రాజధాని నిర్మాణానికి భావోద్వేగాల పునాదిరాళ్లు !

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి శంకుస్థాపన కార్యక్రమం దగ్గరపడింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి రాజధానిని ప్రజలకు అందివ్వబోతున్నారు? పటిష్టమైన పునాదిరాళ్లతోనా ? లేక భావోద్వేగాల పునాదిరాళ్లతోనా?

చంద్రబాబులో చాలా మార్పువచ్చింది. తెలుగువారి సంస్కృతిని నెత్తిమీద పెట్టుకుని పూజిస్తున్న నేటి బాబు ఎక్కడా?, హైటెక్కులతో చివరకు రైతుసంక్షేమాన్ని కూడా పట్టించుకోని అలనాటి బాబు ఎక్కడ? ఈ మార్పు చివరకు ఎటుదారితీస్తుంది? భావోద్వేగాలతో ఆడుకుంటున్న బాబు చివరకు ఈ రాష్ట్రాన్ని ఎటుతీసుకుపోవాలనుకుంటున్నారు? తాను మంచి చేస్తున్నానని అనుకోవడం వేరు, అలా ప్రజలు భావించగలగడం వేరు. ఈ రెంటికీ మధ్య ఉన్న తేడాను బాబు తెలుసుకుంటున్నారా?

అపరిచితుడు

చంద్రబాబులో ఒక అపరిచితుడు కనబడుతున్నాడు. కొన్నేళ్లక్రిందటివరకూ, కనిపించిన చంద్రబాబుకు భిన్నమైన రూపం ఇది. గతంలో బాబు అధికారంలో ఉన్నప్పుడు చాలా వ్యూహాత్మకంగా అడుగులువేసే మనిషి. అభివృద్ధి, హైటెక్ ఆలోచనలతో ముందుకుసాగే వ్యక్తి. కానీ ఇప్పుడు- మరో రూపంలో కూడా దర్శనమిస్తున్నారు. ఈ రూపం సెంటిమెంట్స్ ని పెంచిపోషిస్తోంది. అందుకే ఆయన భావోద్వేగాలు (ఎమోషన్స్) తో నూతన రాజధానిని కట్టేయాలనుకుంటున్నారు. అంటే ఈ నిర్మాణానికి పునాదిరాళ్లు ఎమోషన్సే. వాటినిఅడ్డు పెట్టుకుని రాజకీయంగా ముందుకుసాగిపోవాలనుకుంటున్నారు.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఫక్తు హైటెక్ సీఎం. ఇందులో ఎలాంటి సందేహాలుఉండేవికావు. ప్రజల మనోభావాలు, ఎమోషన్స్ కి అంతగా ప్రాముఖ్యత ఇవ్వకుండా తానుఅనుకున్న పనులు చక్కబెట్టేవారు. విద్యుత్ కోతలతో రైతులు తల్లడిల్లుతున్నా అప్పట్లో బాబుఅంతగా స్పందించలేదు. బషీర్ బాగ్ సంఘటనతో కళ్లుతెరుచుకున్నా అప్పటికే ఆలస్యమైపోయింది. చేతులు కాలాయి. తన రాజకీయ ప్రత్యర్థి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకవైపు రాష్ట్రమంతటా పర్యటిస్తూ, ప్రజలకష్టాలు తెలుసుకుంటుంటే, మరోవైపు చంద్రబాబు ఎగతాళి చేసిన సందర్భాలున్నాయి. అయితే 2004 ఎన్నికల్లో తెలుగుదేశం గద్దెదిగాల్సివచ్చింది. ఆ తర్వాత నుంచీ చంద్రబాబులో అంతర్మథనం ప్రారంభమైంది.

హైటెక్ ఆలోచనలను పక్కనబెట్టి ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. చివరిగా 2014 ఎన్నికలకు ముందు బాబు `మీకోసం’ అంటూ పాదయాత్రలు చేశారు. ప్రజల సమస్యలు అర్థం చేసుకున్నారు. బాబులో మానసిక పరివర్తన వస్తున్న సమయంలోనే రాష్ట్రంలో అనుకోని సంఘటనలు జరిగాయి. రెండోసారి గెలిచిన తర్వాత ఒక కార్యక్రమానికి వెళ్తూ వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు, ఆ తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారు. జగన్ ఓదార్పు యాత్రలు, దీక్షలంటూ ప్రజలకు బాగా దగ్గరయ్యారు. జగన్ వ్యూహాత్మకంగా సాగుతున్న తీరు చంద్రబాబులో ఆలోచనలను రేపింది. భావోద్వేగ అస్త్రం (ఎమోషనల్ ఫ్యాక్టర్)ని ప్రజల్లో ఎంతగా మార్పుతెస్తుందో బాబు గమనించారు.

