ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయం అందరికంటే ఎక్కువగా చంద్రబాబునే బాధించినట్టుగా ఉంది. అంతకుముందు తెలంగాణా ఉద్యమ సమయంలో కూడా బాబు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. 2004లో చంద్రబాబు ఓడిపోవడానికి తెలంగాణా ఉద్యమం కూడా ఓ కారణమైంది. విభజన ఉద్యమం సమయంలో బాబు ఇబ్బందులను పక్కనపెడితే రాష్ట్ర విభజన నిర్ణయం దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్న టైంలో చంద్రబాబు బాగా ఇబ్బంది పడ్డాడు. తెలంగాణా ప్రజల దృష్టిలో కాంగ్రెస్‌ని దోషిగా నిలబెట్టాలన్న ఉద్ధేశ్యంతో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా టిడిపి నిర్ణయం తీసుకుందని చెప్పి రాష్ట్రపతికి లేఖరాశాడు బాబు. అంతటితో ఊరుకుని ఉన్నా బాగుండేది. కానీ కాంగ్రెస్‌ని పూర్తిగా కార్నర్‌ని చేయాలని చెప్పి తెలంగాణా రాష్ట్రం ఎప్పుడిస్తారో చెప్పండి అని డిమాండ్ చేయడం మొదలెట్టాడు బాబు. చంద్రబాబు డ్రామాలను సోనియాగాంధీ దగ్గరకు మోసేశారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సోనియా నిర్ణయం తీసుకోవడంలో బాబు నిర్ణయాలు కూడా బాగానే ప్రభావితం చేశాయి. ఢిల్లీ వరకూ వెళ్ళి మరీ అన్ని పార్టీల అధినేతలను కలిసి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసిన చరిత్ర బాబుది. కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలు తెలంగాణాకు అనుకూలంగా ఉన్నాయి అని ఎన్నోసార్లు విమర్శించాడు బాబు. కానీ టిడిపి నాయకులు ఊహించని విధంగా తెలంగాణా రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసేసుకున్నారు సోనియా గాంధీ. ఇక ఆ తర్వాత నుంచి చంద్రబాబు ఆడిన డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమా? కాదా? అన్న ప్రశ్నకు బాబు దగ్గర సమాధానమే లేకుండాపోయింది. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత నుంచి సీమాంధ్ర ప్రజలకు ఉన్న ఒకే ఒక్క పెద్ద నాయకుడు చంద్రబాబే. అందుకే చంద్రబాబుపైన చాలా ఆశలే పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అనుకూల మీడియాని అడ్డుపెట్టుకుని చెడ్డపేరు రాకుండా చూసుకోవడంపైనే కాన్సన్ట్రేట్ చేశాడు. అశోక్ బాబులాంటి వాళ్ళను అడ్డుపెట్టుకుని సమైక్యాంధ్ర క్రెడిట్ జగన్‌కి పోకుండా జాగ్రత్తపడ్డాడు.
