ఏడుకొండల వాడి చెంత ఐదేళ్ల పాటు జరిగిన ఘోర అపచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీవేంకటేశ్వరుని ప్రసాద తయారీలో కల్తీ నెయ్యిని వాడారనే నిజం భక్తుల గుండెలను కలచివేస్తోంది. సిబిఐ విచారణలో ఆధారాలతో సహా ఈ దారుణం బయటపడటం, పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే వార్త హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇది కేవలం ఒక నాణ్యత లోపం కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడి. కానీ, ఇంతటి దారుణంపై జరగాల్సిన మేధోమథనం, రావాల్సిన స్పందన ఆశించిన స్థాయిలో లేదు.
రాజకీయ రంగులో కొట్టుకుపోతున్న పవిత్రత
దురదృష్టవశాత్తు, ఈ అత్యంత సున్నితమైన అంశాన్ని కేవలం ఒక రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు చేసుకోవడం, ఆరోపణలు గుప్పించుకోవడానికే పరిమితమయ్యారు. ఇది హిందూ ధర్మంపై జరిగిన అతిపెద్ద దాడిగా పరిగణించి, ధార్మిక కోణంలో నిరసనలు తెలపడానికి ఎవరూ సాహసించడం లేదు. ఐదేళ్ల కాలంలో టీటీడీ బోర్డులో జరిగిన నిర్ణయాలు, అన్యమత ప్రచారం వంటి అంశాలపై అప్పుడప్పుడు గళమెత్తిన వారు కూడా, ఇప్పుడు ఇంతటి అపచారం ఆధారాలతో దొరికినప్పటికీ ఎందుకు ముభావంగా ఉంటున్నారనే ప్రశ్న తలెత్తుతోంది.
పీఠాధిపతుల వైఖరిపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలు:
స్వయం ప్రకటిత పీఠాధిపతులు, హిందూ ధర్మ రక్షకులమని చెప్పుకునే వారి మౌనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో తిరుపతిలో ఒక హోటల్‌కు స్థలం కేటాయించినా లేదా చిన్నపాటి నిబంధన ఉల్లంఘన జరిగినా వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేసిన వారు, నేడు సాక్షాత్తు శ్రీవారి ప్రసాదమే కల్తీ అయిందని తెలిసినా ఎందుకు మౌన ముద్ర దాల్చారు? హిందూ సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన పెద్దలు, ఈ విషయంలో గట్టిగా స్పందించకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటి? అన్యమతస్థుడైన గత పాలకుడికి నొప్పి తగులుతుందనే ఉద్దేశంతోనే వీరు సైలెంట్‌గా ఉంటున్నారా అనే విమర్శలు భక్తుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.
ధర్మ రక్షణ ఎక్కడ?
శ్రీవారి లడ్డూ అంటే కేవలం ఒక తీపి పదార్థం కాదు, అది భక్తుల నమ్మకం. అటువంటి పవిత్రమైన ప్రసాదాన్ని ఐదేళ్ల పాటు అపవిత్రం చేయడం అనేది క్షమించరాని నేరం. చిన్న చిన్న రాజకీయ అంశాలకు స్పందించే ధార్మిక సంస్థలు, ఇంత పెద్ద ఘోరంపై మౌనం వహించడం వారి ద్వంద్వ నీతిని ఎండగడుతోంది. రాజకీయాలకు అతీతంగా, హిందూ సమాజం అంతా ఏకమై ఈ అపచారాన్ని ఖండించాల్సిన సమయం ఇది. లేని పక్షంలో, భవిష్యత్తులో మరిన్ని అపచారాలు జరిగే అవకాశం ఉందన్న ఆందోళన భక్తులలో నెలకొంది. ఈ మౌనం ఇలాగే కొనసాగితే, ధర్మ రక్షకులుగా చెప్పుకునే వారి ఉనికినే భక్తులు ప్రశ్నించే రోజు దగ్గరలోనే ఉంది.