గోదావరి ఎమోషన్స్

నవ్యాంధ్ర ప్రదేశ్ అవతరణ తర్వాత వచ్చిన ఎన్నికల్లో బాబు విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికే ఆయనగారి మైండ్ సెట్ మారింది. ముందుగా మనం గోదావరి పుష్కరాల సంగతి చెప్పుకుందాం.

గోదావరి మహాపుష్కరాలప్పుడు ప్రవర్తిచిన శైలి ఆయన భావోద్వేగాలను ఎంతగా ఉపయోగించుకున్నారో చాటిచెప్పింది. పుష్కరాలకు ఆహ్వానించడం కోసం బాబు వ్యూహాత్మకంగా అడుగులువేశారు. కేంద్రమంత్రులను, బీజేపీ నేతలను, మహావీఐపీలను తరలిరమ్మని కబురుపంపారు. తాను మతపరమైన ఉత్సవాలకు ఏమాత్రం వ్యతిరేకంకాదనీ, తమ పార్టీ గతంలోలాగా లౌకక పార్టీ కాదన్న అర్థంవచ్చేలా వీలుచిక్కినప్పుడల్లా బీజేపీ అగ్రనేతల చెవిలో వేస్తూనే ఉన్నారు. కేంద్రమంత్రుల్లో ఎక్కువమంది రాజమండ్రికి రాకపోయినా వారి ఆశీస్సులు అందుకోవడంలో బాబు సఫలీకృతులయ్యారు. తీరా ప్రారంభంరోజునే తొక్కిసలాట జరిగేటప్పటికీ బాబు కలవరపడ్డారు. ఇక అక్కడే మకాంవేసి ఎలాంటి ఇక్కట్లు తలెత్తకుండా లాక్కొచ్చారు. చివరిరోజున మహాగోదావరి మహాసక్సెస్ అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. మహాగోదావరి పుష్కరాలను ఒక భావోద్వేగ కార్యక్రమంగా తీసుకువచ్చారు. తన ఎమోషనల్ స్పీచ్ ప్రజలమీద ఆశించినస్థాయిలో ముద్రపడిందనే బాబు భావించారు. అందర్నీ పట్టించుకున్నట్లు ప్రజల్లో బలమైన ముద్రపడాలంటే మతపరమైన సెంటిమెంట్స్ బాగా పనిచేస్తాయని బాబు స్వీయఅనుభవంతో తెలుసుకున్నారు.

కృష్ణాగోదావరి పవిత్ర సంగమం

ఆ తర్వాత ఎమోషనల్ స్పీచ్ ఇవ్వడానికీ, తద్వారా ప్రజల గుండెల్లో తానో దేవుడిగా ముద్రవేయించుకోవడానికి బాబుకు మరోఅవకాశం వచ్చింది. అదే, కృష్ణాగోదావరి పవిత్ర సంగమం. పవిత్ర గోదావరి జలాలను కృష్ణలో కలుపుతున్నట్లు ప్రకటించారు. ఆ మహోత్సవంకోసం కృష్ణాజిల్లా ఫెర్రీ దగ్గర కోట్లు ఖర్చుపెట్టారు. ఆరోజు బాబు చేసిన ప్రసంగం ఎమోషనల్ స్పీచ్ కి పరాకాష్టగా మారింది. కృషానదిలో గోదావరి జలాలను కలపడంకోసమే తాను బ్రతికిఉన్నాననీ, ఆనాడు అలిపిరి సంఘటనలో తృటిలో తాను తప్పించుకోవడం వెనుక ఇదే పరమార్థమన్న రీతిలో మాట్లాడారు. గోదావరి జలాలు కృష్ణమ్మను కలుస్తున్నాయని చెప్పి ఘనంగా పూజాదికాలు చేయించారు. అసలు అక్కడికి వచ్చిన నీళ్లు నిజంగా గోదావరివేనా ? ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి మొత్తం ఎన్ని గేట్లు తెరవాలి, ప్రస్తుతం తెరిచినవి ఎన్ని? అన్న ఆలోచనలు ఎవ్వరిలోనూ పెద్దగా తలెత్తకుండానే నదీజలాల సంగమం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తయినట్లు ప్రకటించుకున్నారు.

