సెఫాలజిస్టుగా చెప్పుకుని రాజకీయ పార్టీలను, నేతలను ఖాతాదారులుగా చేసుకుని వారికి నచ్చే నెంబర్లు ఇచ్చే ఆరా మస్తాన్‌కు కష్టాలు వదిలి పెట్టడం లేదు. ఆయన ఫోన్ ట్యాపింగ్ కు గురయిందని గతంలో ఆరోపించారు. గతంలో ఆయనను ట్యాపింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్న వారు రెండు సార్లు పిలిచి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. నిజానికి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడానికి చాలా సార్లు వాయిదా వేశారు. కానీ తప్పనిసరిగా హాజరు కావాల్సి వచ్చింది. సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్ విచారణ ప్రారంభించడంతో మరోసారి ఆయనకు పిలుపు వెళ్లింది.
సజ్జనార్ సిట్ ఎదుట.. ఆరా మస్తాన్ మరోసారి హాజరయ్యారు. పిలవగానే వచ్చిన ఆయన… సిట్ అడిగినప్రశఅనలన్నింటికీ సమాధానాలిచ్చినట్లుగా తెలుస్తోంది. తన ఫోన్ ట్యాప్ అయిందని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఎవరు చేశారో ఆయన చెప్పలేదు కానీ.. ఎలా ట్యాప్ అయిందని అనుమానిస్తున్నారో అన్ని వివరాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది నేతల కోసం ఆయన పని చేసినప్పుడు ఈ ట్యాపింగ్ జరిగిందని అనుమానిస్తున్నారు. అదే విషయాన్ని సజ్జనార్ సిట్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది.
గతంలో ప్రశ్నించిన వారందర్నీ మరోసారి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ ప్రశ్నిస్తోంది. గతంలోలా వాళ్లు ఏం చెబుతున్నారన్నది లీక్ కానివ్వడం లేదు. వారి స్టేట్మెంట్లు రహస్యంగానే ఉంటున్నాయి. వారు చెప్పే వివరాలను బట్టి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సారి సూత్రధారుల వద్దకు వెళ్లాలని గట్టి పట్టుదలతో దర్యాప్తు బృందం ఉన్నట్లుగా తెలుస్తోంది.
