దగ్గుబాటి ఇంటి నుంచి మరో హీరో వస్తున్నాడు. తనే రానా తమ్ముడు…. అభిరామ్. గత యేడాదిగా అభిరామ్‌ని హీరోగా చేయాలని డి.సురేష్ బాబు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని కథలూ విన్నారు. చివరికి సీనియర్ దర్శకుడు వంశీ చేతిలో అభిని పెట్టేశారు. లేడీస్ టైలర్‌కి సీక్వెల్‌గా – ఫ్యాషన్ డిజైనర్ సినిమాని పట్టాలెక్కిద్దామన్నది వంశీ ఆలోచన. రవితేజ నుంచి రాజ్ తరుణ్ వరకూ చాలామంది ఈ కథ విన్నారు. చివరికి నో అన్నారు. ఇలాంటి సరదా కథతో ఎంట్రీ ఇస్తే అభిరామ్ కెరీర్‌కి ప్లస్ అవుతుందని సురేష్ బాబు కూడా భావించారు. అంతా ఓకే అనుకొన్న సమయంలో పెళ్లి చూపులు సినిమా వచ్చింది. ఆ సినిమా చూసి సురేష్ బాబు ఫ్లాట్ అయిపోయాడు. తరుణ్ భాస్కర్ కి అడ్వాన్సు ఇచ్చేసి.. వంశీని పక్కన పెట్టేద్దామనుకొన్నారు. కొన్ని రోజులుగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలే సుదీర్ఘంగా సాగుతున్నాయి. దాంతో వంశీని పక్కన పెట్టేశారనుకొన్నారంతా. కానీ… వంశీ మళ్లీ లైన్లోకి వచ్చాడు. అభిరామ్‌తో సినిమా చేయడానికి తరుణ్ భాస్కర్ సిద్దంగా ఉన్నా.. అభికి తగిన కథ లేకపోవడంతో… వంశీతో ఎడ్జస్ట్ అవ్వాల్సివస్తోంది. తరుణ్ భాస్కర్ చూపు వెంకటేష్, అఖిల్‌లాంటి హీరోలపై పడింది. పెద్ద హీరోతో సినిమా చేస్తే.. తమ సంస్థకూ లాభసాటిగానే ఉంటుందని సురేష్ బాబు ఫిక్సయ్యారు. దాంతో ఫ్యాషన్ డిజైనర్ సినిమాకి మార్గం సుగమం అయ్యింది. అతి త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.