ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తమపై నమోదు చేసిన రాజద్రోహం కేసులు కుట్రపూరితమని.. తక్షణం ఆ కేసులపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలివ్వాలని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ5 సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండు టీవీ చానళ్లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. ఎంపీ రఘురామకృష్ణరాజు రచ్చబండ పేరుతో పెట్టే ప్రెస్‌మీట్లు టెలీకాస్ట్ చేశారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5లపై రాజద్రోహం కేసులను ఏపీసీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ స్వయంగా నమోదు చేశారు. ఆయనే ఫిర్యాదు దారు. ఆయనే విచారణాధికారి. ఈ క్రమంలో రఘురామకృష్ణరాజును పుట్టినరోజు నాడే అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత వైసీపీ నేతలు.. ఆ రెండు చానళ్ల యజమానులు లేదా కీలక ఉద్యోగుల్ని అరెస్ట్ చేస్తారని.. సోషల్ మీడియాలో బ్లాక్‌మెయిల్ తరహాలో బెదిరింపులు ప్రారంభించారు. రెండు సీఐడీ బృందాలు హైదరాబాద్‌లో ఉన్నాయని… తమకు అనుకూలంగా ఉండే మీడియాకు లీక్ ఇచ్చి ప్రచారం చేశారు. నిజానికి రెండు టీవీ చానళ్లపై కేసులు పెట్టిన అంశం… ఎఫ్ఐఆర్ బయటకు వచ్చే వరకూ తెలియదు. రఘురామరాజు మాట్లాడారని.. టీవీ చానళ్లు ప్రసారం చేశాయని.. ఇదంతా కుట్ర పూరితమని సీఐడీ చెప్పుకొచ్చింది. దీంతో మీడియాపైనా సీఐడీ కుట్ర పన్నిందన్న అభిప్రాయం వినిపించింది. ఈ క్రమంలో… ఈ రెండు చానళ్లు.. తమపై పెట్టిన కేసుల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
నిజానికి రాజకీయ నేతలు మాట్లాడతారు.. టీవీ చానళ్లు ప్రసారం చేస్తాయి. అది వారికి ఉన్న స్వేచ్చ. ఇందులో కుట్ర ఏముందో..న్యాయస్థానాలే తేల్చాల్సి ఉంది. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా… టీవీల్లో ప్రసారం అయిన సీడీలనే ఆధారాలుగా పేర్కొంటూ.. సీఐడీ పెట్టిన కేసు.. ఇప్పుడు దేశ పత్రికా స్వేచ్చకు ఓ ప్రత్యేకమైన పరిస్థితి తీసుకు వచ్చింది. ఏబీఎన్, టీవీ5 చానళ్ల పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు రాజ్యాంగం ప్రకటించిన భావ ప్రకటనా స్వేచ్చ.. మీడియా స్వేచ్చకు అత్యంత కీలకమయ్యే అవకాశం ఉండనుంది.