తెలుగు భాష‌..టీటీడీ అధ్య‌క్ష ప‌ద‌వి

ఏది సంప్ర‌దాయం? ఏది సంస్కృతి? ఏది ఉత్త‌రం.. ఏది ద‌క్షిణం…ఈ వ్య‌త్యాసాలు ఎందుకొచ్చాయి? రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కోసం ఒక‌రు.. సంప్ర‌దాయ‌మంటూ మ‌రొక‌రు… స‌మాజాన్ని ఎక్క‌డికి తీసుకెడుతున్నారు? ఎందుకీ అన‌వ‌స‌ర పిత‌లాట‌కాలు? అనిల్ కుమార్ సింఘాల్‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కార్య‌నిర్వ‌హ‌ణాధికారిగా నియ‌మించిన‌ప్ప‌టి నుంచి ఈ సెగ రాజుకుంది. ఉత్త‌రాదివారికి టీటీడీ ఈఓ ప‌ద‌వి ఎందుకిస్తార‌ని ట్వీట్ చేస్తారు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అనిల్ కుమార్ సింఘాల్‌కు ఇవ్వ‌డాన్ని తాను త‌ప్పుప‌ట్ట‌డం లేదంటున్నారు మ‌రో వంక‌న‌. దీన్నేమంటారు..డ‌బుల్ స్టాండ‌ర్డ్ కాదా? ఒక ప‌ద‌విని అడ్డుపెట్టుకుని.. కాదు కాదు.. త‌న రాజ‌కీయ మ‌నుగ‌డ కోసం ద‌క్షిణాదిని భుజ‌స్కంధాల‌పైన మోస్తున్న‌ట్లు అవ‌కాశ‌మూ.. సంద‌ర్భ‌మూ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్వీంకారాలు చేస్తున్నారు. దీని వ‌ల్ల ఒరిగింది ఏమైనా ఉందా…యువ‌త‌రం ఆలోచ‌న‌ల‌ను ప్ర‌భావితం చేయ‌డం త‌ప్ప‌? ఏంట‌ట అనిల్ కుమార్ సింఘాల్ ఈఓ అయితే. ఎవ‌రికైనా న‌ష్ట‌మా? ఆయ‌నేమైనా సామాన్యుడా. సుదీర్ఝ రాజ‌కీయానుభ‌వం క‌లిగిన అధికారి.. ద‌శాబ్దం పైనే తెలుగు రాష్ట్రంలో ప‌నిచేసిన వ్య‌క్తి. తెలుగువారికే ఈఓ ప‌ద‌వి ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తే స‌మంజ‌సంగా ఉంటుంది. టీటీడీ ఏపీలో ఉంది కాబ‌ట్టి.. ఆ సంస్థ‌పై మెరుగైన అవ‌గాహ‌న ఉంటుంది కాబ‌ట్టీ అని చెప్పుకోవ‌డానికి బాగుంటుంది. దాన్ని విడిచిపెట్టి.. ఉత్త‌రాది .. ద‌క్షిణాది అంటూ విద్వేష‌భావాల‌ను రెచ్చ‌గొట్ట‌డం.. రాజ‌కీయాల్లో ఎంతో భ‌విష్య‌త్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు త‌గ‌దు. ఆయ‌నకే కాదు ఎవ‌రికీ త‌గ‌దు.

అనిల్ కుమార్ సింఘాల్‌పై మ‌రో వ్య‌క్తి కూడా ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌న్నెందుకు ఎంపిక‌చేశారంటూ ప్ర‌శ్నించారు. తెలుగు రాని వారికి ఆ ప‌ద‌విని ఎలా క‌ట్ట‌బెడ‌తార‌నీ అడిగారు విశాఖ శార‌దా పీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి. వీల‌యిన‌ప్పుడ‌ల్లా రాజ‌కీయాల‌ను స్పృశిస్తుంటారీయ‌న‌. ఆయ‌న వైఖ‌రి చూస్తుంటే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ద‌గ్గ‌ర‌గా ఉంటార‌నిపిస్తుంది. ఆయ‌న‌తో హోమాలు చేయించ‌డం, యాగాలు నిర్వ‌హింప‌జేయ‌డం.. వంటి ప‌నులు చేశారాయ‌న‌. స్వ‌రూపానంద త‌ను ఏ ఉద్దేశంతో పీఠాన్ని స్థాపించారో దానికి బ‌ద్ధులై ఉంటే ఆయ‌న‌పై ఎటువంటి అప‌ప్ర‌ధ‌లు చోటుచేసుకోవు. కాద‌ని ప‌రిపాల‌నప‌ర‌మైన అంశాల‌లో త‌ల‌దూరిస్తే ఆయ‌న‌కూ రాజ‌కీయ క‌శ్మ‌లం అంటింద‌నుకోవాల్సి వ‌స్తుంది. ఇక్క‌డ విశేష‌మేమిటంటే.. తెలుగురాని అధికారిని ఈఓగా చేశార‌ని విమ‌ర్శింనందుకు స‌మాధానంగానా అన్నట్టు సింఘాల్ అచ్చ‌మైన తెలుగులో మీడియాతో మాట్టాడారు. తాను తెలుగు చ‌ద‌వ‌డ‌మే కాక‌.. రాయ‌గ‌ల‌న‌నీ చెప్పారు. ఈ స‌మాధానం చాల‌దా స్వామీజికి.

ఆంధ్ర వారిని బద్ధ శ‌త్రువులుగా భావించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం తాను చేసే హోమాల‌కు ఆంధ్ర బ్రాహ్మ‌ణ పండితుల‌కే పెద్ద పీట వేస్తున్నార‌ని గుర్తుంచుకోవాలి. అయినా అనిల్ కుమార్ సింఘాల్ నియామ‌కం వెనుక ఏం ఒత్తిడులున్నాయో.. చంద్ర‌బాబు అంద‌రికీ చెప్పుకోలేరుగా. ఇలాంటి అంశాల‌పై త‌గ‌వులు పెట్టాల‌నీ, విమ‌ర్శ‌లు కుప్పించాల‌నీ చూడ‌డం స‌మంజ‌సం కాదేమో.. విజ్ఞులిద్ద‌రూ ఆలోచించాలి. రేపో మాపో టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వికీ ఎవ‌రినో ఒక‌రిని నియ‌మించాల్సి ఉంటుంది. ఇప్పటికే రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీమోహ‌న్ పేరు వినిపిస్తోంది. ఆయ‌న చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులు. ఈయ‌న విష‌యంలో కూడా వివాదం రేప‌గ‌ల‌రా. రాజ‌కీయ ప‌ద‌వుల్లా మారిపోయిన అధ్య‌క్ష‌ప‌దవుల మీద మాట్లాడ్డం అన‌వ‌స‌ర‌మ‌నుకుంటే మ‌న‌కు బోలెడు స‌మ‌యం మిగులుతుంది. ఎందుకంటే చంద్ర‌బాబు ఎవ‌రి మాటా విన‌రు గ‌నుక‌. ఏడుకొండ‌ల వాడికైన ఈ వ్య‌వ‌హారంలో బిత్త‌ర చూపులు చూడ‌క త‌ప్ప‌దు క‌దా గోవిందా!
-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.