ఫ్లిప్ కార్ట్ సంత గోల

దేశంలో శరన్నవరాత్రులు ఒకపక్క మొదలవుతుంటే, మరోపక్క ఈ పండుగ సీజన్ లో వ్యాపారాన్ని మూడుపువ్వులు, ఆరుకాయలు చేసుకోవాలని అనేక సంస్థలు ఆఫర్లతో ఊదరగొడుతున్నాయి. వీటికి తోడుగా ఇ-కామర్స్ ఆధారంగా ఓ పెద్ద సంతగోల మొదలుకాబోతుంది. అదే ఫ్లిప్ కార్ట్ సంత. క్రిందటి ఏడాది బిగ్ బిలియన్ డే సేల్ అంటూ హడావుడి చేయడం, చివరకు చేతులెత్తేసే పరిస్థితి తెచ్చుకోవడం ఇ-కామర్స్ తో పరిచయంఉన్నవారికి గుర్తుండేఉంటుంది. అయినప్పటికీ ఫ్లిప్ కార్ట్ మరోసారి ఇప్పుడు బిగ్ సేల్ డే ప్రకటించింది. అయితే ఈసారి రెట్టింపు ఉత్సాహంతో, ఒక్కరోజుతో సరిపెట్టుకోకుండా ఏకంగా ఐదురోజులపాటు బిగ్ బిలియన్ సేల్ అవకాశాన్ని కస్టమర్స్ కి అందుబాటులోకి తీసుకువస్తున్నది. వస్తువులను క్యాటగిరైజ్ చేసి ఒక్కోరోజు కొన్ని తరహాల వస్తువుల అమ్మకానికి ప్లాన్ చేశారు. అక్టోబర్ 13 మంగళవారం నుంచి శనివారం వరకు వివిధ వస్తువులను సరసమైన ధరలకు అందించడానికి పెద్ద ఎత్తున రంగం సిద్దం చేసింది. క్రిందటి ఏడాదిలాగా కాకుండా ఈసారి వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాంకేతిక, మానవవనరుల పరంగా చర్యలు తీసుకున్నదట. మరి ఫ్లిప్ కార్ట్ బిగ్ సేల్ హిట్టవుతుందా? ఫట్ అవుతుందా?

చేదు అనుభవాలు

గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ పేరు జనంలో ఇంకా బాగా నానింది. దీనికి ప్రధాన కారణం, మొదటి బిగ్ బిలియన్ డై సేల్. దీంతో చాలామందిలో ఇ-కామర్స్ పట్ల అవగాహన పెరిగింది. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం కూడా ఓ ప్లస్ పాయింటైంది. క్రిందటి ఏడాది ఫ్లిప్ కార్ట్ సంస్థ ఎంతమంది ఉత్సాహం చూపిస్తారన్న విషయంపై సరైన అంచనాకు రాలేక బోల్తాకొట్టింది. దీంతో చాలా మంది కస్టమర్స్ కి బిగ్ బిలియన్ డే సేల్ కాస్తా బిగ్ డిజాస్టర్ డే గా ముగిసింది. కోరుకున్న అందరికీ సరుకు ఇవ్వలేక ఫ్లిప్ కార్ట్ నానా అవస్థలు పడింది. చివరకు సారీ చెప్పుకోవాల్సివచ్చింది. అయితేనేం, వ్యాపారపరంగా చూస్తే 600కోట్ల రూపాయల మేరకు అమ్మకాలు ఆ ఒక్కరోజు జరిగాయి. చాలా మంది తమకు ఇష్టమైన ప్రాడెక్ట్ కొందామని ఫ్లిప్ కార్ట్ ని ఆన్ లైన్ లో తెరిస్తే, ఆ ప్రాడెక్ట్ మీద `అవుట్ ఆఫ్ స్టాక్’ అంటూ కనిపించింది. దీంతో చాలామంది చిరాకుపడ్డారు. ఇదంతా ఓ పెద్ద డ్రామా అంటూ పెదవి విరిచారు.

