రివ్యూ: ఆకాశ‌వాణి

దేవుడంటే న‌మ్మ‌కం. న‌మ్మ‌క‌మే దేవుడు. రాయిలోనూ, ర‌ప్ప‌లోనూ, క‌నిపించిన ప్ర‌తి వ‌స్తువులోనూ దేవుడ్ని చూసే మ‌నుషులుంటే… వాళ్లూ దేవుళ్లే. అయితే ఆ అమాయ‌క‌త్వం వాడుకుంటూ – దేవుడ్ని కూడా మాయ చేసి, ఆ దేవుడ్ని మింగేసే రాక్ష‌సులూ ఉన్నారు. అలాంటి ఓ దొర‌, త‌న చేతుల్లో చిక్కుకున్న ఓ గూడెం, ఆ గూడానికి వ‌చ్చిన ఓ కొత్త దేవుడి క‌థ‌… ఈ ఆకాశ‌వాణి. రాజ‌మౌళి శిష్యుడు అశ్విన్ గంగ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. థియేట‌ర్ కోస‌మే తీసినా, చివ‌రికి ఓటీటీలోకి వ‌చ్చింది. సోనీ లైవ్‌లో `ఆకాశ‌వాణి`ని చూడొచ్చు. మ‌రింత‌కీ ఈ ఆకాశ‌వాణి క‌థేంటి?  ఆ కొత్త దేవుడు ఎవ‌రు?

అదో మారుమూల అట‌వీ ప్రాంతం. ఓ వంద‌మంది జ‌నాభా ఉంటారేమో..?  వాళ్ల‌కు బ‌య‌టిలోకం తెలీదు. క‌నీసం రేడియో కూడా చూడ‌ని అజ్ఞానం. ఆకాశంలో చుక్క‌ల్ని చూసి చ‌నిపోయిన‌వాళ్లంతా చుక్క‌లైపోతార‌న్న అజ్ఞానం. వాళ్ల‌కు దొర (విన‌య్ వ‌ర్మ‌)నే దేవుడు. త‌ను చెప్పిందే చ‌ట్టం. దొర చేసే అరాచ‌కాల‌కు అడ్డే ఉండ‌దు. గూడెం దాటి బ‌య‌ట‌కు ఎవ‌రైనా అడుగుపెడితే… వాళ్ల‌ని చంపేస్తాడు. దేవుడు తీసుకెళ్లిపోయాడు అని గూడెంని న‌మ్మిస్తాడు. అలాంటి గూడానికి ఓ అనుకోకుండా ఓ రేడియో వ‌స్తుంది. అందులోని మాట‌లు విని దేవుడే.. మాట్లాడుతున్నాడ‌ని భ్ర‌మ ప‌డి, రేడియోని తీసుకెళ్లి గుడిలో పెడ‌తారు. అక్క‌డి నుంచి వాళ్ల‌కు ఆకాశ‌వాణినే దొర‌ని మించిన దేవుడు. మ‌రి వీళ్ల అజ్ఞానాన్ని ఆ రేడియో మార్చ‌గ‌లిగిందా?  వాళ్ల త‌ల‌రాత‌ని తిరిగి రాయ‌గ‌లిగిందా?  ఆ గూడానికి రేడియోలానే అనుకోకుండా వ‌చ్చిన మాస్టారు (స‌ముద్ర‌ఖ‌ని) ఆ జ‌నాల‌కు చేసిన సాయం ఎలాంటిది?  ఆ దొర ఆగ‌డాలు ఎలా ఆగాయి?  అనేది మిగిలిన క‌థ‌.