భావోద్వేగాలతో పనులు చక్కబెట్టుకోవడం బాబు ఈమధ్య అలవరుచుకున్ననూతన సిద్ధాంతం కావచ్చేమోకానీ, మరీ కొత్తదేమీకాదు, ఇదే ఫార్ములాతో గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత ఆయనగారి కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు చాలా దగ్గరయ్యారు. వైఎస్సార్ మరణానంతరం జగన్మోహన్ రెడ్డి చేసిన ఓదార్పు యాత్రలు కూడా భావోద్వేగ ఫార్ములాతో నడిచినవే. ఎన్నికల ప్రచారసమయంలో విజయలక్ష్మి తనచేతిలో మతపరమైన గ్రంథం పట్టుకునే ప్రచారం చేయడం మైనార్టీ ఓట్లకోసమైతే, మరో పక్క జగన్ తనకు అన్నిమతాల వారు సమానమైనన్నట్టుగా తిరుమల గిరులెక్కడం మెజార్టీ హిందూ ఓట్లకోసమే.

తెలుగు సంస్కృతి , భాష

ప్రజల్లో ఎమోషనల్ ఫీలింగ్స్ పెంచడంలో మతం, మతాచారాలు, కుటంబసానుభూతి వంటి వ్యవహారాలను ఎంచుకోవడమే కాదు, ప్రాంతీయ, భాషాపరమైన, చారిత్రిక కారణాలను కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చుని నేతలకు బాగానే తెలిసింది. అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కాదు, గతంలో ఎన్టీఆర్ కూడా ప్రాంతీయ భాషా, సంస్కృతుల భావోద్వేగాల ఆధారంగానే విజయాలను సొంతం చేసుకున్నారు.

ఇక చంద్రబాబు గతంలో 9 సంవత్సరాలు పాలించిన అనుభవం ఉన్నప్పటికీ ప్రజల్లో మమేకం అవడంలో తప్పటడుగులేవేశారు. కానీ అదే తప్పు ఇప్పుడు చేయదలచుకోలేదు. తన రాజకీయ చతురతకు తోడు ఎమోషనల్స్ ను కూడాకలుపుకుంటే తన కీర్తి ఆచంద్రార్కం నిలిచిఉంటుందన్న భావన బలపడింది. మతపరమైన ఎమేషనల్స్ ను పెంచడంతోపాటుగా అభివృద్ధి, అద్భుతమైన నూతన రాజధాని వంటి అంశాలను కూడా తన వ్యూహాల బుట్టలోంచి పైకితీశారు.

మనిషి – దేవుడు

చంద్రబాబు వయస్సు 65 సంవత్సరాలు. దీంతో ఆయన ప్రతిపనిలో ప్రత్యేకతను పొందుపరిచి తద్వారా శాశ్వత కీర్తిని దక్కించుకోవాలని అనుకుంటున్నారు. అంటే మనిషి నుంచి దేవుడుగా మారినట్లు అనిపించుకోవాలనుకుంటున్నారు. ఇందులో తప్పేమీలేదు. కాకపోతే ఈ దిశగా ఆయన అనుసరిస్తున్న విధానాలు, ఒంటెద్దు పోకడలు విమర్శలకు గురయ్యేవిగా ఉన్నాయి. మంచిపనులు చేస్తే మనిషిని దేవుడిగా గుర్తిస్తారు, భావిస్తారు. అలాంటి వ్యక్తి ఫోటోలను ఇళ్లలో పెట్టుకుని పూజిస్తారు. ఆస్థాయి గతంలో కొంతమంది నాయకులు సాధించారు. మరి ఈ దిశగా ఆలోచిస్తే, చంద్రబాబునాయుడు చేసిన లేదా చేస్తున్న పనులువల్ల ఏమేరకు ఆయనగారు ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారో ఎవరికివారు లెక్కగట్టుకోవాలి. తాను మంచి చేస్తున్నానని అనుకోవడం వేరు, అలా ప్రజలు భావించగలగడం వేరు. ఈ రెంటికీ మధ్య ఉన్న తేడాను బాబు తెలుసుకోవాలి. అందివచ్చిన అవకాశాలను ఇప్పుడు కాలజార్చుకుంటే మళ్ళీ రాదన్న సంగతి బాబుకు బాగానే తెలుసు. అందుకే ఆయన ప్రతిఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. చంద్రబాబు అభివృద్ధి మంత్రం జపించడం కొత్తేమీకాదు. కానీ దీనికి తోడుగా భావోద్వేగ మంత్రం జోడించడంతో ఆయనలో కొత్త ముఖం ఇప్పుడు చూస్తున్నాం. బహుశా పెద్దరికం వల్ల ఆలోచనలల్లో వచ్చిన మార్పుగా కూడా దీన్ని భావించాలేమో.

