ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న జగన్ రైట్ హ్యాండ్స్ ముగ్గురికి షాక్ తగిలింది. బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు శుక్రవారం కొట్టివేసింది.
కొద్దిరోజులుగా మధ్యంతర బెయిల్ పై బయట ఉన్న ఈ నిందితులకు ఏసీబీ కోర్టు తాజా తీర్పుతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురైనంగున వీరు తిరిగి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టు ఆదేశాల మేరకు వీరు వెంటనే సంబంధిత అధికారుల ముందు లొంగిపోవాల్సి ఉంటుంది లేదా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించనున్నారు. అయితే అప్పీల్ చేసుకోవడానికి వీరికి రెండు వారాల గడువు లభించింది.
విచారణ సందర్భంగా ఏసీబీ తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. ఈ కుంభకోణం వేల కోట్ల రూపాయలకు సంబంధించిందని, నిందితులు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టుకు వివరించారు. నిందితుల తరపు న్యాయవాదులు అనారోగ్య కారణాలు, దర్యాప్తుకు సహకరిస్తామన్న హామీలను కోర్టు ముందు ఉంచినప్పటికీ, ఏసీబీ కోర్టు ప్రాథమిక ఆధారాలను పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్ బెయిల్ నిరాకరించింది.
ఈ ముగ్గురూ జగన్ తరపునే పనులు చక్కబెట్టారు. రెండు వారాల్లో వీరు అప్పీలుకు వెళ్లి రిలీఫ్ తెచ్చుకోవాల్సిన ఉంది. లేకపోతే జైలుకు వెళ్లడం మినహా వీరికి ప్రస్తుతానికి వేరే మార్గం లేదు.