నిజానికి చాలా విచిత్ర‌మైన క‌థ ఇది. రేడియోని దేవుడ‌ని న‌మ్మిన అమాయ‌క‌త్వం క‌థ‌. వాళ్ల అజ్ఞానంతో ఆడుకునే ఓ దొర క‌థ‌. దేన్న‌యితే అమాయ‌కంగా న‌మ్మారో…. ఆ రేడియోనే దేవుడి అవ‌తారం ఎత్తిన క‌థ‌. ఆలోచ‌న బాగుంది. ఓ కొత్త త‌ర‌హా ప్ర‌య‌త్నం అనిపించుకునే స్థాయి ఆ ఆలోచ‌న‌కు ఉంది. ప్ర‌పంచంతో సంబంధ‌మే తెగిపోయిన ఓ గూడెం, అందులోని ప్ర‌జ‌ల అమాయ‌క‌త్వాన్ని సొమ్ము చేసుకునే ఓ దొర‌, ఆ దొర ఆగ‌డాలు, న‌లిగిపోయిన జీవితాలు… ఇలాంటి స‌న్నివేశాలు, సంఘ‌ట‌న‌ల‌తో క‌థ మొద‌ల‌వుతుంది. ఆ గూడెం, అక్క‌డి క‌ట్టుబాట్లు అర్థ‌మ‌వ్వ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. దొర‌త‌నం చూపించే స‌న్నివేశాలు ఉద్వేగ భ‌రితంగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. ఆయా స‌న్నివేశాల్లో రాజ‌మౌళి మార్క్ కనిపిస్తుంది. ఎమోష‌న్ ని ఓ స్థాయికి తీసుకెళ్లి, ప్రేక్ష‌కుల్లోనూ ఉద్వేగం క‌లిగించ‌డం, ప్ర‌తినాయ‌క పాత్ర‌పై ఓర‌క‌మైన ప‌గ‌ని ప్రేక్ష‌కుడికీ క‌లిగించ‌డం రాజ‌మౌళి స్టైల్‌. దాన్ని త‌న స‌న్నివేశాల్లోనూ చూపించాడు అశ్విన్ గంగ‌రాజు.

గూడెంలోకి రేడియో ప్ర‌వేశించాక క‌థ‌లో చ‌ల‌నం వ‌స్తుంది. రేడియోని దేవుడ‌ని న‌మ్మడం ఓర‌కంగా సిల్లీగా ఉన్నా, గూడెం ప్ర‌జ‌ల బ‌ల‌హీన‌త‌కి అద్దం ప‌ట్టే స‌న్నివేశాలే అవి. స‌ముద్ర‌ఖ‌ని పాత్ర ప్ర‌వేశించే వ‌ర‌కూ క‌థ అక్క‌డ‌క్క‌డే తిరుగుతుంది. ప‌తాక సన్నివేశాలు, రేడియోలో వ‌చ్చే హిర‌ణ్య క‌శ్య‌ప నాట‌కాన్ని వాడుకునే విధానం ఇవ‌న్నీ పతాక సన్నివేశాల్ని నిల‌బెడ‌తాయి. చివ‌రికి తాము న‌మ్మిన దేవుడే.. శ‌త్రు సంహారం చేసి, గూడెం ప్ర‌జ‌ల్ని కాపాడిన భావ‌న క‌లుగుతుంది. ద‌ర్శ‌కుడు తాను న‌మ్మిన అంశాన్ని అక్క‌డ బ‌లంగానే చెప్ప‌గ‌లిగాడు. కాక‌పోతే… ఈ ప్రాసెస్ ఏమంత జ‌న‌రంజ‌కంగా సాగ‌దు.తొలి స‌గ భాగం క‌థ న‌త్త‌న‌డ‌క న‌డుస్తుంది. దొర‌త‌నాన్ని చూపించ‌డానికే ఆయా సన్నివేశాల్ని వాడుకున్నాడు. రేడియో అంటే ఏమిటో తెలియ‌కుండా కూడా ప్ర‌జ‌లు ఉంటారా?  అనే అనుమానం వేస్తే.. క‌చ్చితంగా ఈ క‌థ‌ని ఫాలో అవ్వ‌లేరు. గూడెం ప్ర‌జ‌ల అమాయ‌క‌త్వంలో కొంచెం ప్రేక్ష‌కులుగా మ‌న‌మూ తీసుకుంటే త‌ప్ప క‌థ‌తో క‌నెక్ట్ అవ్వ‌లేం.  నిజానికి ఈ సినిమా చూస్తున్న‌ప్పుడు, ముఖ్యంగా తొలి స‌గంలో `ఛ‌త్ర‌ప‌తి` గుర్తొస్తుంది. ఆ క‌థ‌కీ, ఈ క‌థ‌కూ సంబంధం లేక‌పోయినా ఎమోష‌న్ అలాంటిదే.