చేదుఅనుభవాలు ఉన్నప్పటికీ ఫ్లిప్ కార్ట్ మళ్ళీ అతిపెద్ద సంతని ఎందుకు ఓపెన్ చేస్తున్నది? క్రిందటిసారే సర్వర్ డౌన్ అయ్యే పరిస్థితి వచ్చిందని చెబుతున్నప్పుడు, ప్రాడెక్ట్ విషయంలో చేతులెత్తేసినప్పుడు మళ్ళీ ఈ సంత గోలేమిటి? ఒకసారి నానాఇక్కట్లు పడ్డతర్వాత, కస్టమర్స్ కన్నెర్ర చేసిన తర్వాత మళ్ళీ `సాహసం చేయరా డింభకా’ అంటూ ఫ్లిప్ కార్ట్ ఎందుకు మెగా సేల్ కి కూతపెడుతున్నది? ఇలాంటి సందేహాలు,అనుమానాల కోట్లాదిమంది కస్టమర్స్ లో కలుగుతున్నాయి. అయినా ఇ-పోర్టర్ళ సంతకెళ్ళి సామాన్లు కొనుక్కోవాలన్న ఉబలాటం మాత్రం తగ్గలేదనీ, పైపెచ్చు పెరిగిందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

తప్పుల దిద్దుబాటు

క్రిందటిసారి ఫ్లిప్ కార్ట్ బిగ్ సేల్ పెట్టినప్పుడు ఆ సంస్థతో 15లక్షల మేరకు టోకు దుకాణాలు లేదా ఉత్పత్తిచేసే కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కస్టమర్ నేరుగా ఫ్లిప్ కార్ట్ పోర్టల్ కి వెళ్ళి వస్తువును సెలెక్ట్ చేసుకుని ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేస్తే చాలు, సదరు వస్తువు కస్టమర్ ఇంటికి వచ్చిచేరుతుంది. వస్తువుల ధరలు చిల్లర దుకాణంలో కంటే చవగ్గా ఉండటం ఇ- కామర్స్ ప్రత్యేకం. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న ఫ్లిప్ కార్ట్ ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. పండుగ రోజులను దృష్టిలో పెట్టుకుని దేశమంతటా 19వేలమంది డెలివరీ బాయిస్ ని సిద్ధం చేశారు. అంతేకాదు, దేశమంతటా 20వేల పోస్టల్ పిన్ కోడ్ ఏరియాలు సేల్ డీల్ లో కవర్ అయ్యేలా చూస్తున్నారు.

అయినప్పటికీ అనుమానాలు ఉండనే ఉన్నాయి. పండుగ సీజన్లలో అమ్మకాల వత్తిడిని ఫ్లిప్ కార్ట్ ఎందుకని తట్టుకోలేకపోతుందన్నదే అసలు ప్రశ్న. ఫ్లిప్ కార్ట్ కి వచ్చే ట్రాఫిక్ లో 75శాతం మొబైల్ ఫోన్ల నుంచి వస్తున్నదే. పండుగ సీజన్ కాబట్టి ఇది 80శాతం దాటవచ్చు. గతంలోలాగా డెస్క్ టాప్ లేదా పీసీల ద్వారా (కంప్యూటర్ల ద్వారా) సేల్ చేసే అవకాశం ఇవ్వకుండా కేవలం మొబైల్ ఫోన్లలో తమ కంపెనీ (ఫ్లిప్ కార్ట్) యాప్ ద్వారానే అమ్మకాలకు తలుపులు తెరవాలని కంపెనీ అనుకుంటున్నది. కేవలం మొబైల్ యాప్ ద్వారానే డీల్ జరుగుతుంది కనుక గతంలోలాగా అంత ఒత్తిడి ఉండదన్నది కంపెనీ అభిప్రాయం. అయితే, డెస్క్ టాప్ కంప్యూటర్ల ద్వారా కొనుగోళ్లు ఆపేయాలనీ , కేవలం యాప్ ద్వారానే కొనసాగించాలన్న నిర్ణయం కూడా వివాదాస్పదమైంది. డెస్క్ టాప్ కస్టమర్స్ సామాజిక మీడియా ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఇక మిగిలిన సమస్య, అవుట్ ఆఫ్ స్టాక్. క్రిందిటిసారి బిగ్ సేల్ ప్రారంభమైన గంటల్లోనే `నో స్టాక్’ అన్న డిస్ప్లే కనిపించింది. ఈసారి ఈ పరిస్థితి తలెత్తకుండా సెల్లర్స్ (వస్తువుల అమ్మకం దారుల)తో ఒప్పందం కుదుర్చుకుని భారీ మొత్తంలో స్టాక్ అందుబాటులో ఉండాలా చూస్తున్నారు. అంతేకాదు, క్రిందటిసారి కేవలం కొద్ది రూపాయిల విలువచేసే చిన్నచిన్న వస్తువులను కూడా బిగ్ సేల్ పరిధిలో ఉంచింది. అయితే ఈసారి అలా కాకుండా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తులను తగ్గింపు ధరల్లో ఉంచాలని అనుకుంటున్నది.

