హైదరాబాద్ పశ్చిమ దిశగా రియల్ ఎస్టేట్ రంగం అనూహ్యంగా విస్తరిస్తోంది. ఐటీ కారిడార్‌కు చేరువగా ఉండటంతో శంకరపల్లి, చేవెళ్ల, కందవాడ వంటి ప్రాంతాలు ఇప్పుడు ఇన్వెస్టర్లకు హాట్ స్పాట్లుగా మారాయి. వందలాది ఎకరాల్లో కొత్త వెంచర్లు వెలుస్తుండటంతో ఈ ప్రాంతాల ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. అయితే, ఈ రియల్ జోరులో నిబంధనల ఉల్లంఘనలు కూడా అదే స్థాయిలో జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో చాలామంది డెవలపర్లు హెచ్ఎండీఏ నుంచి రావాల్సిన చట్టబద్ధమైన అనుమతులను పక్కన పెట్టి, కేవలం గ్రామ పంచాయతీ అనుమతులతోనే భారీ లేఅవుట్లు వేస్తున్నారు. చట్టప్రకారం హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే భూముల్లో లేఅవుట్లకు ఆ సంస్థ అనుమతి తప్పనిసరి. కానీ, తక్కువ ధరకే ప్లాట్లు వస్తాయన్న కొనుగోలుదారుల ఆశను ఆసరాగా చేసుకుని, అక్రమ వెంచర్లను ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
ఈ పరిణామాలపై అప్రమత్తమైన హెచ్ఎండీఏ , రెవెన్యూ అధికారులు అక్రమ లేఅవుట్లపై కొరడా ఝుళిపిస్తున్నారు. గత రెండు రోజులుగా శంకరపల్లి, చేవెళ్ల పరిసరాల్లోని పలు అక్రమ వెంచర్లలో నిర్మించిన రోడ్లు, డ్రైనేజీ పైపులు, ఇతర నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. అనుమతులు లేని ప్లాట్లను కొనుగోలు చేసి మోసపోవద్దని, ఏదైనా వెంచర్లో పెట్టుబడి పెట్టే ముందు రేరా , హెచ్ఎండీఏ గుర్తింపు ఉందో లేదో సరిచూసుకోవాలని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
రాబోయే రోజుల్లో ఈ తనిఖీలు మరింత ముమ్మరం కానున్నాయి. అక్రమ లేఅవుట్లకు సహకరిస్తున్న స్థానిక అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. పశ్చిమ హైదరాబాద్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
