జగన్ రెడ్డి కక్ష సాధింపులతో ఐదు సంవత్సరాలు సర్వీసును కోల్పోయి.. కేసుల పాలై..మానసిక క్షోభ అనుభవించిన ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు తన సర్వీసును తెచ్చుకోలేదు కానీ జీతభత్యాలు తెచ్చుకున్నారు. కేసులన్నీ తేలిపోయాయి. ఇప్పుడు ఆయన ఫ్రీబర్డ్. ఆయన వేధింపులకు గురయ్యారని ఆయనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ప్రభుత్వం ప్రకటించింది.ఆ పదవితో ఆయన సంతృప్తి చెందలేదు. బాధ్యతలూ తీసుకోలేదు. కానీ తనకు ఆ పదవి అవసరం లేదని ఆయన ప్రభుత్వానికి చెప్పనట్లుగా కూడా సమాచారం లేదు. చెప్పి ఉంటే మరొకరికి ఆ పదవి ఇచ్చేవారు. కానీ ఆయన మాత్రం ఊళ్లన్ని తిరుగుతూ తన అసంతృప్తిని మాత్రం వ్యక్తం చేస్తున్నారు.
ఏదో టాపిక్ పట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు
ఏబీ వెంకటేశ్వరరావు ఒక్కోసారి ఒక్కో టాపిక్ ఎంచుకుంటున్నారు. ఓ సారి బనకచర్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు.తనలా ఖాళీగా ఉండే మేధావులతో ఓ ఫోరం కూడా ఏర్పాటు చేశారు. కొన్ని సమావేశాలు పెట్టారు. తర్వాత సైలెంటుగా ఉన్నారు. మరో టాపిక్ ఎంచుకున్నారు. విద్యుత్ సంస్థల్లో వైసీపీ హయాంలో భారీ అవినీతి జరిగిందని ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇలా వరుసగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కొన్నాళ్లు జగన్ రెడ్డి బాధితుల్ని అంటే.. కోడికత్తి శీను, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వంటి వారిని పరామర్శించి రాజకీయం చేశారు.
రాజకీయ పార్టీ పెడతాననిప్రకటన
తర్వాత రాజకీయ ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తానన్నారు. ఏ పార్టీనో తర్వాత చెబుతానన్నారు. తర్వాత సొంత పార్టీ ప్రకటన చేశారు. పార్టీ పెడతానన్నారు. ఆయన రాజకీయాలు చేస్తున్నారో బెదిరిస్తున్నారో టీడీపీ వర్గాలకు కూడా అంతు చిక్కడం లేదు. ఆయన ఇంటలిజెన్స్ చీఫ్ ఉన్నప్పుడు చేసిన పనుల వల్ల తమ పార్టీకి నష్టం జరిగిందని టీడీపీ క్యాడర్ అనుకుంటూ ఉంటారు. కానీ జగన్ పెట్టిన వేధింపుల కారణంగా ఆయనకు పూర్తి స్థాయి మద్దతు పలికారు. జగన్ కు ఎక్కడా తలొగ్గకుండా పోరాడిన వైనం వారిని ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు ఆయన తీరును మాత్రం సమర్థించలేకపోతున్నారు.
చంద్రబాబు నుంచి ఇంకా ప్రాధాన్యత కోరుకుంటున్నారా?
ఏబీవీకి ప్రభుత్వం న్యాయం చేసింది. ఆయనకు సర్వీసు పరంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించింది. రాజకీయంగా ఓ పదవి కూడా ఇచ్చింది.కానీ ఏబీవీ మాత్రం సంతృప్తి పడటం లేదు. ఇంకేదో కోరుకుంటున్నారు. అందుకే ఆయన పదే పదే ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనలో ప్రస్తుతానికి చంద్రబాబు ఉన్నట్లుగా లేరు. ఇప్పుడు లభించిన గుర్తింపు కన్నా ఇంకా ఎక్కువ ప్రాధాన్యం ఆయన కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయం టీడీపీలో వినిపిస్తోంది.
