ఈవారం విడుదలైన సినిమాల్లో ‘సితారే జమీన్ పర్’ ఒకటి. అమీర్ ఖాన్ ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకొన్నాడు. ఓటీటీ బేరాలకు లొంగిపోకుండా, థియేటర్లకు ప్రేక్షకుల్ని తీసుకొద్దామన్న ఆశయంతో ఈ సినిమాని విడుదల చేశాడు అమీర్. తొలి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.60 కోట్లు సాధించింది. అమీర్ సినిమాల్లో టాప్ 10 గ్రాసర్ గా నిలిచింది. రూ.60 కోట్ల వసూళ్లు బాలీవుడ్ సినిమాకు పెద్ద మేటర్ కాదు. పైగా అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో సినిమాకు. తొలి రోజు రావాల్సిన ఓపెనింగ్ ఇది.
కాకపోతే ‘సితారే..’ రూ.50 కోట్లతో పూర్తయిన సినిమా. ఈ సినిమాకు అమీర్ నిర్మాత. తన పారితోషికాన్ని పక్కన పెట్టి చూస్తే తొలి మూడు రోజుల్లో పెట్టుబడి తిరిగి వచ్చినట్టే. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర కనీసం రూ.100 కోట్లు సాధిస్తుందని అంచనా. ఆ తరవాత శాటిలైట్ ఎలాగూ వుంది. 8 వారాల తరవాత యూ ట్యూబ్ లో పే ఫర్ వ్యూ పద్ధతిన సినిమా చూడొచ్చు. లేదంటే ఓటీటీకి అమ్మేస్తాడు. ఎలా చూసినా, అమీర్ ఖాన్కు ఈ సినిమా వర్కవుట్ అయినట్టే.
కాకపోతే.. ఈ సినిమా హిందీ బెల్ట్ లోనే ఆడుతోంది. మిగిలిన చోట్ల చాలా డల్. మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఎక్కువగా ఉన్న సిటీల్లో ‘సితారే..’ పెర్ ఫార్మ్సెన్స్ సరిగా లేదు. ఈ సినిమా ప్రచారం విషయంలో అమీర్ చాలా అశ్రద్ద చేశాడు. తన సినిమాని నార్త్ లోనే ప్రమోట్ చేశాడు. సౌత్ గురించి ఆలోచించలేదు. ఇక్కడ కూడా పబ్లిసిటీ చేసుంటే, వసూళ్లలో మార్పు కనిపించేది. అమీర్ సినిమాలకు దక్షిణాదిన కూడా అభిమానులు ఉంటారు. తన త్రీ ఈడియట్స్, పీకే చిత్రాలకు ఇక్కడ మంచి వసూళ్లు దక్కాయి. ఆ సంగతి విస్మరించిన అమీర్.. తగిన మూల్యం చెల్లించుకొన్నాడు. ఏది ఏమైనా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అమీర్ ఖాన్కు ‘సితారే..’ కాస్త ఉపశమనం కలిగించింది.