పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితి కారణంగా దేశంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టబోతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ సంక్షోభ ప్రభావం పడే అవకాశం ఉన్నందున, వ్యయ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కూడా మళ్లీ ఆగిపోతుందేమోనన్న అనుమానాలు, ఆందోళనలు కొందరిలో వ్యక్తమయ్యాయి. అయితే, ఈ అపోహలన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమరావతి భవిష్యత్తుపై అత్యంత బలమైన భరోసా ఇచ్చింది.
ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆగదు అమరావతి
భౌగోళిక రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ, దేశీయంగా వ్యూహాత్మక ప్రాజెక్టుల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ తాజా నిర్ణయాల ద్వారా నిరూపించారు. దానికి సజీవ సాక్ష్యమే.. తాజాగా బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో అమరావతికి లభించిన భారీ వరాలు. అమరావతి రాజధాని ప్రాంతంలో రూ. 2,533 కోట్లకు పైగా అంచనా వ్యయంతో సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ , కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి మోదీ సర్కార్ అధికారికంగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఇప్పటికే టెండర్లు పూర్తి
ఈ కేబినెట్ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ, పరిపాలనాపరమైన వ్యూహం దాగి ఉంది. దాదాపు 23.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, రెండు భారీ టవర్లతో నిర్మించబోయే ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ద్వారా సుమారు 8,000 మంది కేంద్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఒకే చోటు నుంచి పనిచేసే వీలు కలుగుతుంది. దీనికి అదనంగా మరో రూ. 1,234 కోట్లతో 11 నివాస టవర్ల నిర్మాణాన్ని కూడా ఆమోదించారు. అంతర్జాతీయంగా ఎలాంటి సంక్షోభం ఎదురైనా, ఏపీ రాజధానిగా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పానికి కేంద్రం కట్టుబడి ఉందనడానికి ఈ ప్రాజెక్టుల మంజూరే అతిపెద్ద నిదర్శనం.
కేంద్రం పాలసీ చేతల్లోనే క్లారిటీ!
ఈ నిర్ణయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి , అమరావతిని నమ్ముకున్న రైతులకు కొండంత అండగా నిలుస్తుంది. గతంలో అమరావతి విషయంలో జరిగిన కాలయాపనను సరిదిద్దుతూ, కేంద్ర పట్టణాభివృద్ధి, ఆర్థిక శాఖల సమన్వయంతో ప్రాజెక్టును శరవేగంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మోదీ స్వయంగా భుజాన వేసుకున్నట్లు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ పరిణామాల సాకుతో అమరావతిని దెబ్బతీయాలని చూసిన విపక్షాల విమర్శలకు, ఈ రూ. 2,500 కోట్ల కేంద్ర కేబినెట్ ఆమోదం ఒక ‘మాస్టర్ స్ట్రోక్’ అని చెప్పవచ్చు. ఈ పరిణామంతో అమరావతి కేవలం ఏపీ రాజధానిగానే కాక, దేశంలోనే ఒక కీలక పరిపాలనా హబ్‌గా మారబోతోందనే నమ్మకం బలపడింది.
