జగన్ రెడ్డి ఎండలకు తాళలేక యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. కుటుంబంతో సహా యూరప్ లో పర్యటించేందుకు 25 రోజుల పర్మిషన్ కావాలని ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ వేసుకున్నారు. ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు ఆయనకు అనుమతి మంజూరు చేసింది. అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న జగన్.. ఆయన విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలి. పాస్ పోర్టు కోర్టులోనే ఉంటుంది. కోర్టు అనుమతిస్తేనే పాస్ పోర్టు ఇస్తారు.
విదేశాలకు వెళ్లే ముందు సీబీఐ అధికారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీని ఇవ్వాలనికోర్టు ఆదేశించింది. గతంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఎవరిదో ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లారు. ఈమెయిల్ కూడా స్పందించలేదు. దీంతో వెంటనే సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ జగన్ పర్యటనను కుదించుకుని వచ్చేశారు. ఆయన వచ్చేసినందుకు ఆ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. ఈ సారి ఆయన తన అసలైన ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఇవ్వకపోతే మరోసారి సీబీఐ నిబంధనల ఉల్లంఘన కింద కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది.
జగన్మోహన్ రెడ్డి పిల్లలు ఎప్పుడో ఉన్నత చదువుల కోసం యూరప్ వెళ్లారు. చదువులు పూర్తయ్యాయి. గ్రాడ్యూయేషన్ డే కు కూడా వెళ్లివచ్చారు. అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు కానీ.. వారు మాత్రం లండన్ లోనే ఉంటారని చెబుతారు. జగన్ కూడా విదేశాలకు వెళ్తే లండన్ మాత్రమే వెళ్తారు.