స‌ముద్ర‌ఖ‌ని, గెట‌ప్ శీను, విన‌య్ వ‌ర్మ త‌ప్ప మిగిలిన‌వాళ్లంతా కొత్త వాళ్లే. నాట‌క‌రంగం నుంచి వ‌చ్చిన‌వాళ్ల‌కు ఈ సినిమాతో అవ‌కాశం ఇచ్చారు. వాళ్లంతా త‌మ త‌మ పాత్ర‌ల్ని అద్భుతంగా పోషించారు. తెర‌పై న‌టిస్తోంది ఎవ‌రో తెలియ‌క‌పోయే స‌రికి… మ‌రింత స‌హ‌జ‌త్వం వ‌చ్చింది. స‌ముద్ర‌ఖ‌ని పాత్ర క్లైమాక్స్ కి ముందు మాత్ర‌మే వ‌స్తుంది. కాక‌పోతే ఆ పాత్ర ఈ క‌థ‌కు కీల‌కం. టెక్నిక‌ల్ గా ఈ సినిమా ఉన్న‌త స్థాయిలో ఉంది. అట‌వీ అందాల‌ను కెమెరాలో అందంగా బంధించారు. కాల‌భైర‌వ నేప‌థ్య సంగీతం మ‌రో ప్ర‌ధాన‌మైన ఆక‌ర్ష‌ణ‌. బుర్రా సాయిమాధ‌వ్ డైలాగుల్లో లోతు క‌నిపించింది. ముఖ్యంగా దేవుడు గురించి సంభాష‌ణ‌లు బాగా రాసుకున్నారు.

ద‌ర్శ‌కుడి ఆలోచ‌న మంచిది. దానికి పూర్తిగా క‌ట్టుబ‌డే సినిమా తీశాడు. కాక‌పోతే… ఈ సినిమా ప్రేక్ష‌కుల అభిరుచికి దూరంగా ఉంది. వాళ్ల‌కు కావ‌ల్సిన అంశాలేం ఇందులో క‌నిపించ‌వు. ఈ క‌థ‌ని ఇలానే చెప్పాలి.. లేదంటే అనుకున్నది అనుకున్న‌ట్టు చూపించ‌లేను.. అని ద‌ర్శ‌కుడు భావించి ఉంటాడు. అందుకే క‌మ‌ర్షియ‌ల్ లెక్క‌లు ప‌ట్టించుకోలేదు. ఆకాశ‌వాణి థియేట‌ర్ కోస‌మే తీసినా, ఓటీటీలోకి వ‌చ్చింది. థియేట‌ర్లో అంత ఓపిగ్గా ఈసినిమా చూడ‌డం క‌ష్ట‌మే. కాక‌పోతే… ఓటీటీ వ‌ర‌కూ ఓకే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

త్రివిక్రమ్ రాసిన సీన్ లో నేను నటించడం మర్చిపోలేను: నాగశౌర్యతో ఇంటర్వ్యూ

నాగశౌర్యకి యూత్ లో మంచి ఫాలోయింగ్ వుంది. యూత్ ఫుల్ కథలు ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్నాడు శౌర్య. ఇప్పుడు శౌర్య నుంచి మరో యూత్ ఫుల్ ఫ్యామిలీ డ్రామా వస్తుంది....
video

‘పుష్ప’లో రంగమ్మ మంగమ్మ మ్యాజిక్

https://www.youtube.com/watch?v=C70GJYVoZ4Y ''రంగస్థలం' లాంటి క్లాసిక్ తర్వాత సుకుమార్ చాలా గ్యాప్ తీసుకున్నారు. అల్లు అర్జున్ డేట్స్ దొరికేవరకూ వేరే ప్రాజెక్ట్ ముట్టుకోలేదు. చాలా హార్డ్ అండ్ గ్రౌండ్ వర్క్ చేసి ‘పుష్ప' ని సెట్స్...

బీ టౌన్ టాక్ : అల్లు అర్జున్ రాక్ స్టార్

అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ న్యూస్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిర్మాత కరణ్ జోహార్ అల్లు అర్జున్ ని రాక్ స్టార్ గా పిలిచారు. బుధవారం జరిగిన 'వరుడు కావలెను' ప్రీ...

వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ ఇన్నింగ్స్ !?

హైదరాబాద్ వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో తాము ఇప్పటికే సంప్రదింపులు జరిపామని చేరేందుకు అంగీకరించారని అంటున్నారు. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి,...

HOT NEWS

[X] Close
[X] Close