ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 14 నుంచి 16 వరకు సుమారు 150 మంది పార్టీ ముఖ్య నేతలతో కలిసి దేశ రాజధాని ఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇటీవల ఆయన ప్రకటించిన సేన గళం కమిటీ ఉద్దేశాలను దేశ ప్రజలకు, జాతీయ మీడియాకు వివరించడమే ఈ పర్యటన ప్రధాన అజెండాగా కనిపిస్తోంది. కేవలం ఏపీ రాజకీయాలకే పరిమితం కాకుండా, ఒక ప్రాంతీయ పార్టీ అధినేత ఇంత పెద్ద ఎత్తున ఢిల్లీ వేదికగా ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
జనసేనను జెన్ జీ గొంతుకగా మారే ప్రయత్నం
పవన్ కల్యాణ్ సేన గళం కమిటీని కేవలం ఒక రాజకీయ విభాగంగా కాకుండా, దేశంలోని నూతన తరం యువత ఆశయాలకు, ఆకాంక్షలకు ప్రతిబింబంగా అభివర్ణించారు. ప్రస్తుత కాలంలో యువత సాంప్రదాయ కుల, ప్రాంతీయ రాజకీయాల కంటే పారదర్శకత, రాజ్యాంగ విలువలు, అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఢిల్లీ వేదికగా సేన గళం ఉద్దేశాలను ప్రకటించడం ద్వారా, జనసేన కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రాంతీయ శక్తి మాత్రమే కాదు, దేశవ్యాప్త యువత ఆలోచనలకు ప్రాతినిధ్యం వహించగల ఐడియాలజీ ఉన్న పార్టీ అని నిరూపించుకోవాలని పవన్ భావిస్తున్నారు.
కుల, విభజన రాజకీయాలకు చెక్
ఇటీవలి కాలంలో వ్యూహాత్మకంగా సాగుతున్న కుల ఆధారిత దాడులు, వ్యక్తిగత తప్పులను మొత్తం సామాజిక వర్గాలకు ఆపాదించే వికృత రాజకీయ ధోరణిని పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యక్తిగత తప్పులకు కులాలను, మతాలను బాధ్యులను చేయకూడదు అనే లైన్‌ను ఆయన బలంగా తీసుకున్నారు. ఈ సరికొత్త రాజకీయ సంస్కృతిని, సామాజిక సామరస్య సందేశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ఢిల్లీ కంటే ఉత్తమమైన వేదిక లేదు. నేషనల్ మీడియా ముఖంగా ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా దేశవ్యాప్తంగా ఒక హెల్తీ పొలిటికల్ డిబేట్‌కు ఆయన తెరలేపుతున్నారు.
మిత్రపక్షంగా ఎన్డీఏలో కీలక స్థానం
ఢిల్లీ పర్యటన వెనుక స్పష్టమైన రాజకీయ సమీకరణాలు కూడా ఉన్నాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి జనసేన ఒక నమ్మకమైన, కీలకమైన భాగస్వామి. దాదాపు 150 మంది జనసేన నేతలతో ఢిల్లీకి వెళ్లడం ద్వారా కేంద్రంలోని బీజేపీ పెద్దలకు జనసేన కేడర్ బలాన్ని, క్రమశిక్షణను ప్రదర్శించనున్నారు. ఏపీలో టీడీపీతో కలిసి ప్రభుత్వం నడుపుతున్నప్పటికీ, జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పవన్ చేస్తున్న ప్రయత్నమిది. భవిష్యత్తు జాతీయ రాజకీయాల్లో జనసేనకు మరింత ప్రాధాన్యత దక్కేలా పునాది వేస్తున్నారు.
బ్రాండ్ పవన్ కల్యాణ్
గత ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో సంచలన విజయం సాధించినప్పటి నుండి పవన్ కల్యాణ్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో విపరీతంగా పెరిగింది. సనాతన ధర్మ పరిరక్షణ నుంచి పర్యావరణం, సుపరిపాలన వరకు ఆయన మాట్లాడే మాటలు దేశవ్యాప్తంగా మార్మోగుతున్నాయి. పవన్ కల్యాణ్ ఈ మూడు రోజుల ఢిల్లీ పర్యటనను కేవలం ఒక పొలిటికల్ టూర్లా కాకుండా, జనసేన సిద్ధాంతాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఒక లాంచ్ ప్యాడ్లా వాడుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీలు సాధారణంగా నిధులు లేదా ప్రాజెక్టుల కోసం ఢిల్లీ వెళ్తుంటాయి, కానీ ఒక వినూత్న పొలిటికల్ ఐడియాలజీని దేశ ప్రజలకు వివరించడానికి 150 మంది ప్రతినిధులతో వెళ్లడం అనేది భారతీయ రాజకీయాల్లోనే ఒక సరికొత్త ప్రయోగం అనుకోవచ్చు.