విభజన నిర్ణయం జరిగిపోయిన తర్వాత నుంచి మాత్రం వీర సమైఖ్యవాది అయిపోయాడు బాబు. మరీ ముఖ్యంగా తెలంగాణా తెలుగుదేశం పార్టీకి ఆశలు లేవు అని తెలిసినప్పటి నుంచీ తెలంగాణా విభజన నిర్ణయమే బాబు జీవితంలో అత్యంత పెద్ద విషాదం నింపిన నిర్ణయం అయింది. అలా అని ఆయనే చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ బాబు మాటలు వింటున్నవాళ్ళకు మాత్రం సీమాంధ్రప్రాంతం నుంచి ఉన్న అతి పెద్ద నాయకుడైన చంద్రబాబు… తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం సమయంలో సీమాంధ్ర ప్రజల తరపున నిలబడలేకపోయాడు. సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చేశాడు. ఆ పాప భారం బాబుని బాగానే ఇబ్బందిపెడుతున్నట్టుగా ఉంది. అందుకే నాయకులు, ప్రజలు కూడా మరిచిపోయిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ…….ఆ ఎపిసోడ్లో నేనే హీరో అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు బాబు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో ఉన్నాడు. ఢిల్లీకి భయపడుతున్నాడు అన్నది కంటికి కనిపిస్తున్న నిజం. ప్రత్యేక హోదా, ప్యాకేజ్, రైల్వే జోన్, పోలవరం, రాజధాని నిధులు లాంటి అన్ని విషయాల్లోనూ మోడీకి అనుకూలంగా, సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు బాబు. కానీ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే చేస్తున్నా అని నమ్మించడం కోసం మాత్రం భజన మీడియా ద్వారా నానా రకాల ప్రయత్నాలూ చేస్తున్నాడు. ఢిల్లీకి భయపడడం లేదని అస్తమానం చెప్పుకుంటూ ఉన్నాడు. అలాగే ప్రతిపక్ష పార్టీకి, నాయకుడికి కనీస పాటి గౌరవం ఇచ్చే ఉద్ధేశ్యం కూడా బాబుకు లేదు. అందుకే ఏ ఒక్క కార్యక్రమానికి కూడా జగన్ రావాలి అన్న ఉద్ధేశ్యంతో ఆహ్వానించింది లేదు. ఈ సారి అసెంబ్లీ ప్రారంభోత్సవానికి మాత్రం వైకాపాతో సహా మిత్రపక్షాలైన బిజెపి, జనసేనలకు…కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కూడా ఆహ్వానాలు పంపలేదు. ఫెయిల్యూర్స్ అన్నింటికీ వేరేవాళ్ళు బాధ్యులు, సక్సెస్ క్రెడిట్ మాత్రం నా ఒక్కడిదే అని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటే. ఈ సారి కూడా అసెంబ్లీ భవన స్రారంభోత్సవం సందర్భంగా కేవలం చంద్రబాబు భజన మాత్రమే వినిపించాలని అనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఇతర పార్టీల నాయకులెవ్వరూ రాకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా ఆహ్వానాలు పంపే కార్యక్రమాన్ని డీల్ చేశారు. అత్యంత అనుభవజ్ఙుడిననే చెప్పుకునే చంద్రబాబు ఇలా చేశాడంటే విమర్శలు వస్తాయి కాబట్టి….ఆ నెపాన్ని కూడా ప్రతిపక్ష పార్టీపైకి నెట్టేశాడు.
ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచినప్పుడు మీడియా మొత్తం బాబుకు అనుకూలంగా ఉండడం, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లేకపోవడంలాంటివి కలిసి వచ్చి బాబు హీరో అయ్యాడు. కానీ ఇప్పుడు మాత్రం బాబు రాజకీయం మొత్తం ప్రజలకు పూర్తిగా అర్థమవుతోంది. రెండు దశాబ్ధాల క్రితం చేసిన రాజకీయమే ఇప్పుడు కూడా చేస్తాననడం బాబుకు మైనస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం చెప్పిన విషయమే మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే……….ఫైనల్‌గా నేను చెప్పిందే కరెక్ట్ అవుతుంది అన్న భ్రమల్లో ఉన్నట్టున్నాడు. గత రెండేళ్ళ నుంచి మాత్రం బాబు పాలనపైన చాలా ఎక్కువ విమర్శలే వచ్చాయి. మూడేళ్ళుగా కేవలం మాటలతోనే కాలం వెల్లిబుచ్చుతున్నాడు బాబు. ఇక రాబోయే రెండేళ్ళలో అయినా మాటల్లో హీరోయిజాన్ని చేతల వరకూ తీసుకుని వస్తాడేమో చూడాలి. తప్పులు చేయడం ఎందుకు…ఆ తప్పులను సమర్థించుకోవడం కోసం తాపత్రయపడుతూ ఉండడం ఎందుకు అన్న విమర్శకుల సలహాలను ఏమైనా స్వీకరించే అవకాశం ఉందేమో చూడాలి.