు ప్రదర్శించాడు లోకేష్. టిడిపి పార్టీ కార్యక్రమాలన్నింటిలోనూ తాను హైలైట్ అయ్యేలా చూసుకున్నాడు. పార్టీ నేతల అందరినోటా లోకేష్ మాట వినిపించేలా ప్లాన్ చేశాడు. గ్రామాల నుంచీ హైదరాబాద్ వరకూ ఉన్న అన్ని టిడిపి పోస్టర్స్‌లోనూ తన ఫొటో ఉండేలా చూసుకున్నాడు. అలా నాయకుడయిపోయాడు లోకేష్. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా ఖాయం అయింది. ఆ తర్వాత మంత్రి అవడం కూడా పెద్ద విషయం కాదు.
పార్టీ స్థాపించినప్పటి నుంచి దశాబ్ధాలుగా టిడిపిని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకుల రాజకీయ వారసులు చాలా మందే టిడిపిలో ఉన్నారు. 2014లో వాళ్ళందరికీ 2019 మన టార్గెట్ అని చెప్పిన లోకేష్ ఇప్పుడు మంత్రి అయిపోతున్నాడు. అలా అరంగేట్రంతోనే పార్టీ యువ నాయకులందరికీ ఝలక్ ఇఛ్చాడు లోకేష్. ఇప్పుడు కూడా ఆ యువనాయకులెవ్వరూ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడరు. కానీ వాళ్ళ ఆలోచనలను అయితే ఈ నిర్ణయం ప్రభావితం చెయ్యకుండా ఉంటుందా? పార్టీ పైన ఉండే గౌరవం, అభిమానం తగ్గించకుండా ఉంటుందా? అందుకేనేమో నాయకులు కూడా పార్టీలపైన అభిమానం, గౌరవం లాంటి విషయాల గురించి ఆలోచించకుండా….ఎవరు పదవిని ఆఫర్ చేస్తే వాళ్ళవైపు జంప్ చేస్తున్నారు. ఇప్పుడు పార్టీని నమ్ముకున్నవాళ్ళకు ఇలా ఝలక్ ఇస్తూ ఉండే పార్టీ అధినేతలు….నాయకులు పార్టీకి హ్యాండ్ ఇచ్చినప్పుడు మాత్రం నైతిక విలువల పాఠాన్ని బోధించడానికి రెడీ అయిపోతారు. ఏది ఏమైనా రాజకీయంలో ఉన్నంత డ్రామా టీవీ సీరియల్స్‌లో కూడా ఉండదేమో.