కేసీఆర్ మాట‌ల్లోని ఆంత‌ర్యం.. భాజ‌పాని ఎదుర్కోవ‌డం!

ఢిల్లీలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశార‌ని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌నీ, గ‌డ‌చిన మూడేళ్ల‌లో తెలంగాణ ఎంతో ప్ర‌శాంతంగా ఉంద‌న్నారు. స‌మ‌స్య‌ల విష‌యంలో తెలుగు రాష్ట్రాలు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగుతాయ‌ని చెప్పారు. రాష్ట్రాల మ‌ధ్య ఉన్న జ‌ల వివాదాల‌కు త్వ‌ర‌లోనే ప‌రిష్కార మార్గం దొరుకుతుంద‌నే ఆశాభావం వ్య‌క్తం చేశారు. చిన్న విష‌యాల‌కు గొడ‌వలు ప‌డ‌టం వ‌ల్ల స‌మ‌యం వృధా త‌ప్ప ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్నారు. ద‌క్ష‌ణాదిన అత్యంత త్వ‌ర‌గా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలుగా ఆంధ్రా తెలంగాణ నిలుస్తాయ‌ని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు క‌లిసి మెలిసి ఉండాల్సిన అవ‌స‌రాన్ని ఈ విధంగా కేసీఆర్ గుర్తు చేశారు. అయితే, ఈ వ్యాఖ్య‌ల వెన‌క ఉన్న అంత‌రార్థం వేరే ఉంద‌ని చెప్పాలి! రాజ‌కీయంగా తెలుగు రాష్ట్రాల ఐక్య‌త‌ను ఢిల్లీ స్థాయిలో చాటి చెప్పాల్సిన అవ‌స‌రాన్ని గుర్తు చేస్తున్నార‌ని చెప్పాలి.

తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచేందుకు కేంద్రం మీన‌మేషాలు లెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అంతా అయిపోయిందీ, పార్ల‌మెంటు స‌మావేశాల్లో బిల్లు పెట్ట‌డ‌మే ఆల‌స్యం అనుకుంటే… ఈ విష‌య‌మై రాజ‌కీయ నిర్ణ‌యం అవ‌స‌ర‌మంటూ భాజ‌పా ట్విస్ట్ ఇచ్చింది. సీట్ల పెంప‌కం వ‌ల్ల తెలంగాణ‌లో భాజ‌పాకి ఏమీ ప్ర‌యోజనం లేద‌న్న‌ది సుస్ప‌ష్టం. ఆంధ్రాలో సీట్ల సంఖ్య పెరిగితే.. తెలుగుదేశం పార్టీకే ప్ల‌స్‌! టీడీపీతో పొత్తు పెట్టుకున్నా భాజపాకి మ‌హా అయితే ఓ 15 సీట్లు మాత్ర‌మే టీడీపీ ఇస్తుంది. ఎలా చూసుకున్నా రాజ‌కీయంగా భాజ‌పాకి ఏమాత్రం క‌లిసిరాని నిర్ణ‌యం ఇది. అయితే, సీట్ల సంఖ్య పెంచ‌క‌పోతే తెరాస‌, టీడీపీల‌కు క‌ష్ట‌మే! కార‌ణం, ఆ న‌మ్మ‌కంతోనే ఈ రెండు పార్టీలూ ఎడాపెడా ఫిరాయింపుల్ని ప్రోత్స‌హించేశాయి. పైగా, తెలుగు రాష్ట్రాల‌కు బాస‌ట‌గా ఇన్నాళ్లూ నిలిచిన కేంద్ర మాజీ మంత్రి వెంక‌య్య నాయుడు కూడా ఇప్పుడు క్రియాశీల పాత్ర పోషించ‌లేని ప‌రిస్థితి.

కాబ‌ట్టి, తెలుగు రాష్ట్రాల ప్ర‌యోజ‌నాల కోసం విడివిడిగా కంటే.. తెరాస‌, టీడీపీలు క‌లిసి ప్ర‌య‌త్నాలు చేయాల్సిన అవ‌స‌రాన్ని ఈ రెండు పార్టీలు గుర్తించిన‌ట్టున్నాయి. ప్ర‌స్తుతం కేసీఆర్ మాట‌ల్లోని అంత‌రార్థం కూడా ఇదే అనొచ్చు. భాజ‌పా ఎంత ప్ర‌య‌త్నించినా ఏపీ తెలంగాణ‌ల్లో ప్రాంతీయ పార్టీల దోస్తీ లేకుండా సోలోగా ఎన్నిక‌ల‌కు దిగే ప‌రిస్థితి ఉండ‌దు. దిగినా అనూహ్య ప్ర‌భావం ఉండ‌క‌పోవ‌చ్చు. ఈ విష‌యాన్ని భాజ‌పాకి చెప్పేందుకే అన్న‌ట్టుగా ఓ స‌ర్వే గురించి కూడా కేసీఆర్ ఢిల్లీలో మాట్లాడారు. ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి 43 శాతం ఓట్లొస్తాయ‌నీ, వైసీపీకి 45 శాతం వ‌స్తాయ‌నీ, భాజ‌పాకి కేవ‌లం 2 శాతం మాత్ర‌మే వ‌స్తాయ‌ని చెప్పారు. జ‌న‌సేన ప్ర‌భావం 1.2 శాతానికే ప‌రిమితం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో భాజ‌పా ప్ర‌భావం చాలా త‌క్కువ ఉంటుంద‌నే విష‌యాన్ని కేసీఆర్ గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారనే చెప్పాలి. ఏపీ, తెలంగాణ‌ల్లో ప్రాంతీయ పార్టీల‌పై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రాన్ని భాజ‌పాకి తెలిసేలా చేయాలంటే.. ఇద్ద‌రు చంద్రులూ క‌లిసిక‌ట్టుగా ఉన్నామ‌ని చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌స్తుతం కేసీఆర్ చేస్తున్న‌ది అదే అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.