భావోద్వేగాల రాజధాని

నవ్యాంధ్రకు నూతన రాజధాని నిర్మాణం తానుతప్ప మరెవ్వరి వల్ల సాధ్యంకాదన్న అభిప్రాయాన్ని చంద్రబాబు కలిగిస్తున్నారు. ప్రజల్లో తనపట్ల విశ్వసనీయత పెరగడానికి రాజధాని అంశాన్ని తురుఫు ముక్కలా ఎంచుకున్నారు. ఈ దిశలో సాగుతున్న చంద్రబాబు చివరకు నిర్మించేది పటిష్టమైన పునాదులున్న రాజధానికాదు, భావోద్వేగ పునాదులున్న రాజధాని. `ప్రజల రాజధాని’ పేరిట అందరి దగ్గరనుంచి విరాళాలు సేకరించాలనుకోవడం, ఇటుకలకు డబ్బులివ్వమనడం, ప్రతిఊరునుంచీ మన్ను, నీళ్లు తీసురండనీ ఆజ్ఞాపించడం, పసుపుకుంకుమలతో తరలిరండని పిలుపునివ్వడం వంటి చర్యలు పైకి చూసినప్పుడు అందర్నీ కలుపుకునే తత్వాన్ని ప్రతిబింబింపజేస్తున్నా, దాని వెనుక ఉన్న పరమార్థం మాత్రం ఎమోషన్స్ తో గేమ్ ఆడుకోవడమే. మంచిపనులు చేస్తూనే వాటిని సరిగ్గా క్యాష్ చేసుకోవడం ఎలాగో బాబుకు బాగానే తెలిసినట్లుంది.

ఎమోషన్స్ ను స్వీయప్రయోజనాలకు వాడుకోవడం ఓ ఆర్ట్. ఇది అందరికీ అంత తేలిగ్గా అబ్బే కళకాదు. నిత్యజీవితంలో కూడా మనం ఇలాంటి వాళ్లను చూస్తుంటాము. చక్కటి అభినయం, ఎదుటి వ్యక్తి కనిపెట్టలేనంతగా మాటల చాతుర్యం, కంటతడిపెట్టుకోవడం, తాను నిస్వార్థంగా ఉంటానంటూ నమ్మబలికించడం వంటి లక్షణాలు ప్రధానంగా కనబడుతుంటాయి. ఎదుటివ్యక్తిని భావోద్వేగాలతో తనదారికి తెచ్చుకోవడం ఎలాగో ఓసారి తెలిస్తే, ఆ తర్వాత ఎలాంటి అడ్డంకి ఉండదు. ఆ విద్య సరిగా అబ్బకపోతే బూమ్ రాంగై తలకు బొప్పికట్టవచ్చు. మరి ప్రస్తుతం ఎమోషన్స్ తో ఆడుకుంటున్న బాబు పరిస్థితి ఏమవుతుందో త్వరలోనే తెలుస్తుంది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంత మోసమా కొమ్మినేని ? వైసీపీ క్యాడర్‌ని బలి చేస్తారా ?

వైసీపీ క్యాడర్ ను ఆ పార్టీ నేతలు, చివరికి సాక్షిజర్నలిస్టులు కూడా ఘోరంగా మోసం చేస్తున్నారు. ఫేకుల్లో ఫేక్ .. ఎవరు చూసినా ఫేక్ అని నమ్మే ఓ గ్రాఫిక్...

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close