ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మకమైన గూగుల్ ఏఐ డేటా సెంటర్ హబ్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ భారీ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం ఈనెల 28న అత్యంత వైభవంగా జరగనుంది. సుమారు 1.25 లక్షల కోట్ల రూపాయల అసాధారణ పెట్టుబడితో గూగుల్ తన అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ద్వారా ఈ కేంద్రాన్ని నెలకొల్పుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ హాజరుకానున్నారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ , ఇతర పరిపాలనాపరమైన అనుమతులు దాదాపు పూర్తికావడంతో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని అడవివరం, తర్లువాడ , అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి ప్రాంతాల్లో కలిపి మొత్తం 601.4 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ఈ మూడు ప్రాంతాల్లోని స్థలాలను చదును చేసే పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. పర్యావరణ నిబంధనలకు లోబడి, స్థిరమైన ఇంధన వనరుల వినియోగంతో ఈ గ్రీన్ డేటా సెంటర్‌ను నిర్మించనున్నారు.
భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా భావిస్తున్న ఈ ప్రాజెక్టులో అదానీ ఇన్ఫ్రా భాగస్వామ్య సంస్థగా వ్యవహరిస్తోంది. ఈ డేటా సెంటర్ కేవలం సమాచార నిల్వకే పరిమితం కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలు, క్లౌడ్ కంప్యూటింగ్ , గ్లోబల్ టెక్ సర్వీసులకు ప్రధాన కేంద్రంగా మారుతుంది. 1 గిగావాట్ సామర్థ్యంతో నిర్మించనున్న ఈ హబ్ ద్వారా ప్రత్యక్షంగా , పరోక్షంగా వేలాది మంది యువతకు సాఫ్ట్వేర్, డేటా అనలిటిక్స్ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
విశాఖపట్నం కేంద్రంగా రాబోతున్న ఈ ఏఐ హబ్ ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేస్తుందని ఐటీ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రాజెక్టును జూలై 2028 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్నది గూగుల్ లక్ష్యం. దీని వల్ల ఏపీకి మరిన్ని అంతర్జాతీయ టెక్ కంపెనీలు తరలివచ్చే అవకాశం ఏర్పడటమే కాకుండా, రాష్ట్రాన్ని ఏఐ రాజధానిగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పం వేగంగా కార్యరూపం దాల్చుతోంది.