మొత్తానికి ఫ్లిప్ కార్ట్ మరో సాహసోపేతమైన ఇ- కామర్స్ సంతకు తెరతీసింది. ఈ బిగ్ సేల్ విజయం సాధిస్తే, ఇండియా మార్కెట్ పై ఇలాంటి సంస్థలు గట్టిపట్టు సంపాదించుకున్నట్లే అవుతుంది. ఫలితంగా కొనుగోలుదారులకు సరికొత్త బిగ్ గేట్ తెరిచినట్లవుతుంది.

ఈ పండుగ సీజన్ లో ఈ-కామర్స్ పోర్టళ్ల ద్వారా దేశవ్యాప్తంగా 52వేల కోట్లు రూపాయల (8బిలియన్ డాలర్ల) మేరకు అమ్మకాలు జరగబోతున్నాయని అసోచామ్ అంచనావేస్తోంది. గత ఏడాది ఇదే సీజన్ లో 30వేల కోట్ల రూపాయల మేరకు అమ్మకాలు జరిగాయి. దసరా, దీపావళి సీజన్లను పురస్కరించుకుని ఫ్లిప్ కార్ట్ తోపాటు స్నాప్ డీల్, జబాంగ్, అమెజాన్ వంటి సంస్థలు ఇ -కామర్స్ కు తలుపులు బార్లా తెరిచాయి. అయితే ఈ ధోరణి మంచిది కాదని అఖిలభారత వ్యాపార సంఘం (కాయిట్) అంటోంది. ఇ- పోర్టళ్లు వ్యాపారానికి కేవలం సాంకేతిక వేదికలుగానే ఉండాలేకానీ నేరుగా వ్యాపారంలోకి దిగడం తప్పన్న వాదన వినబడుతోంది. వస్తువులను తయారుచేసేవారికి – ఇ- కామర్స్ పోర్టళ్లన్నవి `యజమాని’ కాదుకనుక, వాటిపై పోర్టళ్లు రాయితీలు ప్రకటించడం సరైనది కాదని వాదిస్తూ కాయిట్ ఇప్పటికే కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖకు ఫిర్యాదుచేసింది. ఇ-పోర్టళ్లు నిర్వహించే సంతగోలతో దేశంలోని సాంప్రదాయ దుకాణాలు మూతపడే పరిస్థితి రాకూడదన్నది వీరి వాదన.

ఇవన్నీ మాకెందుకు..

అయితే, కస్టమర్ల ఆలోచనలు మరో రకంగా ఉన్నాయి. డిస్కౌంట్లు, ఆఫర్లంటూ అనేక రిటైల్ షాపుల్లో అమ్మే వస్తువుల ధరలకంటే, ఇ-కామర్స్ ద్వారా ఇంకా తక్కువ ధరలకే వస్తువులు కొనుగోలు చేసే అవకాశం వచ్చినప్పుడు కాలడ్డుపెట్టడం సరికాదన్నది కస్టమర్ల వాదన. పైగా తాము కోరుకున్న వస్తువు అతి తక్కువ ధరలకే నేరుగా ఇంటికి చేరుతుండటం వారికి ఆనందాన్ని పంచిపెడుతోంది. అయితే తక్కువ ధరలకు వస్తున్నాయికదా అని అంతగా అవసరంలేని వస్తువులను కూడా కొనుగోలు చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సివస్తుందన్న విషయం మరువరాదు. ఏదిఏమైనా ఇ- కామర్స్ సృష్టిస్తున్న సంచలనం ఇంకా ఎన్నిమలుపులు తిరుగుతోందో వేచి చూద్దాం.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కవిత బెయిల్ పిటిషన్ పై నేడే తీర్పు..

లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై సోమవారం తీర్పు వెలువరించనుంది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ కేసులో తనను ఈడీ, సీబీఐలు అక్రమంగా అరెస్ట్ చేశాయని, తనకు బెయిల్...

నేడు ఏపీలో ప్రధాని పర్యటన..వైసీపీని టార్గెట్ చేస్తారా.?

సోమవారం ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు మద్దతుగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 : 30 గంటలకు...

ఓటేస్తున్నారా ? : మీ పిల్లలు బానిసలుగా బతకాలనుకుంటున్నారా ?

ఊరంటే ఉపాధి అవకాశాల గని కావాలి. మనం ఊళ్లో బతకాలంటే పనులు ఉండాలి. ఆ పనులు స్థాయిని బట్టి రియల్ ఎస్టేట్ పనుల దగ్గర నుంచి సాఫ్ట్...

తెలంగాణ మోడల్…బీజేపీ, బీఆర్ఎస్ కు రాహుల్ అస్త్రం ఇచ్చారా..?

కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ మోడల్ ను అమలు చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటన చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఆరు నెలలే అవుతున్నా అప్పుడే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close