లోక్సభ సీట్ల సంఖ్యను పెంచే క్రమంలో కేవలం జనాభాను ప్రాతిపదికగా తీసుకోకుండా, 50 శాతం సీట్లను జనాభా ప్రాధాన్యతపై, మిగిలిన 50 శాతం సీట్లను ఆయా రాష్ట్రాల జీడీపీ సహకారం ఆధారంగా కేటాయించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. అయితే, ఈ ప్రతిపాదనపై జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల ప్రాతినిధ్యమే తప్ప, డబ్బు లేదా ఆర్థిక స్థితిగతులు కాదని అంటున్నారు. సంపదను బట్టి రాజకీయ అధికారాన్ని పంచడం అనేది భారత రాజ్యాంగంలోని ఒక వ్యక్తి – ఒక ఓటు – ఒకే విలువ అనే ప్రాథమిక సూత్రానికే విరుద్ధమని తేల్చేస్తున్నారు.
తేజస్వీ సూర్య ఘాటు విమర్శలు
ఈ అంశంపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంట్ సాక్షిగా రేవంత్ రెడ్డి ప్రతిపాదనను తీవ్రంగా ఖండించారు. జీడీపీ అనేది ఏటా మారుతుంటుందని, అస్థిరంగా ఉండే ఆర్థిక గణాంకాలను బట్టి నియోజకవర్గాలను ఎలా నిర్ణయిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం హాస్యాస్పదమైన ప్రతిపాదన మాత్రమే కాకుండా, దేశంలో ఉన్నవారు – లేనివారు అనే విభజనను సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలకే ఎక్కువ రాజకీయ అధికారం ఇవ్వాలనడం ప్రజాస్వామ్యాన్ని ధనిక తంత్రం గా మార్చడమేనని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఈ ప్రతిపాదన జాతీయ స్థాయిలో ఏమాత్రం ఆదరణ పొందలేకపోయింది
దేశ సమగ్రతకు ముప్పు
దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందున్నందున రాజకీయంగా నష్టపోకూడదనే రేవంత్ ఆవేదన సమంజసమే అయినప్పటికీ, దానికి ఆయన ఎంచుకున్న పరిష్కారం ప్రమాదకరంగా ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జీడీపీ ప్రాతిపదికన సీట్ల పంపిణీ చేస్తే, అది ఉత్తర , దక్షిణ రాష్ట్రాల మధ్య తీవ్రమైన విద్వేషాలకు దారితీస్తుంది. దేశంలో ప్రాంతీయ అసమానతలు ఉన్న మాట వాస్తవమే అయినా, వాటిని ఆర్థిక లావాదేవీల ద్వారా రాజకీయ అధికారంతో ముడిపెట్టడం దేశ సమగ్రతకు చిచ్చు పెట్టడమేనన్న వాదన వినిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ కూడా మౌనం
ప్రారంభంలో రేవంత్ ప్రతిపాదనకు మద్దతు లభించినట్లు అనిపించినా, ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా దీనిపై మౌనం పాటిస్తోంది. జాతీయ పార్టీగా దేశవ్యాప్తంగా ఓట్లు సంపాదించాల్సిన కాంగ్రెస్, కేవలం ఆర్థిక సహకారం ఆధారంగా సీట్ల పెంపును సమర్థించడం వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా నష్టపోయే అవకాశం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలే ఈ హైబ్రిడ్ మోడల్ ను ప్రచారం చేయడానికి వెనుకాడుతున్నారు. రేవంత్ కూడా ఈ ప్రతిపాదనను మరింత ముందుకు తీసుకెళ్లలేక, ఆత్మరక్షణలో పడ్డట్లు కనిపిస్తోంది. పునర్విభజన సమస్యకు పరిష్కారం అన్వేషించాల్సిందే కానీ, అది రాజ్యాంగ పరిమితులకు లోబడి ఉండాలి. అందుకే రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ విఫల ప్రయోగంగా మారింది.


