బంగ్లాదేశ్లో సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న షేక్ హసీనా పతనం తర్వాత, ఫిబ్రవరి 12, 2026న తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఈ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని భావిస్తోంది. అయితే, ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ దేశంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ఢాకాలో రాజకీయ వర్గాల మధ్య ఘర్షణలు, నిరసనలు మిన్నంటుతున్నాయి.
షేక్ హసీనా పార్టీపై నిషేధం
బంగ్లాదేశ్ ఎన్నికల ముఖచిత్రం కొత్తగాఉంది. గత 15 ఏళ్లుగా దేశాన్ని ఏలిన షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. మానవ హక్కుల ఉల్లంఘనలు , అల్లర్ల కారణంగా ఆ పార్టీ కార్యకలాపాలను మధ్యంతర ప్రభుత్వం నిషేధించింది. దీంతో ఇప్పుడు ప్రధాన పోటీ తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీ మధ్యే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వీరికి తోడు విద్యార్థి ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన కొత్త పార్టీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
బంగ్లా నేషనల్ పార్టీకే చాన్స్
అంతర్జాతీయ పత్రికలు , తాజా సర్వేల ప్రకారం, ఈ ఎన్నికల్లో బిఎన్పి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవామీ లీగ్ వంటి బలమైన ప్రత్యర్థి లేకపోవడం బిఎన్పికి కలిసివచ్చే అంశం. అయితే, జమాతే ఇస్లామీ వంటి ఇస్లామిక్ పార్టీల ప్రభావం కూడా గణనీయంగా పెరిగింది. మరోవైపు, విద్యార్థి నేతలు ఏర్పాటు చేసిన నేషనల్ సిటిజన్ పార్టీ యువత ఓట్లను చీల్చే అవకాశం ఉంది. అయినప్పటికీ, దేశంలో వ్యవస్థాగత మార్పులు రావాలంటే బిఎన్పియే సరైన ప్రత్యామ్నాయమని మెజారిటీ ఓటర్లు భావిస్తున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.
ఎన్నికలు సజావుగా సాగుతాయా?
ఎన్నికలు సజావుగా సాగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలే ఇందుకు కారణం. శాంతి భద్రతలను కాపాడేందుకు దాదాపు 92,000 మంది సైనికులను ప్రభుత్వం మోహరించింది. అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపకాలపై రాజకీయ పార్టీల మధ్య అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ హిందువులు , ఇతర మైనారిటీలపై దాడులు జరగవచ్చనే భయం నెలకొంది. అంతర్జాతీయ పరిశీలకులు ఈ ఎన్నికలను నిశితంగా గమనిస్తున్నారు.
భారత్తో సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనేది కూడా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది. బంగ్లాదేశ్ చరిత్రలో ఫిబ్రవరి 12 అత్యంత కీలకమైన రోజు. యూనస్ ప్రభుత్వం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి, అధికారాన్ని ఎన్నికైన ప్రభుత్వానికి అప్పగిస్తేనే ఆ దేశంలో ప్రజాస్వామ్యం మళ్లీ ఊపిరి పోసుకుంటుంది. లేనిపక్షంలో, అల్లర్లు మరింత ముదిరి దేశం మరో సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
