హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తోంది. గతంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా 2BHK ఇళ్లకు మొగ్గు చూపేవారు, కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. నగరంలో 2BHK కంటే 3BHK , 4BHK ఇళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు ఆనుకుని ఉన్న కోకాపేట, నార్సింగి , తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ అపార్ట్మెంట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
ఈ మార్పుకు ప్రధాన కారణం వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి అని బిల్డర్ల అసోసియేషన్ ప్రతినిధులు విశ్లేషిస్తున్నారు. సాఫ్ట్వేర్ , ఇతర కార్పొరేట్ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాల్సి రావడంతో, ఒక ప్రత్యేకమైన ఆఫీసు గది అవసరమవుతోంది. అందుకే బెడ్రూమ్లతో పాటు అదనంగా ఒక గది ఉండేలా 3BHK , 4BHK ఫ్లాట్లను కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. కేవలం నివసించడమే కాకుండా, ప్రశాంతంగా పని చేసుకునే వాతావరణం కోసం ఎంతటి భారీ ధరనైనా చెల్లించేందుకు వెనకాడటం లేదు.
కోకాపేట వంటి ప్రాంతాలు ఇప్పుడు లగ్జరీకి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ఇక్కడ చదరపు అడుగు ధర దాదాపు 9,000 నుండి 15,000 వరకు పలుకుతున్నా, అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. గేటెడ్ కమ్యూనిటీల్లోని అధునాతన వసతులు, విశాలమైన బాల్కనీలు, జిమ్, క్లబ్ హౌస్ వంటి సౌకర్యాలు సంపన్న వర్గాలను ,సీనియర్ ఐటీ ప్రొఫెషనల్స్‌ను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కూడా ప్రజలు పెద్ద ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటికి వచ్చే అతిథుల కోసం లేదా పిల్లల చదువుల కోసం అదనపు స్థలం ఉండటం అవసరమని వారు భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ నిపుణుల అంచనా ప్రకారం, 2026 చివరి నాటికి హైదరాబాద్‌లోని మొత్తం అపార్ట్మెంట్ అమ్మకాల్లో 3BHK , అంతకంటే పెద్ద ఇళ్ల వాటా 60 శాతానికి పైగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిణామం హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత ఖరీదైన , విలాసవంతమైన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా నిలబెడుతోంది.
