వారం వారం ‘కొత్త పలుకు’ పేరుతో ఆంధ్రజ్యోతి రీడర్స్ ముందుకు వస్తూ ఉంటారు రాధాకృష్ణ. పేరుకు కొత్త పలుకే గానీ ప్రతి వారం కూడా ఆయన పలికేది పాత పలుకే. ఆయన పలుకులన్నింటిలోనూ అసలు పరమార్థం ఒక్కటే……చంద్రబాబును ఇబ్బంది పెట్టొద్దు. విమర్శించొద్దు. అలా చేయడం తప్పు. అలా చేసేవాళ్ళందరూ నాశనమైపోతారు అని చెప్పడమే. ఈ పలుకు కోసమే రాధాకృష్ణగారు ఆ కాలమ్‌తో రీడర్స్ ముందుకు వస్తున్నారన్నది వాస్తవం. వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబుల వ్యక్తిత్వాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు….వైఎస్ కోసం ప్రాణాలిచ్చేవాళ్ళు, నమ్మకస్తులు చాలా మంది ఉంటారని, కానీ చంద్రబాబును మాత్రం ఎవ్వరూ నమ్మరని చెప్తూ ఉంటారు. కానీ రాధాకృష్ణలాంటి నమ్మకస్తుడైన జర్నలిస్టు(?)ని వైఎస్ సంపాదించుకోగలిగాడా? ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో నష్టాలకోర్చి సాక్షిని నడుపుతున్న వైఎస్ జగన్ ఎంతమంది భక్త జర్నలిస్టులను తయారు చేసుకోగలిగాడు? సాక్షి పత్రికకు అధికారికంగా ఆర్థిక లాభాలు అయితే ఇప్పటి వరకూ వచ్చినట్టుగా లేవు. రాజకీయ లాభం కోసం ఆర్థిక నష్టాలను భరిస్తున్నారు.
ఆ విషయం పక్కన పెడితే ఈ వారం కొత్త పలుకులో కూడా అదే పాత పలుకును పలికేశారు రాధాకృష్ణ. ప్యాకేజే ముద్దు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ పలుకుతున్నారని, అట్టే మాట్టాడితే ప్రత్యేక హోదా మాకు వద్దు అని చెప్తున్నారని రాసుకొచ్చాడు. ప్రత్యేక హోదా కోసం పోరాడేవాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నవాళ్ళేనని జడ్జ్మెంట్ ఇచ్చేశాడు. హోదా కోసం పోరాటం ఎలా చెయ్యాలో కూడా చెప్పుకొచ్చాడు. ధర్నాలు, ఆంధోళనలు, బంద్‌లు లాంటివి అస్సలు వద్దు అని సలహా ఇచ్చాడు. ఇక పోరాటం ఎలా అంటారా? ఏముంది? వెరీ సింపుల్. ఎవరింట్లో వాళ్ళు కూర్చుని చిటికెలు వేయడమే. ఆ చిటికెల ఉద్యమం సౌండ్ కూడా చంద్రబాబు,నరేంద్రమోడీలకు వినిపించకుండా చేయాలి. అలా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా? అన్న ప్రశ్నకు కూడా రాధాకృష్ణ దగ్గర సమాధానం ఉంది. ఏం చేసినా ప్రత్యేక హోదా రాదు. ఆ రాని హోదా కోసం ఏమీ చెయ్యొద్దు. అసలు ప్రత్యేక హోదాని మర్చిపోండి. బిజెపి, టిడిపిల మోసాన్ని మర్చిపోండి అని చెప్తాడు. చంద్రబాబు భవిష్యత్ కోసం కూడా రాధాకృష్ణ బాగానే ఆలోచిస్తున్నాడు. ప్రత్యేక హోదా కోసం తనకు ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఉద్యమం చేయడానికి రెడీ అయిపోతున్న జగన్‌తో కలిసి కమ్యూనిస్టులు పోరాటం చేయకూడదు. అట్టే మాట్లాడితే అసలు బంద్‌లు, ధర్నాలు, ఆందోళనలు చేయడం వళ్ళే కమ్యూనిస్టులు తమ ప్రాభవాన్ని కోల్పోయారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి ఆందోళనలు కూడా చేయకూడదు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు పాలనలో జరుగుతున్న తప్పులను కూడా విమర్శించకూడదు. అప్పుడే మళ్ళీ వాళ్ళకు ప్రజాదరణ పెరుగుతుంది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్‌తో పొత్తు పెట్టుకోకూడదు. చంద్రబాబు ఎలాగూ బిజెపితో కలిసే పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి, ఒకవేళ అంతగా పొత్తు పెట్టుకోవాలి అని అనిపిస్తే చంద్రబాబుకు అనుంగు మిత్రుడైన పవన్‌తో పొత్తు పెట్టుకోవాలి. పవన్ ఎలాగూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని సీట్లలోనూ పోటీ చేసే అవకాశం కూడా లేదు. 2019ఎన్నికల్లో పవన్ గెలుచుకోబోయే కొన్ని సీట్లతో ఎన్నికలయిపోగానే ఎవరికి మద్ధతు ఇస్తాడో? మరోసారి ఎవరిని ముఖ్యమంత్రిని చేయడం కోసం తోడ్పడతాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే.
రాజును మించిన రాజభక్తి అంటే ఇదే. 2019 ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి ఇప్పటి నుంచే అరవీర భయంకర ప్రయత్నాలు చేస్తారన్నమాట. అందుకోసం అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా త్యాగాలు చేయాలి. చంద్రబాబు నాయుడి మాట తీరు కూడా అలాగే ఉంది. రాజకీయ అవసరాల కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబు చేస్తున్న పనులను ప్రశ్నిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలే నష్టపోతారు అని భయపెట్టేస్తున్నారు. 2014ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో ప్రచారం కూడా అలాగే సాగింది. జగన్‌ని గెలిపిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు అని భయపెట్టటానికి చాలా ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా. 2019లో చంద్రబాబును గెలిపించకపోతే సర్వనాశనమే అని ఇప్పటి నుంచే ప్రచారం షురూ చేయనున్నారన్నమాట. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం చంద్రబాబుపైన భ్రమలు ఎప్పుడో పోయాయి. కాకపోతే జగన్‌ని నమ్మే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. అందుకే నాయకులతో పాటు మీడియా ఆడుతున్న డ్రామాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు.