కడపలో హత్యకు గురైన పెద్దదస్తగిరి విషయంలో వైసీపీ పెద్దలు భుజాలు తడుముకుంటున్న తీరు అనేక అనుమానాలు కలిగేలా ఉన్నాయి. పెద్ద దస్తగిరి హత్యకు గురైన రోజున గంజాయి ముఠాల అధిపత్య పోరాటం అన్నట్లుగా ప్రచారం చేశారు. సాక్షి మీడియా చాలా పెద్ద కథనం రాసింది. అంతపెద్ద కథనం రాయాల్సిన అవసరం ఏమిటో తర్వాత అర్థమైంది. ఆ పెద్ద దస్తగిరి హత్య వెనుక చాలా ఉన్నాయి. బహిరంగ మార్కెట్ లో ఐదువందల కోట్లకు తగ్గని ఆస్తులు పెద్దదస్తగిరి పేరు మీద ఉన్నాయి. అసలు ఆ ఆస్తులు ఎవరివో ఇప్పుడు బయటకు రావాల్సి ఉంది.
హత్య వెనుక బినామీ ఆస్తుల యుద్ధం?
ఓ రాజకీయ పార్టీ నేతకు అనుచరుడు.. ఎలాంటి ఆదాయం లేని ఒక మధ్యస్థాయి నేతకు ఇంత భారీ ఎత్తున ఆస్తులు ఎలా వచ్చాయి? ఇవి నిజంగా ఆయనవేనా ..ఆయనవి కాకపోతే ఎవరివి? ఆస్తుల వాటాల్లో తలెత్తిన తేడాలే ఈ హత్యకు దారితీశాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ హత్య కేసులో కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డిని ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగినప్పటి నుండి ఆయన పరారీలో ఉండటం, వైసీపీకి చెందిన కీలక నేతలతో ఆయనకున్న సంబంధాలు అనేక అనుమానాలను బలపరుస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసినప్పటికీ, అసలు కుట్రదారులు ఎవరనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. నిత్యానంద రెడ్డి పట్టుబడితేనే ఈ హత్య వెనుక ఉన్న రాజకీయ తలకాయల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.
క్లీన్ చిట్ డ్రామా – భార్య ప్రకటనపై అనుమానాలు
విచిత్రమైన విషయం ఏమిటంటే, తన భర్త హత్యకు గురైన పుట్టెడు దుఃఖంలో ఉండాల్సిన దస్తగిరి భార్యను వైసీపీ నేతలు మీడియా ముందుకు తీసుకువచ్చి, ఈ హత్యకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని ప్రకటన చేయించడం. ఒక సామాన్య మహిళ అంత వేగంగా పార్టీని వెనకేసుకొస్తూ మాట్లాడటం వెనుక ఎవరి ఒత్తిడి ఉంది? బాధల్లో ఉన్నవారినిని క్లీన్ చిట్ ఇప్పించడానికి వాడుకోవడం రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది. ఇది కేవలం తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని భావిస్తున్నారు.
ముఠాను బయట పెట్టాల్సిందే
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేవలం హత్య చేసిన వారినే కాకుండా, ఆ ఆస్తుల వెనుక ఉన్న అసలు యజమానులను కూడా బయటకు తీసుకురావాలని దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి ఉంది. ఒకవేళ విచారణలో ఈ ఆస్తులన్నీ బినామీలవని తేలితే, వైసీపీలోని కీలక నేతలకు చట్టపరమైన చిక్కులు తప్పవు. వందల కోట్ల ఆస్తులు, రాజకీయ అండదండలు ఉన్న ఈ కేసులో నిజాలు నిగ్గుతేల్చకపోతే, భవిష్యత్తులో బినామీ ఆస్తుల కోసం మరిన్ని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.


