మన మీడియా తీరుతెన్నులు రకరకాలుగా వుంటాయి. ఏదైనా ఉగ్రవాద సంస్థ అజ్ఞాతంగా లేఖ రాసినా అది పెద్ద దుమారం రేపుతుంది. ఇస్లామిక్ తీవ్రవాదులు లేదా మావోయిస్టులు ఎవరినైనా బెదిరిస్తే ఎక్కడ లేని హడావుడి కనిపిస్తుంది. ఇంటర్వ్యూలు చర్చలు ఇన్వెస్టిగేషన్లు చూస్తాం. కాని ఈ దేశంలో ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి తల నరకాలని పాలక వ్యవస్థను నడిపించే సంస్థ నాయకుడొకరు బాహాటంగా పిలుపునివ్వడమే గాక అందుకు పురస్కారం కూడా ప్రకటిస్తే మాత్రం మీడియాకు పెద్ద చలనం లేదు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆరెస్సెస్ నాయకుడు కుందన్ చంద్రావన్ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తలనరికి తెచ్చిన వారికి కోటి రూపాయలు ఇస్తానని బహిరంగంగానే ప్రకటించారు. వీడియో కూడా వుంది. అయినా సరే అది పెద్ద వార్త కాదు. దానిపై దుమారం రేగదు. వార్త ఇచ్చి సరిపెడతారు.మధ్య ప్రదేశ్ ప్రభుత్వం గాని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గాని ఆయనను అరెస్టు చేసి కేసు పెట్టవు. పైగా ఆ రాష్ట్ర హౌం మంత్రి భూపేంద్ర సింగ్ ఏదో ఆవేశంలో అన్డాడంటూ మాఫీ చేసేస్తారు. ఐఎస్ఐఎస్ వంటి వాటి ఉగ్రవాదబెదిరింపులపౖనమాట్లాడేమనం దానికీ ఆరెస్సెస్ రాష్ట్ర నాయకుడి తీవ్ర బెదిరింపునకూ మధ్యన తేడా ఎందుకు పాటిస్తున్నట్టు? రాజకీయాలలో పండిపోయిన విజయన్ వంటివారికి ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. ఇదే విధంగా హిందూత్వ శక్తులు మంగుళూరుకు ఆయనను రానివ్వబోమని సవాలు చేసినా ఆయన వెళ్లి పాల్గొని తగు సమాధానం చెప్పే వచ్చారు.
ఇప్పుడు కూడా కుందన్ దుశ్చర్యతో ఆయన హడలిపోవడమేమీ జరగదు. కాని ఒక దుస్సంప్రదాయాన్ని సహించనట్టవుతుంది. కేరళలో ఆరెస్సెస్ సిపిఎంల మధ్య ఘర్షణలు హత్యలు ఇరువైపులా జరుగుతున్నాయి.కేవలం ఒకవైపు కథనే చూస్తే పొరబాటవుతుంది. ఈ మద్య ఆరెస్సెస్ కార్యాలయంపై బాంబులు వేశారంటూ ఈ రోజు సిపిఎం కార్యాలయాన్నే ధగ్ధం చేశారు. ఎవరి రాజకీయాలు వారు చేసుకోవచ్చు గాని ఈ విధమైన ఉద్రిక్తతలూ దౌర్జన్యాలు అవసరమా? విజయన్ ఈ ఘటనలపై కొంతకాలం కిందట అఖిలపక్ష సమావేశం జరిపారు. ఆ విధమైన శాంతికృషి మరింత పెరగాలి. ఆరెస్సెస్ బిజెపిలు కూడా సహకరించాలి.